పులిరాజాకు ఇప్పుడు ఏమైంది ? | Sakshi
Sakshi News home page

పులిరాజాకు ఇప్పుడు ఏమైంది ?

Published Sun, Nov 27 2016 1:10 AM

పులిరాజాకు ఇప్పుడు ఏమైంది ?

 డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా...
 ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’... ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్ / హెచ్‌ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ పులిరాజా ఇప్పుడేమయ్యాడు? బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వంటి వాటి తాకిడితో మరుగునపడ్డాడా?
 
 ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే ప్రచారం ఒకప్పుడు ఊరూ వాడా హోరెత్తించింది. ఎయిడ్స్ లేదా హెచ్‌ఐవీ అంటేనే జనం భయంతో వణికిపోయే రోజులవి. ‘పులిరాజా’ ప్రచారం జనంలో ఎయిడ్స్‌పై కొంత మేరకు అవగాహన కల్పించడంలో సఫలమైంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వైరస్ వంటి ఉపద్రవాలు ముంచుకు రావడంతో ఎయిడ్స్ నుంచి జనం దృష్టి మళ్లింది. కొన్నేళ్లుగా ఎయిడ్స్/హెచ్‌ఐవీ వ్యాప్తిలో కొంత తగ్గుదల నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఎయిడ్స్/హెచ్‌ఐవీ పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే, గడచిన రెండు మూడు దశాబ్దాలతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టింది. యాంటీ రిట్రోవైరల్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇది కొంత ఆశాజనకమైన పరిణామమే అయినా, ఎయిడ్స్/హెచ్‌ఐవీ మన దేశం నుంచి ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు. కనీసం అంతరించే దశకు కూడా చేరుకోలేదు. హెచ్‌ఐవీ కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా కలిపి చూసుకుంటే, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్/హెచ్‌ఐవీ పరిస్థితిపై ఒక విహంగ వీక్షణం.
 
 ఇదీ చరిత్ర
 మూడు దశాబ్దాల కిందటి వరకు ఎయిడ్స్/హెచ్‌ఐవీ అంటే జనానికి ఏమీ తెలియదు. ఫ్రెంచి సంతతికి చెందిన కెనడియన్ ఫ్లైట్ అటండెంట్ గేటన్ డుగాస్ అంతుచిక్కని లక్షణాలతో అమెరికాలో చికిత్స పొందుతూ 1984లో మరణించాడు. అమెరికన్ వైద్య నిపుణులు ఇతడినే తొలి ఎయిడ్స్ రోగిగా గుర్తించారు. విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డ డుగాస్‌కు ఉత్తర అమెరికా అంతటా దాదాపు 2500 మంది లైంగిక భాగస్వాములు ఉండేవారు. వాళ్లలో దాదాపు సగానికి సగం మంది స్వలింగ భాగస్వాములూ ఉండేవారు. డుగాస్ పుణ్యాన ఎంతమందికి ఈ వ్యాధి సంక్రమించిందో కచ్చితమైన లెక్కలేవీ దొరకలేదు గానీ, అతడు మరణించిన కొద్ది కాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా ఎయిడ్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
 నిజానికి అంతకు ముందు 1969లోనే రాబర్ట్ రేఫోర్డ్ అనే ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ టీనేజర్ ఈ వ్యాధితో మరణించాడు. అతడు మరణించే నాటికి ప్రాణాంతకమైన ఈ వ్యాధికి ఎయిడ్స్ అనే పేరు పెట్టలేదు. దీనికి కారణమయ్యే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌నూ (హెచ్‌ఐవీ) గుర్తించలేదు. రాబర్ట్ మరణించిన చాలాకాలానికి అతడి నమూనాలపై పరిశోధనలు సాగించిన వైద్యులు అతడు ఎయిడ్స్ వల్లే మరణించినట్లు నిర్ధారించారు. అయితే, ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్‌ఐవీ వైరస్ మొదట పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోని చింపాంజీలు, గొరిల్లాలు వంటి వానరాలకు సోకిందని, వాటి నుంచి మనుషులకు వ్యాపించిందని గుర్తించారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి మనుషులకు సోకిన పదేళ్లలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 
 
 తొలినాళ్లలో ఈ వ్యాధి అవగాహన రాహిత్యం, సిరంజీలను తగిన రీతిలో స్టెరిలైజ్ చేయకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత చికిత్సా పద్ధతులు, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల విపరీతంగా వ్యాపించింది. దీని పర్యవసానాలను గురించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకోవడంతో కొంత కాలానికి వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. శాస్త్ర పరిశోధనలతో చికిత్సా పద్ధతుల్లోనూ మార్పులు వచ్చాయి. యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా హెచ్‌ఐవీ సోకిన వారి జీవన ప్రమాణాలు, ఆయుఃప్రమాణం మెరుగుపడ్డాయి. అయితే, ఇప్పటికీ చికిత్సకు నోచుకోని రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. 
 
