ప్రతీకారేచ్ఛ ప్రమాదకరం | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 24 2018 2:32 AM

Article On Attacks On Dalits By Professor Prem Singh - Sakshi

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై ఇటీవల జరి గిన దాడిని సర్వత్రా ఖండించారు గానీ, నిజంగానే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన గత, ప్రస్తుత అభిప్రాయాలు, ఆచరణతో ఏకీభవించనివారికి తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయనను వ్యతిరేకించడం కూడా తప్పు కాదు. కానీ అలా వ్యతిరేకించడానికి ముందు స్వామి అగ్నివేశ్‌ నేపథ్యంకేసి ఒకసారి పరిశీలించి తర్వాత వారు ఆ పని చేయాల్సి ఉంటుంది. 

మరొక వైపున, సంఘ్‌ బ్రిగేడ్‌కి చెందిన హిందుత్వ లంపెన్‌ శక్తుల నిరంతర హింసాత్మక దాడులతో నిస్పృహ చెందిన కొంతమంది వ్యక్తులు హిందుత్వ ముఠాకు గుణపాఠం చెప్పడానికి దళి తులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనారిటీలతో కూడిన ఐక్య సంఘటనకు పిలుపునిస్తున్నారు. ఈ బృందాలన్నీ కలిసి ఒక్కటై ఎదిరిస్తే హిందుత్వ బ్రిగేడ్‌ పలాయనం సాగించక తప్పదని కొంతమంది మిత్రులు అంటున్నారు. ఇలా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హింసకు పాల్పడుతున్నవారిపై ప్రతి హింస కూడా అదే స్థాయిలో చేయడమే పరిష్కారమంటూ సోషల్‌ మీడియాలో ఒక స్నేహితుడు పేర్కొన్నాడు కూడా.

అంటే వాళ్లు నీ కాళ్లు చేతులు విరగ్గొడితే నువ్వు కూడా వాళ్ల కాళ్లూ చేతులను విరగ్గొట్టాలి. వాస్తవానికి ఆరెస్సెస్‌ ప్రతిపాదిస్తున్న హిందుత్వ, దాని గర్వాతిశయం అనేవి అభద్రతతో కూడిన పరాజిత మనస్తత్వంలోంచే పుట్టుకొచ్చాయి. అందుకే హిందుత్వ భావన ఆవిర్భవించిన నాటినుంచి ప్రతి కూల స్వరాన్నే వినిపిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలో హిందుత్వ లంపెన్‌ శక్తులకు అణగారిన వర్గాల ఐక్య కూటమి సరైన పాఠం చెప్పాలని వస్తున్న నూతన సవాలును సానుకూల ఎంపికగా చెప్పలేం. ఈ వైఖరి కూడా తాత్కాలిక ఉద్రేకాలతో పుట్టుకొచ్చే అపరిణత ఆగ్రహ ప్రకటన కంటే ఉత్తమమైనది కాదు.

నిజానికి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు ప్రస్తుతం ఆరెస్సెస్‌/బీజేపీకి మరీ దూరంగా ఏమీ లేరు. నయా ఉదారవాద, నయా సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు తెలిపే విషయంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు ఇప్పటికే ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో చేయి కలిపారు. ఇక ముస్లిం మైనారిటీల విషయానికి వస్తే తమ ఒంటరితనంలో వారు ఎన్నాళ్లు కొనసాగుతూ ఆరెస్సెస్, బీజేపీ ద్వయాన్ని వ్యతిరేకిస్తుంటారనేది ప్రశ్నే. ఎందుకంటే ఇతర పౌరులలాగే వారు కూడా భారతీయులే మరి. మతపరమైన గుర్తింపుతోబాటు రాజకీయాధికారం విషయంలో వీరికి కూడా ఏదో ఒక మద్దతు అవసరం. దేశంలో షియా ముస్లిం తెగను ఆకర్షించడానికి ఆరెస్సెస్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆరెస్సెస్‌ ఈ విషయంలో నిలకడైన పనితీరును ప్రదర్శించడమే కాకుండా ఫలితాలు కూడా చూస్తోంది. 

నా రెండో అభిప్రాయం ఏదంటే, ఈ దేశంలోని మేధావులు హిందుత్వ లంపెన్‌ శక్తులకు గుణపాఠం చెప్పాలన్న పథకంతో అణగారిన వర్గాల ఐక్యసంఘటనకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆనాడు లోహియా మరింత ప్రజాస్వామికంగా చేసిన సూచనను మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అణగారిన వర్గాల మధ్య ఐక్యతా సూత్రాన్ని లోహియా ప్రతిపాదించారు. పైగా ఆధునిక ప్రపంచంలో ప్రత్యక స్థానం పొందగలిగే కొత్త భారతీయ నాగరికతను నిర్మించాలని ఆయన కలకన్నారు. ఆయన ప్రకారం భారతీయ జనాభాలో అధికభాగం వలసపాలనకు ముందటి బ్రాహ్మణిజం అంతస్తుల వ్యవస్థ నుంచి, వలసపాలనా కాలపు పెట్టుబడిదారీ భావజాలం నుంచి విముక్తి పొందారు.

అలాంటి సామాజిక బృందాల సంఘీభావంతో ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాధికారాన్ని పొందగలిగితే ఒక కొత్త సమానతా వ్యవస్థ రూపు దిద్దుకుంటుంది. ఇది బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానంకు పూర్తి భిన్నంగా ప్రపంచం ముందు సరికొత్త నమూనాను నెలకొల్పుతుంది. ఛాందసవాద మనస్తత్వంలో కూరుకుపోని ఈ అణగారిన ప్రజలను ఒకటిగా చేయడం ద్వారా సోషలిజం, కమ్యూనిజాన్ని దేశంలో నిర్మించవచ్చని లోహియా కలగన్నారు. ఈ మార్గంలోనే ఆయన ప్రత్యేక అవకాశాలు (రిజర్వేషన్‌) సూత్రాన్ని ప్రతిపాదించారు. కానీ లోహియా సూత్రాన్ని ప్రస్తుతం ఓట్ల రాజకీయాల కోసం సామాజిక న్యాయ చాంపియన్లు వాడుకుంటున్నారు. ఆరెస్సెస్, బీజేపీ కూడా ఇదేవిధమైన ఎత్తుగడలతో నడుస్తోంది.

అణగారిన వర్గాల ప్రజల మధ్య సంఘీభావం హిందుత్వ లంపెన్‌ శక్తులకు గుణపాఠం చెప్పడం వైపుగా మరలాలని మన దేశ మేధావులు సూచిస్తున్నట్లయితే, ఓట్ల రాజకీయాలకు సంబంధించి కూడా ఇది వెనుకడుగు అనే చెప్పాలి. కార్పొరేట్‌ పెట్టుబడిదారీ విధానం దేశ నాయకులనే కాకుండా, మేధావులను కూడా తనచుట్టూ డ్యాన్స్‌ చేయిస్తోంది. హిందుత్వ లంపెన్‌ శక్తులకు ఈ రకంగా గుణపాఠం చెబుదామని అణగారిన వర్గాలకు పిలుపునిస్తున్న మేధావులు గతంలో సంపూర్ణంగా రిజర్వేషన్‌ వ్యతిరేకులైన అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లకు మద్దతు పలికిన గుంపులో కలిశారని మనం మరవకూడదు.
డాక్టర్‌ ప్రేమ్‌ సింగ్, హిందీ శాఖ,
ఢిల్లీ యూనివర్సిటీ

 

Advertisement
Advertisement