
సురవరం సుధాకర్ రెడ్డి
ఆయన భారతదేశ రాజకీయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుగుతున్న పరిణామాలను అవలీలగా అర్థం చేసుకొని ప్రజలకు వివరించే బహుముఖ ప్రజ్ఞాశాలి. నిరంతరం కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ఆలోచన చేసే మేధావి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గొప్ప నాయకుడు. ఆయనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. 1942 మార్చి 25న జన్మించిన ఆయన ఈ 2025 ఆగస్ట్ 22న తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు ఆయన స్వగ్రామం. సురవరం ప్రతాపరెడ్డి గారికి సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామారెడ్డి స్వయానా తమ్ముడు. కర్నూలులో చదువుకునే రోజుల్లో 19 ఏళ్లకే ఏఐఎస్‌ఎఫ్ కర్నూల్ పట్టణ కార్యదర్శిగా, 1960లో కర్నూలు జిల్లా కార్యదర్శిగా పని చేశారు సుధాకర్ రెడ్డి. 1967లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులో చేరారు. యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1963లో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అనంతరం రెండు పర్యాయాలు జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
లా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో సీనియర్ న్యాయవాది వద్ద చేరి ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం సీపీఐలో పూర్తి కాలం పని చేయడానికి అవకాశం ఇచ్చింది. దీంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎదిగి 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే 2019లో అనారోగ్య కారణాల వల్ల పార్టీ పదవుల నుండి తప్పుకొన్నారు.
1980, 1984ల్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీచేశారు. 1994లో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. 1998, 2004ల్లో లోక్ సభకు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. భారతదేశ అత్యున్నత పార్ల మెంటరీ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. అనేకమంది పేద లకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం కేంద్ర ప్రభు త్వంతో కీలకంగా వ్యవహరించారు. ఏఐఎస్‌ఎఫ్ ఉద్యమ సమ
యంలో పరిచయమైన డా‘‘ బీవీ విజయలక్ష్మిని 1974లో ఆదర్శ వివాహం చేసుకున్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రమంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న సుధాకర్ రెడ్డి నాకు సైద్ధాంతిక అవగాహన కల్పించడంలో అందరి కంటే ముందున్నారు.
2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనాటి ఇందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిటింగ్ స్థానాన్ని సైతం నాకు ఇప్పించి
నేను శాసనసభ్యునిగా గెలుపొందడం కోసం కృషి చేశారు. శాసనసభలో సీపీఐ పక్ష నాయకునిగా పనిచేస్తున్న క్రమంలో ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా తుది శ్వాస విడిచే వరకు పని చేశారు. వారు విడిచిన సైద్ధాంతిక లక్ష్యాలను పుణికి పుచ్చుకొని ముందుకు పోవడమే ఆయనకు అసలైన నివాళి.
– చాడ వెంకటరెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు