నా చర్మం రంగు విలువ ఎంత?

Article On Black Racism And George Floyd Death - Sakshi

విశ్లేషణ

నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం నల్లజాతీయులను పోలీసులు బాదటం, లేదా చంపడం అనేవి స్థానిక వార్తలుగానే వచ్చేవి. కాని ఇప్పుడు అలాంటి వార్తలు జాతీయ ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలో అవి జరుగుతున్నాయి అనే అంశంతో పనిలేకుండా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రభుత్వ పోలీసు విభాగాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చాలి? అన్నదే కీలకం. మారణాయుధాలను ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశంపై సుదీర్ఘ సాంస్కృతిక శిక్షణ అవసరం. ఇతరుల ఊపిరి తీయడాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులకు నేర్పాలి. చర్మం రంగు బట్టి మనుషులతో వ్యవహరించకూడదన్న గ్రహింపు బలగాలకు ఉండాలి.

ఒక్కటి మాత్రం నిజం. ఆధునిక కాలంలో సురక్షిత సమాజం కోసం మనం కొన్ని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్ల పోలీసు తనిఖీలు తప్పనిసరి కావచ్చు. కానీ, ఆ క్రమంలో రాత్రింబవళ్లు రహదారులపై తనిఖీ చేసే అమెరికా పోలీసులు భౌతిక శాస్త్రజ్ఞుల పట్ల ద్వేషభావంతో ఉంటున్నారా అని మేం ఆలోచిస్తుంటాం. అమెరికాలో అత్యున్నత విద్యావంతులైన పీహెచ్‌డీలు చేసిన సైంటిస్టులు తమ జీవితాల్లో ఇంతగా పోలీసుల తనిఖీలకు ఎలా లోనవుతుంటారనేది పెద్ద ప్రశ్న. పోలీసులు మాపట్ల కొన్ని ముద్రలతో వ్యవహరిస్తున్నారేమో.. బహుశా అది మా చర్మపు రంగు కావచ్చేమో.. నల్లవారు కారు డ్రైవ్‌ చేయడం, నల్లవారు నడవటం, నల్లవారు నల్లవారుగా మాత్రమే ఉండటం ఉల్లం ఘనల కిందికి వస్తాయా అనేది మాలో ఏ ఒక్కరికీ తెలీని విషయమే.

అయితే పోలీసులు మమ్మల్ని ఆపిన సందర్భాల్లో మాలో ఓ ఒక్కరినీ వారు విచక్షణారహితంగా చితకబాదలేదు. మాలో ఏ ఒక్కరినీ వారు కాల్చలేదు. కానీ పోలీసులు ఎదురైనప్పుడు నల్లవారు ప్రాణాలు కోల్పోవడం ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. ప్రతి సంవత్సరం అమెరికాలో పోలీసులు 100 కంటే ఎక్కువమంది నిరాయుధులైన నల్ల వారిని కాల్చి చంపుతున్నారు. ఈ వ్యాసం నేను టైప్‌ చేస్తున్న సమయానికి మన్‌హట్టన్‌లో నా ఇంటి కిటికీ గుండా చూస్తే 10 వేలకుపైగా నిరసనకారులు నినాదాలు చేస్తూ సాగడం కనిపించింది. జార్జి ఫ్లాయిడ్‌ హత్యా ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా లూటీలు, ఇతర హింసాత్మక చర్చలు ప్రబలిపోవడంతో రాత్రిపూట కర్ఫ్యూను రాత్రి 11 గంట లనుంచి 8 గంటలకు ముందుకు జరిపారు. నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డుల్లో ‘నల్లవారి ప్రాణాలు కూడా ముఖ్యమైనవే’ అనేదే ఎక్కువగా కనబడుతూ వచ్చింది. 

