వాయనం: మీ నగలకు మీరే డిజైనర్!

వాయనం: మీ నగలకు మీరే డిజైనర్!


వేసవి వస్తోంది. బోలెడన్ని ఫంక్షన్లు ఉంటాయి. ప్రతిసారీ దుస్తుల మీదికి మ్యాచింగ్ జ్యూయెలరీ వెతుక్కోవడం పెద్ద పని. అలాగని ప్రతిసారీ కొనాలన్నా ఇబ్బందే. అదే... మనమే నగలు చేసేసుకున్నామనుకోండి... తక్కువ ఖర్చుతో ఎక్కువ నగలు పోగేసుకోవచ్చు. సరదాగా ఈ బ్రేస్‌లెట్ ట్రై చేసి చూడండి...

 

 కావలసినవి: వెండి తీగ, ముత్యాలు (చేతి సైజును బట్టి సంఖ్య), క్రిస్టల్ బీడ్స్ (వీటి సంఖ్య ముత్యాలను బట్టి ఉంటుంది), టాగుల్ రింగ్ - 1 (షాపులో అడిగితే ఇస్తారు. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. బ్రేస్‌లెట్‌కి ఇరువైపులా ఫిక్స్ చేసుకోవాలి)  తయారీ: ముందుగా మీ చేతి సైజును బట్టి వెండితీగను కత్తిరించుకోవాలి. టాగుల్ రింగులో ఒక భాగానికి తీగని ముడివేయాలి. తరువాత తీగకు ఒక క్రిస్టల్ బీడ్‌ని ఎక్కించాలి. తర్వాత ఒక ముత్యం ఎక్కించాలి. ఇలా బీడ్స్‌ని, ముత్యాల్ని ఓ వరుసక్రమంలో ఎక్కించి, చివరగా తీగెను టాగుల్ రింగులో రెండో భాగానికి ముడి వేసి, రెండిటినీ కలిపి ఫిక్స్ చేయాలి. అంతే... అందమైన ముత్యాల బ్రేస్‌లెట్ రెడీ! రెడీమే డ్‌కి అయ్యే ఖర్చులో సగం కూడా అవ్వదు దీని తయారీకి!

 

 వెరీ‘గుడ్డు’ సెపరేటర్!

 గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే రోజుకో గుడ్డు తినమని వైద్యులు చెబుతుంటారు. అయితే చిన్నప్పుడు ఫర్వాలేదు కానీ... టీనేజ్ దాటినప్పట్నుంచీ గుడ్డులోని పచ్చసొనను తినడం మంచిది కాదని, దానివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటారు. కాబట్టి పచ్చసొన తీసేసి తెల్లదాన్ని మాత్రమే తినాలి. అయితే రెండు సొనలనీ సెపరేట్ చేయడం ఓ పెద్ద పని. ఎంత జాగ్రత్తగా తీద్దామన్నా పచ్చసొన పగిలి కలిసిపోతుంటుంది. ఆ సమస్యను తీర్చడానికే ‘ఎగ్ వైట్ సెపరేటర్’ని కనిపెట్టారు. ఇందులో నాలు గైదు మోడల్స్ ఉన్నాయి. మోడల్‌ని బట్టి రేటు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది 200 రూపాయల్లో వచ్చేస్తుంది. 150 రూ.కే దొరికేవి కూడా ఉన్నాయి. దీన్ని వెంటనే తెచ్చుకుంటే మీ పని ఈజీ అయిపోతుంది!

 

 ఫటాఫట్ పరిష్కారాలు!

  *   వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే కాచేముందు పాలలో చిటికెడు వంటసోడాని కలపాలి!

 *    ఒక్కోసారి ఎంత కడిగినా ఫ్లాస్క్ వాసన వస్తూంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో కడిగి ఆపైన నీటితో కడిగితే వాసన పోతుంది!

 *    పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగుతుంటే, ఒక తమలపాకును నూనెలో వేసి, కాసేపుంచి తీస్తే... నూనె పొంగకుండా ఉంటుంది!

*     పెసరపిండిలో నిమ్మరసం కలిపి తోమితే వెండి సామాన్లు తళతళలాడతాయి!

 *    బ్రెడ్ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే... ప్యాకెట్లో చిన్న బంగాళాదుంప ముక్కను పెట్టాలి!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top