breaking news
December 1
-
రేపటి నుంచి ఇవన్నీ మారుతాయి: తప్పక తెలుసుకోండి
నవంబర్ నెల ముగిసింది. రేపటి (డిసెంబర్ 1) నుంచి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్ ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎల్పీజీ ధరలుప్రతి నెల మాదిరిగానే ఆయిల్ మార్కెట్ కంపెనీలు 1వ తేదీ ఎల్పీజీ సిలిండర్ (కమర్షియల్, డొమెస్టిక్) ధరలను సవరిస్తాయి. ప్రతి నెలలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలలో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ 1న జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.TRAI గడువుడిసెంబర్ 1, 2024న.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ నిబంధనలు ఓటీపీ సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది.SBI క్రెడిట్ కార్డ్డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు.. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ వివరాలకు ఉచిత అప్డేట్ చేసుకోవడానికి గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. కాబట్టి కార్డ్ హోల్డర్లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండే అవకాశం ఉంది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుజూలై 31 గడువులోగా 2023-24 (FY 24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు.. డిసెంబర్‌లోగా తమ ITRని సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయవచ్చు. -
నేటి నుంచి కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ.10 లక్షలు ఫైన్
సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించిన డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నట్లు గత ఆగష్టు నెలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. దీని ప్రకారమే ఈ రోజు (23 డిసెంబర్ 1) నుంచి ఆ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం, పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్‌దారు ఒప్పందంపై సంతకం చేయాలి. నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుడు తప్పనిసరిగా వ్యక్తిగత వివరాలను అందించాలి. సిమ్ కార్డు అందించే ఏజెంట్ కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు క్యూఆర్ స్కాన్ చేసి వివరాలు సేకరిస్తాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి మరో విషయం ఏమిటంటే ఒక సిమ్ డిస్కనెక్ట్ అయిన 3 నెలలు లేదా 90 రోజుల తర్వాత కొత్త కస్టమర్‌కు ఆ మొబైల్ నెంబర్ కేటాయించాలి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి, ఒక ఐడీ మీద గరిష్టంగా 9 సిమ్ కార్డులకంటే ఎక్కువ కొనుగోలు చేయకూడదు. అయితే కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ ఖాతాలకు ఈ నియమం వర్తించదు, కానీ ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చనే విషయం వెల్లడి కాలేదు. -
డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే!
న్యూఢిల్లీ: డిజిటల్ రుణాలకు ఆర్బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలతో పాటు కొత్తగా మంజూరు చేసే రుణాలకు సైతం ఇవి వర్తిస్తాయి. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనవసర చార్జీల రూపంలో వినియోగదారులను దోపిడీ చేయకుండా, రుణాల వసూళ్లకు అనైతిక విధానాలకు పాల్పడ కుండా కఠిన నిబంధనలను ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. (అంతా తూచ్! యాపిల్ ఆఫీస్ భలే ఉంది: మస్క్ యూటర్న్) నూతన నిబంధనల కింద రుణ వితరణ, వాటి వసూలు అన్నవి రుణ గ్రహీత ఖాతా, ఆర్బీఐ వద్ద నమోదైన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థల మధ్యే నేరుగా ఉండాలి. రుణం మంజూరునకు ముందు వరకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు పరిమితం కావాల్సి ఉంటుంది. అంతేకానీ, ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రుణాల జమ, వసూలు ఉండకూడదు. ఇక మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లకు