చీకటి మాటున దాగిన వేకువ

సమకాలీనం
తామెక్కి వచ్చిన మెట్లను ఒకటొకటిగా కూల్చే బాపతు పాలకపక్షాలు నిరసన దారులన్ని టినీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే.. మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మంటాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కనుమరుగవుతాయి. పాలకపక్షాలు ఏదీ, ఎక్కడ ప్రత్యామ్నాయం? అని విర్రవీగినప్పుడే చడీచప్పుడు లేకుండా బలమైన ప్రత్యామ్నాయం ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. అన్ని దారులు మూసుకుపోయినట్టున్నా, ఏదో దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణం!

‘ఒక దుర్బల ఊరపిచ్చుకను గరుత్మంతునితో పోరాడించు, ఓ నిరుపేద కార్మికుని శరీరంలో కనలే రక్తానికి నిరసన నిప్పురవ్వ జోడించు.... విప్లవం దానంతట అదే వస్తుంది’ అంటాడు మహాకవి ఇక్బాల్‌. ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమార హమారా...’’ అని ప్రపం చానికి ఎలుగెత్తి చాటిన ఆయన, దేశం ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే తీవ్రంగా కలత చెందివుండేవాడే! ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు అవసరమైన వాతావరణం దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పలుచనవుతోంది. పలు వ్యవస్థల్ని పాలకులు పనిగట్టుకొని పలుచన చేస్తున్నారు. ఏకస్వామ్య పాలనా వ్యవస్థల్ని నిరాఘాటంగా నడపాలనే దూరదృష్టితో ప్రజాస్వామ్య వాతావరణాన్నే కకావికలు చేస్తున్నారు. ఆలోచించే మెదళ్లని, నిలదీసే స్వరాల్ని, ప్రశ్నించే గొంతుకల్ని కర్కశంగా నలిపేస్తున్నారు.

విప్లవాలు, పోరా టాల సంగతలా ఉంచితే, ఈ సర్కార్ల నీడలో ఆరోగ్యవంతమైన చర్చ, అవసరానికి పనికొచ్చే ఓ ఆలోచన కూడా చేయలేని సమాజం మెలమెల్లగ బలోపేతమౌతోంది ఇప్పుడు. వేర్వేరు కారణాలతో పౌరసమాజం స్వరం మెత్తబడుతున్న క్రమంలోనే ఓ బలహీనమైన సమాజం రూపుదిద్దుకునే పరిస్థితుల్ని ఎగదోస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఒకటి రెండు చోట్ల మినహా, పాలకపక్షాల దాష్టీకాలకు విపక్ష రాజకీయ పార్టీలు నిలబడలేకపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలే తప్ప ఆర్థిక విధానాల్లో మార్పుల్లేని ప్రత్యామ్నాయాలు కూడా ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నాయి. అందుకే అనిశ్చితి. అన్ని చోట్లా పూర్తిస్థాయి వ్యతిరేకత అని చెప్పలేకపోయినా, లోలోపల ఓ అసం తృప్తి, ఆవేదన, అలసట మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్రజా స్వామికంగా పావులు కదుపుతూనే, ‘మమ్మల్ని కాదంటే, ప్రత్యామ్నాయం ఏముందో చూపండి?’ అనేంతగా పాలకపక్షాల ధీమా ఎల్లలు దాటుతోంది! ప్రత్యర్థుల్ని చిత్తు చేసే ఎత్తులు–పైఎత్తుల రాజకీయ జిత్తుల్లో... ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, వాటి అంగాంగాల నుంచి వెలువడే సమాచారాన్ని సగటు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితులు పౌరుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాలకులు ఏక పక్షంగా తమ అనుకూల సమాచారాన్ని వారిపై రుద్దుతున్నారు. తమకు గిట్టని, ఇరుకున పెట్టే సమాచారాన్ని అధికార బలంతో అడ్డుకుంటున్నారు.  ప్రత్యక్షంగా–పరోక్షంగా ఒత్తిళ్లు, అణచివేతలు పెంచి సగటు జీవి స్వతం త్రంగా ఆలోచించలేని, స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేయలేని దుర్భర వాతా వరణం కల్పిస్తున్నారు. ఇదిలాగే బలపడి, రేపు ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అన్నది కార్యరూపం దాలిస్తే.... సమాఖ్య వ్యవస్థ అయినప్పటికీ రాష్ట్రాల్లో  పరిస్థితులెలా ఉంటాయోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతు న్నారు.