పోలీసు అధికారి వెనక్కి చేతులు మడిచి, బేడీలు వేసి మెడపై కాలు వేసి తొక్కిన ఘటనలో తనకు ఊపిరాడటంలేదు అని ఆర్తనాదం చేస్తూనే చనిపోయిన జార్జి ఫ్లాయిడ్‌ పేరు ఉన్న ప్లకార్డును చాలామంది పట్టుకున్నారు. కాగా పోలీసు అధికారుల కస్టడీలో ఉంటున్న నల్లవారి గతి పట్ల బాధ, ఆందోళనను ప్రదర్శిస్తూ జాతీయ ఫుట్‌బాల్‌ స్టార్‌ కోలిన్‌ కపెర్నిక్‌ ఫుట్‌ బాల్‌ గేమ్‌ ప్రారంభానికి ముందు మోకాలు వంచి చూపిన భంగిమ విపరీతంగా ప్రజలను కదిలించింది. ఆ సమయంలో అతడు అమెరికా జాతీయగీతం పట్ల నిరసన వ్యక్తం చేశాడని ఒక మీడియా వార్త ప్రచురించడంతో ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో  2017లో ఫుట్‌ బాల్‌ సీజన్‌ పొడవునా అతడిని ఏ ఫుట్‌ బాల్‌ టీమ్‌ కూడా జట్టులో చేర్చుకోకుండా అతడి బతుకుపై వేటు వేశాయి. రెండేళ్ల తర్వాత చూస్తే శాంతియుతంగా మోకాలు మడిచి కోలిన్‌ ప్రదర్శించిన భంగిమను దాటి,  నిజంగానే పోలీసు అధికారి మోకాలికింద నలిగి నల్లజాతీయుడు మరణించడం వరకు ముందుకొచ్చేశాం.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై టియర్‌ గ్యాస్, పెప్పర్‌ గ్యాస్‌ ప్రయోగించడం, వీధుల్లోనే చితకబాదటం వంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు వీరు ఏదో చట్టవిరుద్ధమైన, అమెరికనేతర చర్యలకు పాల్పడుతున్నట్లు మీరు భావించవచ్చు. కానీ అమెరికన్‌ రాజ్యాంగంలో ‘.. పత్రికా స్వేచ్ఛను అణిచిపెట్టే ఏ చట్టాన్నీ కాంగ్రెస్‌ రూపొందించదు. అలాగే శాంతియుతంగా ప్రజలు గుమికూడే హక్కును కూడా రాజ్యాంగం అణిచిఉంచదు. అలాగే సమస్యల పరి ష్కారం కోరుతూ ప్రభుత్వానికి పిటిషన్‌ పెట్టుకునే హక్కును కూడా రాజ్యాంగం తోసిపుచ్చదు‘ అని రాసుకున్నాం. ఈ సవరణ అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ. అంటే అమెరికన్‌ జాతి నిర్మాతలు సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపడం అనేది అమెరికన్‌ లక్షణాల్లో అత్యంత కీలకమైనది అని భావించి దానికి సాధికారత కల్పిం చారు. మీరు పోలీసు అయితే కాస్సేపు ఆగి శాంతియుత ప్రదర్శనలకు చోటు కల్పించిన దేశ రాజ్యాంగం ఎంత గొప్పదో ఆలోచిస్తే మంచిది.

పోలీసు అధికారుల నుంచి మనం వాస్తవానికి ఆశిస్తున్నది ఏమిటి? శాంతిని కాపాడి దుర్మార్గులను బంధించడమే అని నా భావన. అయితే అవసరమైనప్పుడు వారు మారణాయుధాలను ఉపయోగించవలసి రావచ్చు. కానీ ఆ ఆయుధాలను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి, ఉపయోగించకూడదు అనే విషయంలో తగిన శిక్షణ వారికి అవసరం. మిన్నియాపోలిస్‌కు చెందిన పోలీస్‌ అకాడమీ కఠిన శిక్షణ నాలుగు నెలలపాటు ఇస్తారు. అంతకుమించిన కఠిన శిక్షణను న్యూయార్క్‌ పోలీస్‌ అకాడెమీ 6 నెలలపాటు ఇస్తుంది. కానీ ఒక మంచి పాకశాస్త్ర నిపుణుడు తన వృత్తికి సంబంధించిన ధ్రువపత్రం పొందాలంటే కనీసం 8 నెలలు శిక్షణలో ఉండాలి. వృత్తిలో ఖచ్ఛితత్వం రావాలంటే అంత సమయం అవసరం మరి. పోలీసు నియామకాల్లో కూడా అధికారులు తయారు కావాలంటే మరింత అదనపు సమయం శిక్షణ అవసరం ఎంతైనా ఉంది.