చార్జీలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలే చెల్లించుకోవాలి. రుణ గ్రహీత నుంచి వసూలు చేయరాదు. (శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర) ‘‘కరోనా తర్వాత డిజిటల్ రుణాలు, చెల్లింపులు పెరిగాయి. కనుక మెరుగైన వ్యవస్థలు, విధానాలు అనేవి డేటా గోప్యత, వ్యక్తిగత సమాచార రక్షణ దృష్ట్యా అవసరం’’అని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ పేర్కొన్నారు. కొత్త నిబంధనల నేపథ్యంలో లైసెన్స్ కలిగి, నిబంధనలను పాటించే కంపెనీలు.. ఫిన్‌టెక్‌లు, ఇతర ఎన్బీఎఫ్సీ బాగస్వామ్య కంపెనీల కంటే పైచేయి చూపిస్తాయని వివిఫి ఫైనాన్సెస్ సీఈవో అనిల్ పినపాల అభిప్రాయపడ్డారు. -
డిజిటల్ కరెన్సీ: సీబీడీసీపై ఆర్బీఐ కీలక ప్రకటన
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిజిటల్ రుపీ వెర్షన్ డిసెంబర్ 1 న లాంచ్ చేస్తున్నట్టు మంగళవారం(నవంబర్ 29) ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ సీబీడీసీపైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) క్లోజ్డ్ యూజర్ గ్రూప్ వినియోగదారులు భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్లు లేదా పరికరాలలో నిల్వ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీంతో రీటైల్ సెగ్మెంట్లో సాధారణ వ్యాపారులకు, కస్టమర్లకు డిజిటల్ రుపీ అందుబాటులోకి రానుంది. (నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్) కొన్ని ముఖ్యాంశాలు ♦రిటైల్ డిజిటల్ ప్రస్తుతం చలామణిలోఉన్న 2 వేలు, 500, 200 రూపాయలు తదితర కరెన్సీ నోట్లు, నాణేలలాగానే అదే డినామినేషన్లలో అందుబాటులో ఉంటుంది. ♦వ్యక్తి నుండి వ్యక్తికి ( పీటూపీ) లావాదేవీలు అలాగే వ్యక్తి నుండి వ్యాపారి (పీటూ మర్చంట్) లావాదేవీలు చేసుకోవచ్చు. ♦అన్ని క్యూఆర్ కోడ్లను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు ♦భౌతిక నగదు విషయంలో మాదిరిగానే రిటైల్ డిజిటల్ రూపాయిలో సెటిల్మెంట్ ట్రస్ట్, సేఫ్టీ హామీ ఇస్తుంది. ♦ వాలెట్లలో నిల్వ ఉంచిన డిజిటల్ కరెన్సీకి ఎటువంటి వడ్డీ రాదు ♦ అయితే రిటైల్ డిజిటల్ రూపాయిని వడ్డీని సంపాదించే బ్యాంకుల్లో డిపాజిట్లుగా మార్చుకోవచ్చు . ♦తొలిదశగా దేశంలోని నాలుగు నగరాల్లో ఎస్బీఐ, సీఐసీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ ద్వారా తొలి దశలో లావాదేవీలను ప్రారంభించనుంది. ♦ రెండో దశలో మరిన్ని నగరాల్లో బీవోబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ తదుపరి దశలో పైలట్‌లో చేరనున్నాయి. ♦ ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ అనే నాలుగు నగరాల్లో డిజిల్ రూపాయి లావాదేవీలు ప్రారంభం. క్రమంగా అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా సిమ్లాలకు అమల్లోకి వస్తుంది. క్రమంగా మరిన్ని బ్యాంకులు, నగరాలు ఈ జాబితాలో చేరతాయి. కాగా నవంబర్ 1 నుంచే ఆర్బీఐ హోల్‌సేల్ ఇ-రూపాయిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది, ఎనిమిది బ్యాంకులు ఇ-రూపాయిని ఉపయోగించి ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీలు జరుపు తున్నాయి. దీని ఆధారంగా ఇ-రూపాయి ఇతర ఫీచర్లు ,అప్లికేషన్లను తర్వాత టెస్ట్ చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ అమలుపై సమీక్ష తరువాత మరిన్ని బ్యాంకులు, వినియోగదారులు పరిధిని క్రమంగా విస్తరిస్తామని గతంలో ఆర్బీఐను ప్రకటించింది. ఇదీ చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? -
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