 ప్రపంచంలో ఇదీ పరిస్థితి
 ఎయిడ్స్ బారిన పడ్డ ప్రముఖులు
ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం ఎయిడ్స్ భూతానికి బలైపోయారు. రక్తమార్పిడి వల్ల ఎయిడ్స్ బారిన పడి మరణించిన తొలి సెలిబ్రిటీగా అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అర్థర్ యాష్ వార్తల్లో నిలిచాడు. గుండె ఆపరేషన్ సమయంలో రక్తమార్పిడి చేసిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల హెచ్‌ఐవీ బారిన పడ్డాడు. అప్పటికి ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రాకపోవడంతో ఎయిడ్స్ కోరల్లో చిక్కి 1993 ఫిబ్రవరి 6న నిస్సహాయంగా కన్నుమూశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాల కారణంగా ఎయిడ్స్ బారిన పడి మరణించిన ప్రముఖుల్లో బ్రిటిష్ రాక్‌స్టార్ ఫ్రెడ్డీ మెర్క్యురీ, ప్రపంచంలోనే తొలి సూపర్‌మోడల్ గియా కరాంగీ, అమెరికన్ నటి అమండా బ్లాక్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కొడుకు మగతో మండేలా వంటి వారు చాలామందే ఉన్నారు. తనకు ఎయిడ్స్ సోకినట్లు బహిరంగంగా ప్రకటించిన తొలి సెలిబ్రిటీ మాత్రం హాలీవుడ్ నటుడు రాక్ హడ్సన్. ఈ విషయాన్ని అతడు 1985 జూలైలో మీడియాకు వెల్లడించాడు. ఆ తర్వాత మూడు నెలలు గడిచేలోగానే మరణించాడు.
 
 హెచ్‌ఐవీ గుర్తింపుతో మలుపు
 ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్నది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) అనే విషయాన్ని తొలిసారిగా 1982లో ఫ్రెంచి వైరాలజిస్ట్ డాక్టర్ లూక్ మాంటేనియర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గుర్తించింది. ఈ పరిశోధనకు గుర్తింపుగా మాంటేనియర్, ఫ్రాంకోయిస్ బారెసినౌసి, హెరాల్డ్ జుర్ హాసెన్‌లకు 2008లో నోబెల్ బహుమతి లభించింది. మహమ్మారిలాంటి ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏమిటో కనుగొన్న తర్వాత హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ చికిత్స పద్ధతులు చాలా మెరుగుపడ్డాయి. హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా, చాలావరకు సమర్థంగా నియంత్రించగల ఔషధాలు తయారయ్యాయి. హెచ్‌ఐవీ వైరస్‌ను కట్టడి చేయగల యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు మొట్టమొదటిసారిగా 1987లో అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు హెచ్‌ఐవీ సోకిన వారికి ఇతరేతర ఔషధాలతో చికిత్సలు చేస్తూ వచ్చినా, అవేవీ వారి జీవితకాలాన్ని పొడిగించలేకపోయేవి. 
 
యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ఏఆర్టీ) అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం హెచ్‌ఐవీ సోకిన వారిలో 46 శాతం మంది మాత్రమే ఈ చికిత్సను పొందుతున్నారు. అంటే, దాదాపు సగానికి పైగా హెచ్‌ఐవీ రోగులు నేటికీ తగిన చికిత్సకు నోచుకోలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స కోసం గత ఏడాది కొత్తగా 20 లక్షల మంది నమోదయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2010 నాటికి 75 లక్షలుగా ఉంటే, 2015 నాటికి ఈ సంఖ్య 1.70 కోట్లకు చేరుకుంది. ఇంకా చికిత్సకు నోచుకోని హెచ్‌ఐవీ రోగుల సంఖ్య దాదాపు 2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2020 నాటికి హెచ్‌ఐవీ సోకిన వారిలో 90 శాతం మందిని ఏఆర్టీ చికిత్స పరిధిలోకి తీసుకురావాలని యూఎన్‌ఎయిడ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది.
 
