నవ్వింత: కాకి గోల

నవ్వింత: కాకి గోల - Sakshi


ఓ వేకువజామున కాకి నా కలలోకి ప్రవేశించి ఇలా అంది: ‘‘నాయనా, తెలుగుసాహిత్యానికి నాకంటే తక్కువ సేవ చేసిన వాళ్లు కూడా ఆత్మకథలు రాసుకుంటున్నప్పుడు నేను రాసుకోకపోతే ఎలా? అందుకే నిన్ను అడుగుతున్నాను. ఈ వాయసకారుడికి నువ్వో వ్రాయసకాడుగా మారాలి’’. ‘‘తెలుగు సాహిత్యానికి నువ్వు సేవ చేశావా?’’ ఆశ్చర్యపోయాను.  ‘‘అంతా ఇంతా కాదు నాయనా. ఓ కాకి తన తెలివితేటలతో కుండ అడుగున ఉన్న నీళ్లను రాళ్లు వేసి ఎలా పైకి తెచ్చిందనేదే ప్రపంచంలోని ఏ పిల్లాడైనా తొలిగా తెలుసుకునే కథ. ఆదికావ్యం విషయంలో నన్నయ్య ఎలాగో తొలికథ మాటకొస్తే ఈ ‘కాకమ్మ’ అంతే బాబూ. పిట్టకథలు బ్రహ్మాండమైన శాస్త్రం అయితే... అందులో ప్రత్యేకమైన అధ్యాయం నా కాకమ్మకథలు నాయనా.

 

 తెలివైన హీరో నేననే ప్రస్తావన లేకుండా తెలుగు సాహిత్యమే లేదు బాబూ’’  ‘‘నెంబర్‌వన్‌లంటూ ఎవరికివారు చెప్పుకునే టాప్ టాలివుడ్ సినిమా హీరోలు కూడా ఇంతగా మిడిసిపడటం లేదు..’’ మధ్యలోనే  ఆగిపోయా. ‘‘సినిమాల సంగతికి తర్వాత వస్తా. పంచతంత్ర కథల్లోని చాలావాటిల్లో నేనే హిట్ హీరో. నా గుడ్లను రక్షించుకునేందుకు రాణిగారి హారాన్ని తెచ్చి నా గూడు కింద ఉన్న పుట్టలో వేసి పామును చంపించి, నా పిల్లలను రక్షించుకునే నా తెలివితేటలతోనే మీ జాతి జాతంతా యుక్తిని నేర్చుకుంటుంది బాబూ’’ ‘‘ఏదో నాలుగు కాకమ్మ కథల్లో నువ్వు హీరో కదా అని మొత్తం సాహిత్యమంతా నువ్వేనని దబాయించకు’’

 

 ‘‘తప్పు నాయనా! ఆదికావ్యం రామాయణం నుంచి అంతా నేనే నాయనా. సీతమ్మను కాస్త అలా పొడిచి రాముడికి కోపం వచ్చేలా చేసి... శాపవిమోచనం కోసం నాపై బ్రహ్మాస్త్రం విడుచుకునేలా చేసుకుంది నా అంతట నేనే నాయనా. బ్రహ్మాస్త్రానికి గురై బయటపడ్డవాళ్లలో తొలి, మలి జీవినీ, ఏకైక పక్షినీ నేనే. బ్రహ్మాస్త్రానికి కాస్త గౌరవం ఇవ్వాలి కదాని కన్ను మాత్రం పోగొట్టుకుని ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు’ సామెతను మీకు ప్రెజెంట్ చేసింది కూడా నేనే. లబ్ధప్రతిష్ఠులమంటూ మీరు చెప్పుకునే ప్రతి కవీ నన్ను వాడుకున్నవాడే నాయనా. ప్రజాకవి అని పిలుచుకునే వేమన ‘పెంట  తినెడి కాకి పితరుడెట్లాయెరా’ అంటూ తన హేతుజ్ఞానాన్ని నా సాయంతోనే చాటి చెప్పుకున్నాడు. సుమతీ శతకకారుడు సైతం ‘తెల్లని కాకులూ... అల్లుని మంచిదనమూ లేవం’టూ ఈ లోకంలో లేనివాటిని చూపడం కోసం నన్నే ఉదాహరణగా వాడుకున్నాడు. వరవిక్రయం రాసిన కాళ్లకూరి వారికీ నేనే కావాల్సి వచ్చాను. సింగరాజు లింగరాజు లోభితనం చూపించడానికి అతడు నా గూటిపుల్లలనే వంట చేసుకున్నాడని రాశాడు. మీరు మహాకవి అనే శ్రీశ్రీ సైతం ‘కాకికేం తెలుసు సైకో అనాలసిస్సు’ అంటూ నాపైనే పడ్డాడు. ఎవరి బలహీనత ఏమిటో తెలుసుకుని వాళ్లను కాకాపట్టి పనులు సాధించుకునే వాళ్లను మీరే ‘కాకా’సురులు అంటారు...’’ ‘‘పోచికోలు కబుర్లు చెప్పుకోడానికి నిన్ను వాడుకున్నంత మాత్రాన సాహిత్యమంతా నువ్వేనంటే ఎలా?’’

 

 ‘‘పోచికోలు కబుర్లు వేరు నాయనా. నా గురించి చెప్పుకున్న కబుర్లను ‘కాకమ్మ’కబుర్లు అంటారు. అంతెందుకు తమ ఎదుటివారి పట్ల తమ గౌరవం చూపించుకోవాలంటే ఆ కబురును కాకి చేత పంపిస్తే చాలంటూ మళ్లీ నన్నే ఆశ్రయిస్తారు. మీకు సాహిత్యం ఎలాగూ ఆనదు. కాబట్టి సినిమాలనే ఉదాహరణలుగా చూపిస్తా. డీవీ నరసరాజు ఎదురింట్లో ఉండే ఆ ఇద్దరూ బద్ద శత్రువలని చెప్పడం కోసం ‘కాకి... కాల్చేశా. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలకూడదు కదా’ అనే డైలాగు రాశాడు. కావాలంటే చూ. యమగోల. జంధ్యాల ‘కాకీక కాకికి కోక కాక కాకికా కేకికా’ అంటూ నన్ను ఆశ్రయించి హాస్యం పడించుకున్నాడు. చూ. ఆనందభైరవి. పుచ్చాపూర్ణానందంగారని ఒక మహాత్ముడుండేవారు.

 

 ఆయనొక్కడే నాయనా నన్ను బాగా గౌరవించింది. నేను ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండటం చేత నా గొప్ప ఈ లోకానికి కనిపించడం లేదనీ, నేనే లేకపోతే లోకంలో ఎన్నో పలుకుబడులు, సామెతలూ ఉండేవికావని రాశాడు. కాళిదాసు సైతం నా గురించి కవనం చెప్పాడు. కాకపోతే స్నేహమంటే కోకిల పలుకుల్లా ఉండాలంటూ నన్ను నానా మాటలన్నాడు. ఆ కోకిల బిడ్డలకు ఈ కాకమ్మే తొలి ఆయమ్మనీ, బువ్వపెట్టే మారుటమ్మ లాంటి యశోదమ్మనీ తెలియక అపార్థం చేసుకున్నాడనుకో. తెలిసుంటే కాళిదాసు తన పేరును కాకిదాసు అని మార్చుకునేవాడేమో! ఇక నా గౌరవార్థమే తెలుగువాళ్లు ‘కాకి’నాడ అనీ, శ్రీ‘కాకుళం’ అని పేరు పెట్టుకున్నారు. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా! తెలుగువాళ్ల తొలి రాజధాని హైదరాబాదో, కర్నూలో, చెన్నపట్నమో, అలనాటి ప్రతిష్ఠానపురమో కాదు... నిశుంభుడిని సంహరించాక ఆంధ్రవిష్ణువు కట్టించుకున్న శ్రీ‘కాకుళ’మే తెలుగువాళ్ల తొలి రాజధాని...’’

 

 ఈ కాకోపదేశం సాగుతుండగానే తెల్లారింది. ఈ వేళలో వచ్చిన కలలు నిజమంటారు. కాకిదేవత కలలోకి వచ్చి నన్ను కరుణించి ఇలా ప్రసంగించిందా?  హే కాకిచంద్రప్రభో. ఇప్పటివరకూ నువ్వు ఓ మామూలు కాకి అనుకున్నాను. సాహిత్యంలో పాపినేని ‘చివరి పిచ్చుక’ కథ రాశారట. నేను ‘మొదటి కాకి’ అనే కావ్యం రాసి తొలికాకి కావ్య రచయితగా ప్రఖ్యాతి పొందుతాను. హే కాకిచంద్రప్రభో! ఏదో గ్లామరుండబట్టి నెమలి జాతీయ పక్షి అయ్యిందిగానీ... అసలు మీ కాకులు కదా ఆ జాతీయ పక్షి హోదాకు అర్హులు. రోగం కలిగినవాడు రోగిష్టి, కోపం ఉన్నవాడు కోపిష్టి, పాపిని ఇష్టపడేవాడు పాపిష్టివాడైనట్లుగా... ఇకపై నేను మీ కాకిజాతిని ఇష్టపడుతూ ‘కాకిష్టి’వాడిగా ప్రఖ్యాతి పొందుతాను. కాకీశ్వరోపాసన చేసి, కాకలు దీరిన ఈ కాకమ్మ కథకు ఇప్పుడే శ్రీకారం చుడతానంటూ కన్నీళ్లు కార్చుతూ కాకిప్రబంధ కావ్యరచనకు ఉపక్రమించాను.

 - యాసీన్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top