ఈ దశలో ఆగిపోతుందా? | Venati Shobha Health Suggestions In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఈ దశలో ఆగిపోతుందా?

May 10 2020 8:23 AM | Updated on May 10 2020 8:23 AM

Venati Shobha Health Suggestions In Sakshi Funday

నాలో మెనోపాజ్‌ లక్షణాలు కొద్దికొద్దిగా కనిపిస్తున్నాయి. మెనోపాజ్‌ దశలో హార్మోన్ల విడుదల ఆగిపోతుందని, ఇనుము శాతం తగ్గిపోతుందని, పోషకాల అవసరం పెరుగుతుందని విన్నాను. ఈ లోటు భర్తీ చేసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ పదార్థాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది? ఇది ఎంత పరిమాణంలో  తీసుకోవాల్సి ఉంటుంది? ఏ దశలో చర్మం సూర్యరశ్మిని విటమిన్‌ ‘డి’గా మార్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది? దీనికి కారణం ఏమిటి? – బీఆర్, విజయనగరం

మెనోపాజ్‌ దశలో అండాశయాల పరిమాణం తగ్గిపోయి, వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల శరీరంలోకి క్యాల్షియం, ఇతర విటమిన్స్‌ సరిగా చేరవు. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం వల్ల ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం (హాట్‌ ఫ్లషెస్‌), క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ఒంటినొప్పులు, కాళ్లు, నడుంనొప్పులు, మూత్ర సమస్యలు, మానసిక సమస్యలతో కూడిన మెనోపాజ్‌ లక్షణాలు మెల్లగా ఒకటొకటిగా మొదలవుతాయి. ఆహారంలో తాజా ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్‌ వంటివి పెరుగుతాయి.

క్యాల్షియం లోపం బాగా ఉన్నప్పుడు ఆహారంతో పాటు క్యాల్షియం, విటమిన్‌–డి కలిగిన మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. మాంసాహారులైతే గుడ్లు, చేపలు, చికెన్, మటన్‌ వంటివి వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. వీటిలో క్యాల్షియం, విటమిన్‌–డి, ఐరన్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చర్మం సూర్యరశ్మిని విటమిన్‌–డిగా ఏ వయసులోనైనా మార్చుకోగలుగుతుంది. కాకపోతే చర్మం మరీ మందంగా ఉన్నా, బాగా నల్లగా ఉన్నా సన్‌స్క్రీన్‌ లోషన్‌లు రాసుకోవడం వల్ల చర్మం సూర్యరశ్మిని విటమిన్‌–డిగా సరిగా మార్చుకోలేదు.

ఇటీవల ఒక పత్రికలో ‘లెంగ్త్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ’ అనే వాక్యాన్ని  చదివాను. ఇది ఆసక్తికరంగా అనిపించింది. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. naegele's rule అంటే ఏమిటి?
– కె.జయశ్రీ, సిద్దంపల్లె, చిత్తూరు జిల్లా

గర్భవతులలో ఆఖరు పీరియడ్‌ అయిన మొదటి రోజు నుంచి లెక్కబెడితే, తొమ్మిది నెలలు పూర్తయిన వారం రోజుల వరకు పూర్తిగా 280 రోజులు, అంటే 40 వారాల కాలాన్ని ‘లెంగ్త్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ’ అంటారు. చివరి పీరియడ్‌ మొదలైన మొదటి రోజును ‘లాస్ట్‌ మెన్‌స్ట్రువల్‌ పీరియడ్‌’ (ఎల్‌ఎంపీ) అంటారు. దీని నుంచి తొమ్మిది నెలల వారం రోజులు లెక్కకడితే, 280 రోజులు/40 వారాలు పూర్తయ్యే సమయాన్ని ఎక్స్‌పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ (ఈడీడీ) అంటారు. దాదాపు 80 శాతం మంది ఈడీడీ కంటే 10–15 రోజుల ముందే కాన్పు అవుతారు. కేవలం 5 శాతం మంది మాత్రమే ఈడీడీ రోజున కాన్పు అవుతారు. ఇక 10–15 శాతం మందికి ఈడీడీ దాటినా నొప్పులు రావు.