1991లో రాడ్నీ కింగ్‌ అనే పాతికేళ్ల యువకుడిని నలుగురు పోలీసు అధికారులు నేలకేసి తొక్కుతూ తమ లాఠీలతో చితకబాదుతున్న దృశ్యాన్ని వీడియో బయటపెట్టినప్పుడు యావత్‌ అమెరికన్లు షాక్‌కు గురయ్యారు. కానీ అ సమయంలో నేను పెద్దగా షాక్‌కి గురికాలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి నాకు, నా తోబుట్టువులకు.. పోలీసులు మిమ్మల్ని కాల్చకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి వారం, ప్రతినెలా పాఠాలు చెప్పేవారు. మిమ్మల్ని అటకాయించినప్పుడు పోలీసు అధికారి అన్ని వేళల్లోనూ మీ చేతులను చూస్తాడు. అలాంటప్పుడు మీరు అస్సలు కదలొద్దు. ముందస్తుగా వారికి చెప్పకుండా మీ ప్యాకెట్లలో చేతులు పెట్టవద్దు. మీరు కదిలినప్పుడు ఎందుకు కదులుతున్నారో ఆ అధికారికి ముందే చెప్పాలి అని పాఠం చెప్పేవారు. అప్పట్లో నేను మిడిల్‌ స్కూల్‌ విద్యార్థిని. ప్రపంచం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని కానీ నా చర్మపు రంగు గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు మనిషి చర్మం రంగు గురించి తట్టేది కాదు. కానీ నా ముందు తలుపునుంచి నేను నిష్క్రమిస్తున్న ప్పుడు నేను అనుమానిత నేరస్తుడిని అవుతున్నాను. ఈ మధ్య అమెరికా సమాజంలో వైట్‌ కాలర్‌ క్రైమ్‌ అనే పదబంధం వాడుకలోకి వచ్చింది. ఒక అమాయకుడైన నల్లజాతీయుడు అమాయకత్వానికి సంబంధం లేని పని ఏదో చేయవచ్చని భావిస్తున్న తెల్లవారు  వెంటనే భయంతో పోలీసులకు కాల్‌ చేయడాన్ని ఈ పదబంధం సూచిస్తుంది.

నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా. కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం నల్లజాతీయులను పోలీసులు బాదటం, లేదా చంపడం అనేవి స్థానిక వార్తలుగానే వచ్చేవి. కానీ, ఇప్పుడు అలాంటి వార్తలు జాతీయ ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతున్నాయి. దేశంలో ఏ ప్రాంతంలో అవి జరుగుతున్నాయి అనే అంశంతో పనిలేకుండా ఇవి ప్రాచుర్యం పొందుతున్నాయి. మరి  రాజ్యానికి సంబంధించిన ఈ సంస్థలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మార్చాలి? పోలీసు విభాగాలను ప్రశ్నిస్తున్న డిమాండ్లు ఇవి. నా సూచనలు కొన్ని ఇక్కడ చెబుతాను. విధాన నిర్ణేతలు వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. 

1. మారణాయుధాలను ఎందుకు ఉపయోగించకూడదు అనే అంశంపై శిక్షణనిచ్చే సాంస్కృతిక చైతన్యాన్ని నెలలపాటు పోలీసు అకాడమీలకు కలిగిస్తూ పోవాలి.
2. పోలీసు అకాడమీ ఆమోదం, తిరస్కరణతో పనిలేకుండా పక్షపాతదృష్టిని ప్రదర్శించిన పోలీసు అధికారులందరినీ తనిఖీ చేయాలి.
3. మనం కూడా పక్షపాత దృష్టిని కలిగి ఉండవచ్చు కానీ మనలో చాలామంది ఇతరుల ఊపిరి తీయడాన్ని మన చేతుల్లోకి తీసుకోం.
4. నిరసన ప్రదర్శనల సమయంలో ఆస్తులను, ప్రాణాలను కాపాడాలి. మీరు హింసకు పాల్పడని నిరసనకారులపై దాడి చేశారంటే మీరు అమెరికన్‌ కానట్లే. పోలీసులు నిరసన కారులను కాకుండా లూటీదారులను మాత్రమే అరెస్టు చేస్తే ఇక కర్ఫ్యూలతో పనిలేదు.
5. పోలీసు అధికారులు అనైతికమైన, హింసాత్మకమైన ప్రవర్తనను ప్రదర్శించడాన్ని మీరు చూస్తే వెంటనే అడ్డుకోండి. దాన్ని ఎవరైనా వీడియోతీసి పంపితే మనకు మనమే పోలీసులం అనే ఆత్మవిశ్వాసం మనకు కలుగుతుంది.
6. మరో ముఖ్యమైన సూచన ఏదంటే విధినిర్వహణలో ఉండి మరణించిన వారికి జరిపేలా జార్జి ఫ్లాయిడ్‌కి కూడా పూర్తి అధికార లాంఛనాలతో మిన్నియా పోలిస్‌ విభాగం అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? తన దారుణ మృతి వంటి ఘటన మరెవరికీ జరగకూడదని ఎందుకు ప్రతిజ్ఞ చేయకూడదు?
7. చివరగా, నల్లజాతి పిల్లలు మీకు కనబడినప్పుడు వాళ్లు ఎలాంటివారు అని మీకు మీరే నిర్ధారణకు రాకుండా వారు ఎవరై ఉండవచ్చు అనే దృష్టితో ఆలోచించాలి.


నీల్‌ డెగ్రాస్‌ టైసన్‌, వ్యాసకర్త ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top