ఆ సమయంలో .. ఇది ప్రమాదమా? | Sakshi
Sakshi News home page

ఇది ప్రమాదమా?

Published Sun, Dec 15 2019 8:46 AM

Venati Shobha Health and Pregnancy Tips In Sakshi Funday

నేను ప్రెగ్నెంట్‌. అయితే ఈమధ్య కాలంలో విపరీతంగా ఆకలి వేస్తుంది. పరిమితికి మించి తింటున్నాను. మావారు ‘ఈటింగ్‌ డిజార్డర్‌ కావచ్చు’ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల microcephaly లాంటి సమస్యలు ఎదురు కావచ్చు అని విన్న తరువాత ఆందోళనగా ఉంది. ‘ఈటింగ్‌ డిజార్డర్‌’ అనేది వాస్తవమా? కాదా? అనేది నిర్ధారించుకోవడం ఎలా?   – కె.సునీత, బాన్సువాడ

ప్రెగ్నెన్సీలో అనేక కారణాల వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడాన్ని ఈటింగ్‌ డిజార్డర్‌ అంటారు. కొందరిలో అనారోగ్యకరమైన ఆహారం అతిగా తినడం కూడా ఉంటుంది. కొందరిలో ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే మార్పులకు భయపడటం, బరువు పెరగకుండా, బాడీ షేప్‌ పాడవకుండా ఉండాలని ఆహారం సరిగా తీసుకోకపోవడం, కొన్ని పూటలు ఆహారం అసలే తీసుకోక పోవడం, ఆహారం తీసుకున్నా బరువు తగ్గాలనే ఉద్దేశంతో తీసుకున్న ఆహారాన్ని బలవంతంగా కావాలని వాంతులు చేసుకోవడం, లూజ్‌ మోషన్స్‌ అవడానికి మందులు వాడటం, అతిగా వ్యాయామం చేయడం, అతిగా స్వీట్లు, కొవ్వు పదార్థాలు తినడం, డిప్రెషన్‌లో ఉండటం, అందరితో కలవకపోవడం వంటి అనేక లక్షణాలు ఉంటాయి.

గర్భిణిలలో ఈ సమస్య ఉన్నప్పుడు అవసరమైన పోషక పదార్థాలు శరీరంలోకి చేరకపోవడం వల్ల కొందరిలో అబార్షన్లు, నెలలు నిండకుండానే కాన్పులు, బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, అవయవ లోపాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇందులో భాగంగానే బిడ్డ తల పరిమాణం సరిగా పెరగకుండా చిన్నగా ఉండి, తల లోపల మెదడు పెరుగుదల సరిగా ఉండదు. దీనినే ‘మైకోకెఫలీ’ అంటారు. ఇందులో ఇతర అవయవాలతో పోలిస్తే తల పరిమాణం ఉండాల్సిన దాని కంటే చిన్నగా ఉండి, బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. ప్రెగ్నెన్సీలో మరీ అతిగా తిని బరువు ఎక్కువగా పెరిగినా తల్లిలో బీపీ, సుగర్‌ వంటి సమస్యలు ఏర్పడి కాన్పులో సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, నెలనెలా ఎంత బరువు పెరుగుతున్నారో ట్రాక్‌ చేసుకోవాలి. వారి సలహా మేరకు మార్పులు చేసుకోవడం మంచిది.

మా అమ్మాయి వయసు పదహారు సంవత్సరాలు. రుతుక్రమం సక్రమంగా లేకపోతే డాక్టర్‌ని సంప్రదించాం. ‘ప్రైమరీ అమినోరియా’ అని చెప్పారు. టర్నర్స్‌ సిండ్రోమ్, కుషింగ్‌ సిండ్రోమ్‌ వల్ల ఇలా జరుగుతుందన్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.
– బి.కృష్ణవేణి, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా

అసలు అమ్మాయి పదహారు సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోవడాన్ని ‘ప్రైమరీ అమినోరియా’ అంటారు. మీరు చెప్పినట్లు రుతుక్రమం సక్రమంగా లేకపోతే దానిని ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌ అంటారు. మీ అమ్మాయికి ఒకసారైనా పీరియడ్స్‌ వచ్చాయా, లేదా, వస్తే ఎన్నిసార్లు వచ్చాయి అనే దాన్ని బట్టి అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అనేక హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, అండాశయంలో సిస్ట్‌లు, నీటిబుడగలు, కణితులు వంటి అనేక కారణాల వల్ల రుతుక్రమం సరిగా రాకపోవచ్చు. కొందరిలో పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, మెటబాలిక్‌ ఎంజైమ్స్‌లో లోపాల వల్ల కూడా కొందరు రజస్వల కాకుండా ఉంటారు. దానినే ‘ప్రైమరీ అమినోరియా’ అంటారు. ఆడవారిలో పుట్టుకతోనే 23 జతల ఎక్స్‌ఎక్స్‌ క్రోమోజోమ్‌లు అంటే మొత్తం 46 ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిలో ఒక జత ఎక్స్‌ఎక్స్‌ సెక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి.

కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల పుట్టుకతోనే ఒకటే క్రోమోజోమ్‌ సంక్రమిస్తుంది. దీనివల్ల వీరిలో 45ఎక్స్‌ జీరో క్రోమోజోమ్‌లు ఉంటాయి. దీనినే టర్నర్స్‌ సిండ్రోమ్‌ అంటారు. వీరిలో అనేక అవయవ లోపాలతో పాటు అండాశయాలు సరిగా తయారు కాకపోవడం, దీనివల్ల రజస్వల కాకపోవడం, అయినా ఆలస్యంగా అవడం, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, పీరియడ్స్‌ తొందరగా– అంటే 35–40 ఏళ్ల వయసులోనే ఆగిపోవడం (తొందరగా మెనోపాజ్‌ దశకు చేరడం) వంటి సమస్యలు ఉండవచ్చు. దీనికి చికిత్స అంటూ ఏమీ లేదు. కుషింగ్స్‌ సిండ్రోమ్‌ అంటే శరీరంలో అనేక కారణాల వల్ల కార్టిసోల్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా స్రవించడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల అనేక మానసిక, శారీరక సమస్యలతో పాటు రుతుక్రమంలో సమస్యలు ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రావు. ఈ సమస్యకు కారణాలను విశ్లేషించుకుని, డాక్టర్‌ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటే పీరియడ్స్‌ సక్రమంగా వస్తాయి.
- డా. వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement