
గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో సురవరం సుధాకర్‌రెడ్డికి ఘనంగా నివాళులు అర్పిస్తున్న డి. రాజా, కూనంనేని, నారాయణ, కె. శ్రీనివాసరెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు
మఖ్దూంభవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు..
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ఆదివారం నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఆయన పెద్దకుమారుడు రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో పలువురు సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతలు సుధాకర్‌రెడ్డికి నివాళులు అర్పించారు.
శనివారం ఉదయం వారంతా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఛాయాదేవి పాల్గొన్నారు.
మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఇతర బీఆర్‌ఎస్ నేతలు సురవరం కుటుంబసభ్యులను ఖాజాగూడలోని గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్స్‌లో కలిసి పరామర్శించారు. ఆయన్ను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ కేవీపీ.రామచందర్‌రావు కూడా సురవరం కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఆదివారం ఉదయం 9 గంటలకు కేర్ ఆస్పత్రి నుంచి సురవరం భౌతిక కాయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూంభవన్‌కు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. సాయంత్రం అక్కడి నుంచే సురవరం అంతిమయాత్ర గాంధీమెడికల్ కాలేజీ వరకు సాగుతుంది. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతిక కాయాన్ని అప్పగిస్తారు. ఇప్పటికే ఆయన కళ్లను ఎల్‌వీప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. సురవరం అంతిమయాత్రకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేస్తోంది.
నేడు నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆదివారం ఉదయం 10 గంటలకు మఖ్దూమ్‌భవన్‌కు చేరుకొని సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని సీపీఎం సీనియర్ నేత పాటూరి రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
అణగారిన వర్గాల కోసం తపించిన నేత సురవరం
అణగారిన వర్గాల కోసం అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించి, జీవితాంతం పేదల కోసం పరితపించిన మహానీయుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ నేతలు కొనియాడారు. మఖ్ధూంభవన్‌లో సురవరం చిత్రపటానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేతలు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నరసింహ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అవిశ్రాంత యోధుడు... సౌమ్యుడు.. మృదుస్వభావి
సురవరం మృతిపట్ల పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: సురవరం సుధాకరరెడ్డి మృతిపట్ల కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తదితరులు సంతాపం తెలిపారు. సౌమ్యుడు, మృదుస్వభావి, పీడిత వర్గాల అభివృద్ధి కోసం తుది శ్వాస వరకు పనిచేసిన నాయకుడు సురవరం అని కిషన్‌రెడ్డి కొనియాడారు. సుధాకరరెడ్డి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటని బండి సంజయ్, బండారు దత్తాత్రేయ, ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు.
సురవరం సుధాకర్‌రెడ్డి కమ్యూనిస్టు వేగుచుక్క అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కొనియాడారు. సురవరం బలహీనవర్గాల హక్కులకోసం అవిశ్రాంతంగా పోరాడారని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. మతోన్మాదం పెరిగిపోతున్న ఈ తరుణంలో సురవరం మృతి వామపక్ష ఉద్యమాలకు, ప్రజాస్వామ్య హక్కులకు తీరని నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విచారం వ్యక్తం చేశారు.