మానవసేవ...మనశ్శాంతి

Special Story written By DK Chaduvula Babu On 17/11/2019 - Sakshi

డి.కె.చదువులబాబు

యజుర్వేద మహర్షికి గోపాలుడు, దమనుడు శిష్యులు. ఆయన చదువు సంధ్యలతో పాటు వారి కోరిక మేరకు గోపాలుడికి వైద్య విద్యను, దమనుడికి విలువిద్యను నేర్పాడు. వైద్యం ద్వారా మానవసేవ చేయాలని గోపాలుడి ఆశయం. విలువిద్య ద్వారా రాజు వద్ద సైన్యంలో ఉన్నత పదవి పొందాలని దమనుడి కోరిక. వారిద్దరినీ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాక యజుర్వేద మహర్షి వారికి చెరో కమండలాన్నీ ఇచ్చాడు. ‘‘నాయనా! ఈ కమండలాల్లో నా తపశ్శక్తితో కూడిన మంత్రజలం ఉంది. మంత్రజలాన్ని తలపై చల్లుకుని ఏదైనా కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది. అలా మూడు కోరికల వరకు మాత్రమే ఈ జలం పనిచేస్తుంది. దీనిని పరోపకారానికి వినియోగించండి’’ అని చెప్పి శిష్యులను సాగనంపాడు.

దమనుడు ఇంటికి చేరుకుని, మంత్రజలాన్ని తలపై చల్లుకున్నాడు. తన ఇల్లు భవంతిలా మారిపోవాలని కోరుకున్నాడు. మరికొంత జలాన్ని చల్లుకుని ఇంటినిండా వజ్రవైఢూర్యాది ఆభరణాలు నిండిపోవాలని కోరుకున్నాడు. ఇల్లు భవంతిలా మారింది. ఇంటి నిండా వజ్రవైఢూర్యాలు నిండిన ఆభరణాలు వచ్చి చేరాయి. మరికొంత నీటిని తలపై చల్లుకుని తనకు, తన తల్లిదండ్రులకు ఆకలి లేకుండా పోవాలని కోరుకున్నాడు. ఆకలి లేకుండా పోయింది. ఆకలి లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండవచ్చనుకున్నాడు. అది ఎంత తెలివితక్కువ కోరికో తర్వాత అర్థమైంది. ఆకలి లేకపోవడంతో ఏదీ తినాలనిపించక రకరకాల ఆహారపదార్థాల రుచికి దూరమయ్యాడు. ఆకలి వేసినప్పుడు ఆహారం తినడంలో ఉన్న సంతృప్తిని కోల్పోయాడు. ఏ పనీ చేయాలనిపించడం లేదు. ఎందుకు బతుకుతున్నాడో అర్థంకాని పరిస్థితి. దమనకుడి తల్లిదండ్రులదీ అదే పరిస్థితి. గోపాలుడు రాజధాని నగరంలో వెళ్తుంటే ఒక ఇంటి ముందు జనం గుంపుగా ఉన్నారు. జనం మధ్య నుంచి ఏడ్పులు వినిపిస్తున్నాయి.

అక్కడకు వెళ్ళి చూస్తే ఓ వ్యక్తి పాము కాటుతో నురగలు కక్కుతున్నాడు. వెంటనే గోపాలుడు తన భుజానికున్న సంచిలోని ఓ భరిణ నుంచి మూలికారసం తీసి, నీటిలో కలిపి ఆ వ్యక్తితో తాగించాడు. పసరు మందు పాము కాటు వేసిన చోట రుద్దాడు. కాసేపటికి విషప్రభావం తగ్గి ఆ మనిషి లేచి కూర్చున్నాడు. జనం గోపాలుడి వైద్య ప్రతిభకు నమస్కరించారు. పాముకాటు బాధితుడి భార్యా, పిల్లలు, బంధువులు అతడికి కృతజ్ఞతతో పాదాభివందనం చేశారు. గోపాలుడు అక్కడ నుంచి బయలుదేరి ఇల్లు చేరుకున్నాడు. అమ్మా, నాన్నలకు తన సంగతులు చెప్పాడు. తర్వాత కమండలంలోని కొంత జలాన్ని తలపై పోసుకుని ఈ భూమిమీద ఎవ్వరిని ఏ పాము కాటు వేసినా విషం ఎక్కకూడదని, మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. రాజ్యంలో వర్షాలు లేక, పంటలు పండక, తిండిగింజలు కరువై ప్రజలు అల్లాడుతున్నారని, మేతలేక పశువులు అల్లాడుతున్నాయని అమ్మానాన్నల ద్వారా తెలుసుకున్నాడు. కమండలంలోని మంత్రజలాన్ని కొంత తలపై పోసుకున్నాడు. భూమిమీద వర్షం సమృద్ధిగా కురవాలని, మంచి పంటలు పండాలని రెండవ కోరిక కోరుకున్నాడు. తర్వాత మిగిలిన జలాన్ని తలపై పోసుకుని జబ్బులతో బాధపడుతున్న వారు తన వద్దకు ఎవ్వరు వచ్చినా, ఎటువంటి మొండి జబ్బయినా తన మందులతో నయం కావాలని మూడవ కోరిక కోరుకున్నాడు. గోపాలుడి పేరు చుట్టు పక్కల అనేక రాజ్యాలకు వ్యాపించింది. రోగుల తాకిడి పెరిగింది. గోపాలుడి ఇల్లు సరిపోవడం లేదు.

