
చోరీకి గురైన 3,000 సంవత్సరాల పురాతన ఆభరణం
కైరోలోని మ్యూజియంలో ఘటన
జాడ కనిపెట్టేందుకు మొదలైన పోలీసుల వేట
కైరో: ఈజిప్ట్ నాగరికతతో ఫారో చక్రవర్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఫారో చక్రవర్తుల కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్‌ల నిర్మాణం జరిగింది. అద్భుతమైన పాలనతో మంచి పేరు తెచ్చుకున్న ఫారో చక్రవర్తులకు చెందిన ఒక ముంజేతి కంకణం ఇప్పుడు కనబడకుండాపోయింది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్‌లోని ప్రఖ్యాత మూజియంలో చివరిసారిగా ఇది బహిరంగంగా కనిపించింది.
మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణాన్ని స్వచ్ఛమైన స్వర్ణంతో తయారుచేశారు. మ్యూజియంకు చెందిన పునరుద్ధరణ లే»ొరేటరీకి తీసుకురాగా ఆ తర్వాత ఇది కనిపించకుండాపోయిందని ఈజిప్ట్ పర్యాటకం, పురాతత్వ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దీనిని దొంగలించిన వ్యక్తులు విదేశాలకు అక్రమ రవాణా చేయొచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం అనుమానిస్తోంది. అనుకున్నదే తడవుగా వెంటనే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయలు, సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరంచేసింది. బ్రాస్‌లెట్ ఫొటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌చేస్తోంది.
వేల ఏళ్ల పాత కంకణం
క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్‌ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ రాజుకు చెందిన కంకణంగా దీనిని గుర్తించారు. తూర్పు నైలు నదీతీర ప్రాంతంలోని టానిస్‌లో ఖననంచేసిన అమేనీమోప్ ఆన్‌ఆర్‌టీ–4 ఛాంబర్‌లో ఈ కంకణాన్ని గతంలో కనుగొన్నారు. తొలుత వేరే చోట అమేనీమోప్ పారి్థవదేహాన్ని ఖననంచేసి కొన్నాళ్లకు సుసేన్నెస్ రాజు సమీప ఛాంబర్‌కు మార్చారు.
ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకడిగా సుసేన్నెస్ వెలుగొందారు. అమేనీమోప్ సమాధాని 1940లో కనుగొన్నారు. ‘‘వేల ఏళ్ల చరిత్ర గల ఇలాంటి కంకణం కనబడకుండా పోవడం వింతేమీ కాదు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉంది. స్మగ్లర్లు వీటిని దొంగించి విదేశాలకు తరలిస్తారు’’అని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఫోరెన్సిక్ పురాతత్వవేత్త క్రిస్టోస్ సిరోగియాన్నిస్ చెప్పారు.
‘‘త్వరలోనే ఇది ఎక్కడో, ఏ దేశంలోనో ప్రఖ్యాత వేలం సంస్థ వేలంపాటలోనే, ఆన్‌లైన్‌లోనే ప్రత్యక్షమవుతుంది. ఫారో చక్రవర్తుల వస్తువులను సొంతం చేసుకునే సంపన్నులకూ కొదువలేదు. వాళ్లు వీటిని బ్లాక్‌మార్కెట్‌లో కొని దాచుకుంటారు’’అని ఆయన అన్నారు. ‘‘చోరీకి గురై తమ దేశంలోకి వచి్చన పురాతన వస్తువులను కొన్ని అరబ్ దేశాలు తిరిగి ఈజిప్ట్‌కు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొన్ని అయితే అధికారికంగా అప్పగించే ఉద్దేశంలేక మ్యూజియం తోటలోనే, ప్రాంగణాల్లోనూ తర్వాత పడేసి వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి’’అని ఆయన గుర్తుచేశారు. ‘‘కంకణంలోని బంగారం కరిగించి సొమ్ముచేసుకునే అవకాశం చాలా తక్కువ. కరిగిస్తే వచ్చే బంగారం విలువ కన్నా అలాగే కంకణం రూపంలోనే అమ్మితే లెక్కలేనంత సొమ్ము సంపాదించొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్ట్‌కు దశాబ్దాలుగా పురాతన వస్తువుల స్మగ్లింగ్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. శక్తిమేరకు కాపాడుతున్నా ప్రతి ఏటా ఎక్కడో ఓ చోట ఇలా విలువైన వస్తువులు అదృశ్యమవుతూనే ఉన్నాయి.