ఈ వక్రీకరణలు ఎందుకు?

అభిప్రాయం

మార్క్స్‌ 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. దానిలో ప్రతి వాక్యమూ ఒక ఆణి ముత్యమే. నేనిక్కడ కొన్ని ముత్యాలకే పరిమితమవుతాను.
‘‘సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకే గురి కాలేదా? వక్రీకరించినవాళ్లంతా సామ్రాజ్యవాదులేనా? కమ్యూనిస్టు పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించనే లేదా? ‘‘మార్క్స్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని ... సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం అజేయం అనడానికి సోవియట్‌ యూనియనే తార్కాణం అని మీరు లక్ష సార్లు చెప్పారు. అందుకే ఆ తార్కాణం కూలిపోగానే మార్క్సిజమే కూలిపోయిందని జనం అనుకొన్నారు. అదే శత్రువులు ప్రచా రం చేశారు.  

‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఒక ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా? ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు నాయకులకు ఉండనే ఉండదా? తమ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? మార్క్స్‌నీ జయాపజయాల చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారా? పోనీ ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి.

‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగ్‌జియావో పింగ్‌ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్‌జీ. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని సంస్కరణలనే పేరుతో అధికారికంగా ప్రారంభించిన ముగ్గురిలో థాచర్, రీగన్‌లతో పాటు డెంగ్‌ ఒకడు. సుధాకర్‌జీ, మీరూ మీ పార్టీ సంస్కరణలనబడే వాటిని వ్యతిరేకించారు. అదే పనిచేసిన డెంగ్‌ని ఎలా పొగుడుతారు?

‘‘సోవియట్‌ ప్రభుత్వం... బ్యాంకులను పరి శ్రమలను జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ అన్నారు సుధాకర్‌జీ. కాని రష్యాలో చైనాలో జాతీయం చేయడానికీ మార్క్స్‌ ప్రేరణ, చైనాలో ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చిన డెంగ్‌కీ మార్క్స్‌ ప్రేరణ అంటే ఎలా సుధాకర్‌జీ. ‘‘దక్షిణ అమెరికాలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల... ఒత్తిడులకు లొంగకుండా స్వంత బ్యాంకులను నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. కాని ఆ దేశాలు బ్యాంక్‌లో ఇంతవరకూ డిపాజిట్లు కట్టనేలేదనీ అసలు పని మొదలే కాలేదనీ ఈ నాయకునికి తెలుసా?

ఇంకో ఆణిముత్యం ‘ఈ నేపథ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరప్‌ దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. ఏమిటీ, అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా ఈ అభినవ రిప్‌ వాన్‌ వింకిల్‌ నిద్ర లేచి ఎంత కాలమైంది? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం’’ ఇచ్చే సోషలిస్టు సమాజమట! సోషలిజం అంటే ఇదేనా? కార్మికోద్యమ లక్ష్యం వేతన వ్యవస్థని రద్దు చేయడమే అన్న మార్క్స్‌ ఈ రచయితకు తెలుసా? అంటే ఆ వ్యవస్థలో యజమానీ ఉండడు.

కూలీ ఉండడు. పని చేసేవాడే యజమాని. పనిచేసేవాళ్లదే అధికారం. అటువంటి వ్యవస్థ సోవియట్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడనేలేదు. ఎందుకో సమీక్షించుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు మాత్రం గానుగెద్దుని ఆదర్శంగా తీసుకొన్నారు. ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ పెట్టుబడిదారీ ప్రపంచంలో దూరం చూడగలిగినవారంతా మార్క్స్‌ని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ మార్క్స్‌ సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టులు మాత్రం మార్క్స్‌ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు.
అదే విడ్డూరం. అదే విషాదం.  
(మే 5న సాక్షిలో వచ్చిన సురవరం సుధాకర రెడ్డి ‘‘గమ్యం గమనం మార్క్సిజమే’’ వ్యాసంపై స్పందన. దీని పూర్తి పాఠం ఈ లింకులో చూడండి : https://bit.ly/2jLIhg3)

– వ్యాసకర్త: ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్‌ క్లాసిక్స్‌
మొబైల్‌ : 91605 20830

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top