అవి ఎడారిలో ఒయాసిస్సులు!
ఈ గాంధీ జయంతి రోజున నగరంలో ఓ మేధోచర్చ (మంథన్‌ సంవాద్‌) జరిగింది. వివిధ రకాల ఆలోచనా ధారలకు ప్రాతినిధ్యం వహించే ఏడుగురు ముఖ్యులు ప్రసంగాలు చేశారు. 2,500 మంది కూర్చునే వ్యవస్థ కలిగిన ‘శిల్పకళావేదిక’, నిర్వాహకులు ఒక్క వాహనమైనా ఏర్పాటు చేయకుండానే స్వచ్ఛందంగా వచ్చిన సభికులతో నిండిపోయింది. అన్ని వయసుల, వర్గాల, ప్రాంతాల వారూ హాజరయ్యారు. లభించిన పరిమిత సమయంలో కూడా మంచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ (న్యాయ), కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా (రాజకీయం), జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సుచేతా మహాజన్‌ (చరిత్ర), పాటల రచయిత, దర్శకుడు వరుణ్‌ గ్రోవర్‌ (కళలు), తక్షశిల సంస్థకు చెందిన నితిన్‌ పాయ్‌ (విద్య), ఎన్సీపీఆర్‌ఐ నిఖిల్‌డే (సామాజిక), సీనియర్‌ జర్నలిస్టు రవీశ్‌కుమార్‌(జర్నలిజం)లు చేసిన చక్కటి ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది. అంతకు మునుపు నగరంలో ‘హైదరాబాద్‌ కలెక్టివ్‌’ ‘కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌’ ‘కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌’ ‘ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌’ తదితర సంస్థలు కూడా పేరున్న వక్తల్ని, మేధావుల్ని రప్పించి పలు చర్చా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశాయి. సగటు పౌరుల్లో ఆరోగ్యవంతమైన చర్చను, అర్థవంతమైన ఆలోచనల్ని రేకెత్తించే ఇటువంటి వేదికల అవసరం ఇంకెంతో ఉంది.

వాస్తవాలకు రాజకీయ రంగులు పులమకుండా, సమాజం పట్ల తమ బాధ్యతగా భావించి ఉన్నది ఉన్నట్టు చెప్పే, అదీ ప్రభావవంతంగా మాట్లాడే వారితో చర్చా కార్యక్రమాలు ఒక్క తెలుగునాటనే కాకుండా దేశవ్యాప్తంగా జరగాల్సి ఉంది. హైదరాబాద్‌ స్థాయి దాటి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి .... ఇలా చిన్న నగరాలు, పట్టణాలకూ ఈ సంస్కృతి విస్తరించాలి. తెలుగులో ప్రసంగాలు చేసే విశ్వసనీయత కలిగిన మేధావుల్ని చొరవ తీసుకొని ఒక వేదిక మీదకు తేగలగాలి. ప్రజల ఆలోచనా పరిధిని విస్తరింపజేసి, తద్వారా సరైన నిర్ణ యాల వైపు వారిని నడిపే ఈ చైతన్యం మరింత కింది స్థాయికి విస్తరించాల్సిన అవసరాన్ని విశాల జనహితం కోరేవారు కాంక్షిస్తున్నారు.

రాజకీయేతర ప్రత్యామ్నాయాలే దన్ను!
ప్రజాస్వామ్యం అంటే, అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల నడుమ పాలకుల య«థేచ్ఛ, విచ్చలవిడితనం కాదు. ఒకసారి ఎన్నికలు జరిగిపోతే, మళ్లీ ఎన్నికలు జరిగే అయిదేళ్ల వరకు పౌరులు ఏమీ చేయజాలని అశక్తతా కాదు! మరేంటి? ప్రజల స్వీయ నిర్ణయాధికారం. ప్రజాభిప్రాయానికి విలువ ఉండాలి. ప్రజలకు బలమైన అభిప్రాయాలుండాలి. అవి ఏర్పరచుకోవడానికి అవసరమైన వాస్తవిక సమాచారం అందాలి. పాలకులు కొన్ని మోసపు టెత్తుగడలతో పన్నే ఉచ్చుల్లో సామాన్యులకు అర్థం కాని మార్మికతను విప్పి చెప్పేలా మేధావివర్గం పూనిక వహించాలి. అందుకొక ఆరోగ్యవంతమైన చర్చ, ఉపయుక్త ఆలోచనా పరంపర సాగాలి. వివిధ వేదికల నుంచి అవి వ్యక్తం కావాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో దానికి తగినంత చోటిచ్చే భూమిక లభించాలి. రాజకీయ వ్యవస్థ, పాలకులు సదరు వాతావరణాన్ని కొనసాగనివ్వాలి. ‘మంథన్‌’ అందులో భాగమే! ఇవి మరిన్ని ఏర్పడి వాస్తవ సమాచారాన్ని జనబాహుళ్యంలోకి జొప్పిస్తే ప్రజల విచక్షణ పెరిగి, నిర్ణయా ధికారం వినియోగంలోకి వస్తుంది. పౌరులు జాగృతమై ప్రభుత్వాల నియం తృత్వ ధోరణుల్ని నిలువరించగలుగుతారు.

కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభు త్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను అమలుపరుస్తూ మొండి వైఖరి వహిం చినా కూడా, ప్రజల ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గిన పరిస్థితులకు ఇలాంటి పౌరసమాజపు ఒత్తిళ్లే కారణం. తాజా ఉదాహరణ పెట్రోల్‌–డీజిల్‌ ధరల వ్యవహారమే! అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ధర బ్యారెల్‌ 120 డాలర్లున్న పుడు ఇక్కడ లీటరు పెట్రోలు గరిష్టంగా 80 రూపాయలుంటే, ఇప్పుడు బ్యారెల్‌ క్రూడ్‌ ధర 50 డాలర్లకు పడిపోయినా... లీటరు పెట్రోలు ధర సగటున 75 రూపాయలుంటోంది! ఎంత మంది సర్కారు ఆర్థికవేత్తలు ఎన్ని లెక్కలు చెప్పినా అది పొసగటం లేదు. స్వయంగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి ‘ఏం చేయలేం, ధర తగ్గించడం అసాధ్యం’ అన్న తర్వాత కూడా ప్రజాభి ప్రాయాన్ని మన్నించి కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి తాను ధరలు తగ్గించడమే కాకుండా, రాష్ట్రాలను కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించుకొమ్మని ప్రతిపాదించాల్సి వచ్చింది. పౌరసమాజం మరింత చేత నతో, వ్యవస్థీకృతంగా ఉంటే ఎన్నెన్నో సాధించుకోవచ్చని ఈ పరిణామం చెబుతోంది.