New Rules From 1st December 2021: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి అద్దె బిల్లులు, చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున చెల్లిస్తారు. ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. దేశవ్యాప్తంగా వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వంటి అనేక అంశాలకు సంబంధించి డిసెంబర్లో మార్పులు చోటు చేసుకొనున్నాయి. అలాంటి కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు డిసెంబర్ 1 నుంచి ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్బీఐ ప్రకటించింది. అంటే ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు 2021 డిసెంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధరలను పెంచనున్నట్లు ఉత్పత్తిదారులు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండనున్నాయి. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఇస్తున్న 2.90 వార్షిక వడ్డీని 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతానికి తగ్గిస్తూన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభించనుంది. 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్స్ ఫైల్ చేయాల్సిన వారికి 2021 డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. ఒకవేళ అప్పట్లోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత జరిమానా ఫీజు చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయల్సి ఉంటుంది. నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్ పొందాలంటే ఏటా నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్స్‌పై 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు జియో ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ 2021 డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు నవంబర్ 30లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందే. లేకపోతే డిసెంబర్ నెలకు సంబంధించిన యజమాని వాటా ఈపీఎఫ్ అకౌంట్లో జమ కాదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, డిసెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.266 పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మరి డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి. (చదవండి: మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్వర్డ్ అవసరం లేదు!) -
పులిరాజాకు ఇప్పుడు ఏమైంది ?
డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా... ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’... ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్ / హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ పులిరాజా ఇప్పుడేమయ్యాడు? బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వంటి వాటి తాకిడితో మరుగునపడ్డాడా? ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే ప్రచారం ఒకప్పుడు ఊరూ వాడా హోరెత్తించింది. ఎయిడ్స్ లేదా హెచ్ఐవీ అంటేనే జనం భయంతో వణికిపోయే రోజులవి. ‘పులిరాజా’ ప్రచారం జనంలో ఎయిడ్స్‌పై కొంత మేరకు అవగాహన కల్పించడంలో సఫలమైంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వైరస్ వంటి ఉపద్రవాలు ముంచుకు రావడంతో ఎయిడ్స్ నుంచి జనం దృష్టి మళ్లింది. కొన్నేళ్లుగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాప్తిలో కొంత తగ్గుదల నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఎయిడ్స్/హెచ్ఐవీ పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే, గడచిన రెండు మూడు దశాబ్దాలతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్ఐవీ కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టింది. యాంటీ రిట్రోవైరల్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇది కొంత ఆశాజనకమైన పరిణామమే అయినా, ఎయిడ్స్/హెచ్ఐవీ మన దేశం నుంచి ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు. కనీసం అంతరించే దశకు కూడా చేరుకోలేదు. హెచ్ఐవీ కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా కలిపి చూసుకుంటే, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్/హెచ్ఐవీ పరిస్థితిపై ఒక విహంగ వీక్షణం. ఇదీ చరిత్ర మూడు దశాబ్దాల కిందటి వరకు ఎయిడ్స్/హెచ్ఐవీ అంటే జనానికి ఏమీ తెలియదు. ఫ్రెంచి సంతతికి చెందిన కెనడియన్ ఫ్లైట్ అటండెంట్ గేటన్ డుగాస్ అంతుచిక్కని లక్షణాలతో అమెరికాలో చికిత్స పొందుతూ 1984లో మరణించాడు. అమెరికన్ వైద్య నిపుణులు ఇతడినే తొలి ఎయిడ్స్ రోగిగా గుర్తించారు. విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డ డుగాస్‌కు ఉత్తర అమెరికా అంతటా దాదాపు 2500 మంది లైంగిక భాగస్వాములు ఉండేవారు. వాళ్లలో దాదాపు సగానికి సగం మంది స్వలింగ భాగస్వాములూ ఉండేవారు. డుగాస్ పుణ్యాన ఎంతమందికి ఈ వ్యాధి సంక్రమించిందో కచ్చితమైన లెక్కలేవీ దొరకలేదు గానీ, అతడు మరణించిన కొద్ది కాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా ఎయిడ్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిజానికి అంతకు ముందు 1969లోనే రాబర్ట్ రేఫోర్డ్ అనే ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ టీనేజర్ ఈ వ్యాధితో మరణించాడు. అతడు మరణించే నాటికి ప్రాణాంతకమైన ఈ వ్యాధికి ఎయిడ్స్ అనే పేరు పెట్టలేదు. దీనికి కారణమయ్యే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌నూ (హెచ్ఐవీ) గుర్తించలేదు. రాబర్ట్ మరణించిన చాలాకాలానికి అతడి నమూనాలపై పరిశోధనలు సాగించిన వైద్యులు అతడు ఎయిడ్స్ వల్లే మరణించినట్లు నిర్ధారించారు. అయితే, ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్ఐవీ వైరస్ మొదట పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోని చింపాంజీలు, గొరిల్లాలు వంటి వానరాలకు సోకిందని, వాటి నుంచి మనుషులకు వ్యాపించిందని గుర్తించారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి మనుషులకు సోకిన పదేళ్లలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తొలినాళ్లలో ఈ వ్యాధి అవగాహన రాహిత్యం, సిరంజీలను తగిన రీతిలో స్టెరిలైజ్ చేయకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత చికిత్సా పద్ధతులు, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల విపరీతంగా వ్యాపించింది. దీని పర్యవసానాలను గురించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకోవడంతో కొంత కాలానికి వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. శాస్త్ర పరిశోధనలతో చికిత్సా పద్ధతుల్లోనూ మార్పులు వచ్చాయి. యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా హెచ్ఐవీ సోకిన వారి జీవన ప్రమాణాలు, ఆయుఃప్రమాణం మెరుగుపడ్డాయి. అయితే, ఇప్పటికీ చికిత్సకు నోచుకోని రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఇదీ పరిస్థితి ఎయిడ్స్ బారిన పడ్డ ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం ఎయిడ్స్ భూతానికి బలైపోయారు. రక్తమార్పిడి వల్ల ఎయిడ్స్ బారిన పడి మరణించిన తొలి సెలిబ్రిటీగా అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అర్థర్ యాష్ వార్తల్లో నిలిచాడు. గుండె ఆపరేషన్ సమయంలో రక్తమార్పిడి చేసిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల హెచ్ఐవీ బారిన పడ్డాడు. అప్పటికి ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రాకపోవడంతో ఎయిడ్స్ కోరల్లో చిక్కి 1993 ఫిబ్రవరి 6న నిస్సహాయంగా కన్నుమూశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాల కారణంగా ఎయిడ్స్ బారిన పడి మరణించిన ప్రముఖుల్లో బ్రిటిష్ రాక్‌స్టార్ ఫ్రెడ్డీ మెర్క్యురీ, ప్రపంచంలోనే తొలి సూపర్‌మోడల్ గియా కరాంగీ, అమెరికన్ నటి అమండా బ్లాక్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కొడుకు మగతో మండేలా వంటి వారు చాలామందే ఉన్నారు. తనకు ఎయిడ్స్ సోకినట్లు బహిరంగంగా ప్రకటించిన తొలి సెలిబ్రిటీ మాత్రం హాలీవుడ్ నటుడు రాక్ హడ్సన్. ఈ విషయాన్ని అతడు 1985 జూలైలో మీడియాకు వెల్లడించాడు. ఆ తర్వాత మూడు నెలలు గడిచేలోగానే మరణించాడు. హెచ్ఐవీ గుర్తింపుతో మలుపు ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్నది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనే విషయాన్ని తొలిసారిగా 1982లో ఫ్రెంచి వైరాలజిస్ట్ డాక్టర్ లూక్ మాంటేనియర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గుర్తించింది. ఈ పరిశోధనకు గుర్తింపుగా మాంటేనియర్, ఫ్రాంకోయిస్ బారెసినౌసి, హెరాల్డ్ జుర్ హాసెన్లకు 2008లో నోబెల్ బహుమతి లభించింది. మహమ్మారిలాంటి ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏమిటో కనుగొన్న తర్వాత హెచ్ఐవీ/ ఎయిడ్స్ చికిత్స పద్ధతులు చాలా మెరుగుపడ్డాయి. హెచ్ఐవీ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా, చాలావరకు సమర్థంగా నియంత్రించగల ఔషధాలు తయారయ్యాయి. హెచ్ఐవీ వైరస్‌ను కట్టడి చేయగల యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు మొట్టమొదటిసారిగా 1987లో అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు హెచ్ఐవీ సోకిన వారికి ఇతరేతర ఔషధాలతో చికిత్సలు చేస్తూ వచ్చినా, అవేవీ వారి జీవితకాలాన్ని పొడిగించలేకపోయేవి. యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ఏఆర్టీ) అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం హెచ్ఐవీ సోకిన వారిలో 46 శాతం మంది మాత్రమే ఈ చికిత్సను పొందుతున్నారు. అంటే, దాదాపు సగానికి పైగా హెచ్ఐవీ రోగులు నేటికీ తగిన చికిత్సకు నోచుకోలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స కోసం గత ఏడాది కొత్తగా 20 లక్షల మంది నమోదయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2010 నాటికి 75 లక్షలుగా ఉంటే, 2015 నాటికి ఈ సంఖ్య 1.70 కోట్లకు చేరుకుంది. ఇంకా చికిత్సకు నోచుకోని హెచ్ఐవీ రోగుల సంఖ్య దాదాపు 2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2020 నాటికి హెచ్ఐవీ సోకిన వారిలో 90 శాతం మందిని ఏఆర్టీ చికిత్స పరిధిలోకి తీసుకురావాలని యూఎన్ఎయిడ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది. మన దేశంలో ఇలా... ముప్పయ్యేళ్ల కిందటి వరకు భారత్‌లో హెచ్ఐవీ/ఎయిడ్స్ పేరు సైతం ఎవరికీ తెలియదు. తొలిసారిగా 1986లో డాక్టర్ సునీతి సాల్మన్ అనే వైద్యురాలు చైన్నయ్‌లోని ఒక సెక్స్ వర్కర్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అదే దేశంలోని తొలి కేసు. ఏడాది గడిచే సరికి కొత్తగా మరో 135 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లలో పద్నాలుగు మందికి అప్పటికే ఎయిడ్స్ ముదిరిపోయిన దశలో ఉంది. తర్వాతి కాలంలో శరవేగంగా హెచ్ఐవీ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థను (నాకో) ఏర్పాటు చేసింది. ‘నాకో’ ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగించింది. హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపట్టింది. ఒకవైపు ప్రభుత్వం తన వంతుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా, 2010 నాటికి మన దేశంలో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 23.95 లక్షలకు చేరుకుంది. అయితే, 2000 సంవత్సరానికి ముందు పరిస్థితితో పోలిస్తే, 2000 నుంచి 2010 మధ్య కాలంలో కొత్త కేసుల సంఖ్య దాదాపు సగానికి సగం తగ్గినట్లు యూఎన్ ఎయిడ్స్-2012 నివేదిక వెల్లడించింది. హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను గుర్తించినప్పటి నుంచి మన దేశంలో ఈ వ్యాధితో దాదాపు 1.70 లక్షల మంది మరణించారు. ఇదిలా ఉంటే, గత ఏడాది మన దేశంలో కొత్తగా 1.96 లక్షల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత ఏడాది లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం దాదాపు 28.81 లక్షల మంది హెచ్ఐవీతో ఉన్నట్లు అంచనా. కండోమ్స్ వంటి రక్షణ సాధనాలేవీ లేకుండా అపరిచితులతో లేదా సెక్స్ వర్కర్స్‌తో సెక్స్‌లో పాల్గొనడం ద్వారా హెచ్ఐవీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైంగిక అవయవాల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నా, నోటి ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. స్త్రీ పురుష లైంగిక సంబంధాలు లేదా పురుషుల స్వలింగ సంపర్కం ద్వారా హెచ్ఐవీ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. వారితో పోల్చుకుంటే స్త్రీ స్వలింగ సంపర్కుల మధ్య