ఈ పరిస్థితినే ‘పోస్ట్‌ డేటెడ్‌ ప్రెగ్నెన్సీ’ అంటారు. naegele's rule  అంటే ఎల్‌ఎంపీ డేట్‌ నుంచి ఎక్స్‌పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ వరకు డెలివరీ ఎప్పుడు కావచ్చని లెక్కకట్టే పద్ధతి. ఇందులో చివరి పీరియడ్‌ మొదటి రోజు తారీఖుకు ఏడు రోజులు కూడటం, చివరి పీరియడ్‌ నెల నుంచి మూడు నెలలను తీసివేస్తే ఎక్స్‌పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ తారీఖు, నెల వస్తాయి. ఉదాహరణకు ఎల్‌ఎంపీ డేట్‌: 20.1.2020 అయితే, 20కి ఏడు రోజులు కూడటం, జనవరి నెల నుంచి మూడు నెలలు తీసివేయడం చేస్తే, ఈడీడీ 20.10.2020 వస్తుంది. ఇలా లెక్కకట్టే పద్ధతినే naegele's rule అంటారు.

నార్మల్‌ డెలివరీ తర్వాత వచ్చే సమస్యల్లో ఇన్‌ఫెక్షన్‌ ఒకటని విన్నాను. ఇది ఎందుకు వస్తుంది? నివారణ ఏమిటి? అనేది వివరంగా తెలియజేయగలరు. ప్రసూతి సమయంలో గర్భాశయం దెబ్బతినడానికి కారణం ఏమిటి? ‘హేమరేజ్‌’ అంటే ఏమిటి?
– కె.రాగసుధ, మచిలీపట్నం

నార్మల్‌ డెలివరీ సమయంలో నొప్పుల వల్ల గర్భాశయ ముఖద్వారం తెరుచుకుని, బిడ్డ యోని ద్వారా బయటకు వస్తుంది. ఈ ప్రయత్నంలో యోని నుంచి తెరుచుకుని ఉన్న సెర్విక్స్‌ ద్వారా బ్యాక్టీరియా క్రిములు గర్భాశయం లోపలికి, తద్వారా పొత్తికడుపులోకి చేరి ఇన్ఫెక్షన్లు కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, రక్తహీనత ఉన్నా, కాన్పు జరిగే ప్రదేశం శుభ్రంగా లేకపోయినా, ఆ సమయంలో వాడే వస్తువులు శుభ్రంగా లేకపోయినా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాన్పు ముందు నుంచే మరీ ఎక్కువగా బరువు పెరగకుండా సరైన పోషకాహారం తీసుకోవడం, రక్తహీనత లేకుండా ఐరన్‌ మాత్రలు తీసుకోవడం, యోనిలో ఇన్ఫెక్షన్‌ ఉంటే ముందే చికిత్స తీసుకోవడం, జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవడం, కాన్పు జరిగే ప్రదేశం, వాడే వస్తువులు శుభ్రంగా ఉండటం, కాన్పు తర్వాత యాంటీబయోటిక్స్‌ కోర్సును సక్రమంగా వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్‌ డెలివరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లను చాలావరకు రాకుండా చూసుకోవచ్చు. కాన్పు సమయంలో వచ్చే నొప్పుల తీవ్రత వల్ల కొందరిలో బిడ్డ పెద్దగా ఉండి గర్భాశయం నుంచి బయటకు వచ్చే సమయంలో గర్భాశయ ముఖద్వారం మీద ఒత్తిడి పడటం వల్ల అది చీలడం వంటి సమస్యల వల్ల గర్భాశయం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో గర్భాశయం నుంచి బ్లీడింగ్‌ అధికంగా అవుతుంది. దీనినే పోస్ట్‌పార్టమ్‌ హెమరేజ్‌ అంటారు.

డా. వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement