
హైదరాబాద్‌లో సురవరం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డి. రాజా, కూనంనేని, సీతక్క, పశ్య పద్మ, సంపత్. పల్లా, సత్యం, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు
మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
జీవితాంతం సిద్ధాంతానికి కట్టుబడిన నేత సురవరం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్/గాంధీ ఆస్పత్రి: తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని, అందులో భాగంగానే దివంగత కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఉద్యాన వర్సిటీకి, జైపాల్‌రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టామని, అలాగే సురవరం విషయంలో కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
శనివారం రాత్రి మరణించిన సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి ఆదివారం మఖ్దూమ్ భవన్‌లో సీఎం నివాళులర్పించారు. అనంతరం సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. సురవరం మృతి తెలంగాణకు తీరని లోటు అని విచారం వ్యక్తంచేశారు. నిరాడంబర జీవితం గడిపిన సుధాకర్‌రెడ్డి ఏనాడూ తన సిద్ధాంతాలను విడిచిపెట్టలేదని కొనియాడారు.
బూర్గుల రామకృష్ణారావు, సూదిని జైపాల్‌రెడ్డి తరహాలోనే సురవరం సుధాకర్‌రెడ్డి కూడా మహబూబ్‌నగర్ జిల్లాకు వన్నె తెచ్చారని అన్నారు. విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సురవరం సుధాకర్‌రెడ్డి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు, హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, వినోద్ కుమార్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్‌రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు.
అధికార లాంఛనాలతో..
సురవరం సుధాకర్‌రెడ్డికి సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్‌భవన్‌లో సురవరంకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించింది. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన అంతిమయాత్ర మఖ్దూమ్‌భవన్ నుంచి నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజీకి చేరింది.
అంతిమయాత్రలో ముందు భాగంలో పోలీసు కవాతు ఉండగా, అనంతరం సీపీఐ వలంటీర్లు ఎర్ర జెండాల కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల విప్లవ తీతాలాపనల మధ్య యాత్ర కొనసాగింది. అనంతరం సుధాకర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయన సతీమణి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ కలిసి గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, ప్రొఫెసర్ రమాదేవి, ప్రొఫెసర్ సుధాకర్‌కు అప్పగించారు. సురవరం భౌతికకాయానికి ఎంబామింగ్ (రసాయనాల పూత) చేసి భద్రపరుస్తామని.. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం వినియోగిస్తామని చెప్పారు.
సురవరం తన కళ్లను ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు డి.రాజా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ పెద్దిరాజు రవిచంద్ర, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.