హెచ్ఐవీ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ. స్టెరిలైజ్ చేయని సూదుల వల్ల, ఎలాంటి పరీక్షలు జరపకుండా హెచ్ఐవీ సోకిన రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల అన్నెం పున్నెం ఎరుగని అమాయకులకు సైతం హెచ్ఐవీ సోకిన సందర్భాలు లేకపోలేదు. సిఫిలిస్, గనేరియా వంటి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవీ త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెచ్ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు తల్లుల ద్వారానే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉంటాయి. పుట్టిన తర్వాత తల్లిపాల ద్వారా కూడా హెచ్ఐవీ సోకే అవకాశాలు ఉంటాయి. అభం శుభం తెలియని చాలామంది చిన్నారులు తల్లుల ద్వారానే ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే, తల్లుల నుంచి బిడ్డలకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనం. వ్యాధి లక్షణాలు హెచ్ఐవీ సోకిన వెనువెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. శరీరంలో హెచ్ఐవీ వైరస్ బలం పుంజుకున్న తర్వాతే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. తొలి దశలో మామూలు ఫ్లూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నోట్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం, అలసట, ఆకలి తగ్గుదల, చర్మంపై ర్యాష్, గొంతు బొంగురుపోవడం, లింఫ్ గ్రంథుల్లో వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొద్ది వారాల్లోనే ఈ లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. రెండో దశలో హెచ్ఐవీ వైరస్ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. వైరస్ సోకిన మనిషిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ ప్రస్ఫుటంగా కనిపించవు. దాదాపు ఎనిమిది నుంచి పదేళ్ల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. నిద్రాణ స్థితిలో సైతం ఈ వైరస్ పునరుత్పత్తి కొనసాగిస్తూ శరీరంలో తామర తంపరగా పెరుగుతుంది. కీలకమైన రోగ నిరోధక కణాలను నాశనం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాల్లోని సీడీ4 లేదా టీ హెల్పర్ కణాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్నవారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించకపోయినా, వారి ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడో దశలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ఎయిడ్స్‌గా (ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్) మారుతుంది. రక్తంలో సీడీ4 కణాల సంఖ్య మిల్లీలీటరుకు 500 లేదా అంతకంటే తక్కువకు పడిపోతోంది. ఈ పరిస్థితిలో రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో న్యుమోనియా, మెదడుకు ఇన్ఫెక్షన్, నోరు, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు, జ్వరం, డయేరియా, విపరీతంగా బరువు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తికి కారణాలు హెచ్ఐవీ వ్యాప్తికి ముఖ్యంగా రక్షణ లేని శృంగార సంబంధాలే కారణంగా ఉన్నా, ఇతరేతర కారణాలు కూడా ఈ వ్యాధి వ్యాప్తికి దోహదపడుతున్నాయి. హెచ్ఐవీ వ్యాప్తికి దారితీస్తున్న ముఖ్యమైన కారణాలు ఇవే... పరిశోధనలు ఆశాజనకం ఎయిడ్స్/హెచ్ఐవీ నిరోధానికి, చికిత్సకు సమర్థంగా ఉపయోగపడగల 44 కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కోసం అమెరికన్ బయోఫార్మా కంపెనీలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 25 యాంటీ వైరల్ ఔషధాలు, 16 వ్యాక్సిన్లు కాగా మరో మూడు జన్యువుల స్థాయిలో మార్పు తెచ్చి హెచ్ఐవీని రూపుమాపగల ఔషధాలని, ఇవి అందుబాటులోకి వస్తే హెచ్ఐవీపై విజయం సాధించినట్లేనని ఔషధ తయారీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఔషధాల వల్ల హెచ్ఐవీ రోగుల జీవితకాలాన్ని మరో పదిహేనేళ్ల వరకు పొడిగించడానికి వీలవుతోందని, సమర్థమైన కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చినట్లయితే పరిస్థితి మరింత మెరుగుపడగలదని చెబుతున్నారు.