రాజుకు విషయం తెలిసి విశాలమైన స్థలంలో పెద్ద భవంతిని గోపాలుడికిచ్చాడు. అనేక రకాల ఔషధమొక్కలను పెంచడానికి విలువైన స్థలాన్నిచ్చాడు. రోగుల కోసం భవంతి చుట్టు పక్కల వసతులను ఏర్పాటు చేయించాడు. దమనుడు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి గోపాలుడిని కలిశాడు. తన వివరాలు, తాను కోరుకున్న కోరికల గురించి, తన పరిస్థితిని గురించి వివరించాడు. ‘‘అత్యాశతో, స్వార్థంతో తప్పు చేశాను. బుద్ధి వచ్చింది. ఆకలి లేని జీవితం వృథా అని అర్థమయింది. ఆకలి లేకుంటే బాగుంటుందను కుంటాం. ఆకలి లేకుంటే పర్యావసానాలు ఎలా వుంటాయో అనుభవంతోనే అర్థమవుతోంది. మాకు ఆకలిని ప్రసాదించు..’’ పశ్చాత్తాప పడుతూ అన్నాడు. గోపాలుడు దమనుడి భుజం తట్టి ‘‘ఏ పనినైనా చేసేముందు, నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. నేను పాము కాటు వేస్తే విషం పని చేయకూడదని, ఈ భూమిపై పాము కాటుతో ఎవ్వరూ మరణించకూడదని కోరుకున్నానే కానీ పాములకు విషముండకూడదని కానీ, పాములే వుండకూడదని కానీ కోరుకోలేదు.

ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జీవి జన్మకూ ఒక అర్థముంటుంది. పాముల వల్ల కూడా ఉపయోగాలున్నాయి. పాములు పొలాల్లో ఎలుకలను, పందికొక్కులను తినటం ద్వారా వాటి బారి నుంచి పంటలను కాపాడుతాయి. పాముల విషం కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నానే కానీ ఈ భూమ్మీద ఏ జీవికీ ఆకలుండరాదని కోరలేదు. ఆకలి లేకుంటే ఎవరూ ఏ పనీ చేయరు. మనిషికానీ, జంతువుకానీ ఎంత కష్టపడినా ఆకలేసినప్పుడు తినే ఆహారం ద్వారా పొందే తృప్తికి వెలకట్టలేము. నేను నిస్వార్థంగా లోకం కోసం వైద్యవృత్తిని జీవిత లక్ష్యంగా ఎన్నుకున్నాను. జబ్బులను నయం చేసి, రోగుల ముఖంలో సంతోషాన్ని చూడటం కంటే తృప్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. సాయం చేసి చూడు. ప్రపంచాన్ని జయించినంత తృప్తి, మనశ్శాంతి లభిస్తాయి’’ అన్నాడు గోపాలుడు. తన మూడవ కోరిక ప్రకారం ఎలాంటి జబ్బునైనా నయం చేయగల శక్తి వచ్చిందని చెప్పి, దమనుడికి, అతడి తల్లిదండ్రులకు వైద్యం చేసి ఆకలి లేని జబ్బును నయం చేశాడు. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఆశపడటం అనర్థమని, మానవసేవలోనే తృప్తి, మనశ్శాంతి లభిస్తాయని గ్రహించాడు దమనుడు. తన వద్దనున్న అపార ధనరాశులను పేదల కోసం ఉపయోగిస్తానని చెప్పి ఇంటిదారి పట్టాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top