 మన దేశంలో ఇలా...
 ముప్పయ్యేళ్ల కిందటి వరకు భారత్‌లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పేరు సైతం ఎవరికీ తెలియదు. తొలిసారిగా 1986లో డాక్టర్ సునీతి సాల్మన్ అనే వైద్యురాలు చైన్నయ్‌లోని ఒక సెక్స్ వర్కర్‌కు  ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అదే దేశంలోని తొలి కేసు. ఏడాది గడిచే సరికి కొత్తగా మరో 135 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లలో పద్నాలుగు మందికి అప్పటికే ఎయిడ్స్ ముదిరిపోయిన దశలో ఉంది. తర్వాతి కాలంలో శరవేగంగా హెచ్‌ఐవీ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థను (నాకో) ఏర్పాటు చేసింది. ‘నాకో’ ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగించింది. హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపట్టింది.
 
 ఒకవైపు ప్రభుత్వం తన వంతుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా, 2010 నాటికి మన దేశంలో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 23.95 లక్షలకు చేరుకుంది. అయితే, 2000 సంవత్సరానికి ముందు పరిస్థితితో పోలిస్తే, 2000 నుంచి 2010 మధ్య కాలంలో కొత్త కేసుల సంఖ్య దాదాపు సగానికి సగం తగ్గినట్లు యూఎన్ ఎయిడ్స్-2012 నివేదిక వెల్లడించింది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను గుర్తించినప్పటి నుంచి మన దేశంలో ఈ వ్యాధితో దాదాపు 1.70 లక్షల మంది మరణించారు. ఇదిలా ఉంటే, గత ఏడాది మన దేశంలో కొత్తగా 1.96 లక్షల హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత ఏడాది లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం దాదాపు 28.81 లక్షల మంది హెచ్‌ఐవీతో ఉన్నట్లు అంచనా. 
 
 కండోమ్స్ వంటి రక్షణ సాధనాలేవీ లేకుండా అపరిచితులతో లేదా సెక్స్ వర్కర్స్‌తో సెక్స్‌లో పాల్గొనడం ద్వారా హెచ్‌ఐవీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైంగిక అవయవాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నా, నోటి ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశాలు లేకపోలేదు.
 
 స్త్రీ పురుష లైంగిక సంబంధాలు లేదా పురుషుల స్వలింగ సంపర్కం ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. వారితో పోల్చుకుంటే స్త్రీ స్వలింగ సంపర్కుల మధ్య హెచ్‌ఐవీ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ.
 
 స్టెరిలైజ్ చేయని సూదుల వల్ల, ఎలాంటి పరీక్షలు జరపకుండా హెచ్‌ఐవీ సోకిన రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల అన్నెం పున్నెం ఎరుగని అమాయకులకు సైతం హెచ్‌ఐవీ సోకిన సందర్భాలు లేకపోలేదు.
 
 సిఫిలిస్, గనేరియా వంటి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారికి హెచ్‌ఐవీ త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
 హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు తల్లుల ద్వారానే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉంటాయి. పుట్టిన తర్వాత తల్లిపాల ద్వారా కూడా హెచ్‌ఐవీ సోకే అవకాశాలు ఉంటాయి. అభం శుభం తెలియని చాలామంది చిన్నారులు తల్లుల ద్వారానే ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే, తల్లుల నుంచి బిడ్డలకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనం.
 
 వ్యాధి లక్షణాలు
 
 హెచ్‌ఐవీ సోకిన వెనువెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. శరీరంలో హెచ్‌ఐవీ వైరస్ బలం పుంజుకున్న తర్వాతే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. 
 
 తొలి దశలో మామూలు ఫ్లూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నోట్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం, అలసట, ఆకలి తగ్గుదల, చర్మంపై ర్యాష్, గొంతు బొంగురుపోవడం, లింఫ్ గ్రంథుల్లో వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొద్ది వారాల్లోనే ఈ లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి.
 
 రెండో దశలో హెచ్‌ఐవీ వైరస్ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. వైరస్ సోకిన మనిషిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ ప్రస్ఫుటంగా కనిపించవు. దాదాపు ఎనిమిది నుంచి పదేళ్ల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. నిద్రాణ స్థితిలో సైతం ఈ వైరస్ పునరుత్పత్తి కొనసాగిస్తూ శరీరంలో తామర తంపరగా పెరుగుతుంది. కీలకమైన రోగ నిరోధక కణాలను నాశనం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాల్లోని సీడీ4 లేదా టీ హెల్పర్ కణాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్నవారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించకపోయినా, వారి ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
 మూడో దశలో హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఎయిడ్స్‌గా (ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్) మారుతుంది. రక్తంలో సీడీ4 కణాల సంఖ్య మిల్లీలీటరుకు 500 లేదా అంతకంటే తక్కువకు పడిపోతోంది. ఈ పరిస్థితిలో రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో న్యుమోనియా, మెదడుకు ఇన్ఫెక్షన్, నోరు, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు, జ్వరం, డయేరియా, విపరీతంగా బరువు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
 వ్యాప్తికి కారణాలు