ఆశ చావొద్దు, భ్రమ బతుకొద్దు!
సమకాలీన వ్యవస్థలో రాజకీయాలు చాలా ఖరీదయిపోయాయి. ప్రజా స్వామ్యం గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా సామాన్యులు రాజకీయాల్లో మనలేని రోజులొచ్చాయి. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలువడం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు నడపడం కనాకష్టమైపోయింది. డబ్బు ప్రమేయం ఎన్నికల్లో బాగా పెరిగింది. సిద్ధాంత రాజకీయాలు కాస్త వెనక్కి వెళ్లి, స్వార్థ రాజకీయాలు పెరిగాక అధికారమే పరమావధిగా అడు గులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలపరమైన భావావేశాల్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే పద్ధ్దతులు బలపడ్డాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక పలువురు ప్రజాప్రతినిధులు తమను ప్రజలు గెలిపించిన విపక్ష పార్టీల్లో ఉండలేకపోతున్నారు. పాలకపక్షం కనుసైగ చేస్తే చాలు అందులో చేరిపోతున్నారు. అధికారంతో అంటకాగుతున్నారు. ఉభ యులూ కలిసి ప్రజాతీర్పును వంచిస్తున్నారు. ఐదేళ్ల వరకు ప్రజల్ని పరిహాసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి విపక్ష పార్టీ జవసత్వాలు లేకుండా నామ మాత్రమైపోతే ఇక తమకు తిరుగే ఉండదన్నది పాలకపక్షాల ధీమా! అను చితమైన ఈ ధీమా ఒట్టి భ్రమ కావాలి. అంతటి శక్తి ఆలోచన బాట పట్టిన జన బలానికుంటుందని మన ప్రజాస్వామ్యం పలుమార్లు నిరూపించింది. ఏదీ! ఎక్కడ ప్రత్యామ్నాయం? అని పాలకపక్షాలు అహంతో ప్రశ్నించిన ప్పుడు కూడా చడీచప్పుడు లేకుండానే బలమైన ప్రత్యామ్నాయం అప్పటి కప్పుడు ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు.

ఎమర్జెన్సీ కాలంలో తనకు ఎదురే లేదనుకున్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ, జయప్రకాశ్‌ నారాయణ్‌ రూపంలో ఓ ప్రత్యామ్నాయం అంత తొందర్లో పుట్టుకొస్తుందని ఊహించలేక పోయారు. 1982–83లో తెలుగు నాట సినీ నటుడు ఎన్టీరామారావు ఓ ప్రభంజనంలా దూసుకు రావడం కూడా, అప్పటికే కాంగ్రెస్‌ చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు నిర్ణయించిన ప్రత్యామ్నాయ శక్తి మాత్రమే! ఒక రూపంలో అంతమైనా, మరేదో రూపంలో ప్రత్యామ్నాయం ఆవిర్భవించడమే ప్రజాస్వామ్యపు అందం! అందుకే, ప్రజ లెప్పుడూ నిరాశకు గురికాకుండా జాగరూకత వహిస్తూ ఆశావహ దృక్ప థంతో ఉండాలి. ఎంత పొడవైనదైనా చీకటి సొరంగం తర్వాత వెలుగు ఖాయం! ఈ లోపున, జరుగుతున్న పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమ నిస్తూ... తగు విధంగా చర్చించి, ఆలోచించి పౌరులు తమవైన నిర్ణయాలు తీసుకోవాలి.

ఉమ్మడి చొరవే ఉద్యమ స్ఫూర్తి!
బలమైన రాజకీయ వ్యవస్థలకు ఒకప్పుడు భూమికనిచ్చిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిర్వీర్యమై ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటినలా చేశారు, చేస్తూనే ఉంటారు. మనిషి విచిత్ర స్వభావాన్ని ఎత్తిచూపుతూ చలం అన్నట్టు, మనిషి ఎవర్నయినా క్షమిస్తాడు తనకు సహాయపడ్డవాణ్ణి తప్ప! తామెక్కి వచ్చిన నిచ్చెన మెట్లను ఒకటొకటిగా నరికే స్వభావమున్న పాలక పక్షాలు ఇతరులు నిరసన తెలిపే దారులన్నీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయవేదికలంటారా? మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మం టాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కూడా కనుమరుగవుతాయి. అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపించినా, ఎక్కడో ఓ దిక్కున దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణమని చరిత్ర, ప్రకృతి చెబుతోంది! కవులు, రచయితలు, మేధావులు, ఇతర ప్రజాస్వామ్య వాదులు ఏకమవ్వాలి. పౌరుల్ని అప్రమత్తంగా ఉంచి ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలి. ఆరోగ్యకరమైన చర్చను, అవసరాలు తీర్చే ఆలోచనల పరిధిని మరింత విస్తరించాలి. రేపు బాగుండాలంటే, నేడంటూ ఉండాలి!

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top