రిమోట్‌ గేట్‌

special  story to  new story writers - Sakshi

 ∙కొత్త కథలోళ్లు

నా పేరు రమ్య. మేము మలేషియాలో ఉంటాం. నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం. సాక్షి ఫన్‌డే బుక్‌లో ఎప్పుడూ మిస్‌ కాకుండా కథలన్నీ చదువుతాను. మాకు హార్డ్‌ కాపీ దొరకదు కాబట్టి ఆన్‌లైన్‌లో చదువుతుంటాను. కానీ ఎప్పుడూ చదవడమేనా.. నేనే ఓ కథ రాసి మెయిల్‌ చేస్తే? ఆలోచన రాగానే రెండు మూడు కథలు రాశా. కానీ అవి నాకే అంతగా నచ్చలేదు. ఈసారి ఎలాగైనా ఓ మంచి కథ రాయాలని పుస్తకం తెరిచా.      పెన్నందుకొని పుస్తకంపై ఒక అక్షరం రాయగానే, గేట్‌ దగ్గర సౌండ్‌. విండోలోనుంచి చూశా. చిన్నూ ఫ్రెండ్‌ స్టెల్లా వెయిట్‌ చేస్తోంది గేట్‌ దగ్గర. మాది రిమోట్‌ గేట్‌. రిమోట్‌ ప్రెస్‌ చేయగానే ఓపెన్‌ అయింది అది. పాప లోపలకి వచ్చింది. చిన్నూ పరుగెత్తుకుంటూ వెళ్లి మెయిన్‌ డోర్‌ ఓపెన్‌ చేశాడు. నవ్వుకుంటూ లోపలకి వచ్చింది స్టెల్లా. తను అచ్చం బొమ్మæఉన్నట్లు ఉంటుంది. నాకు తన బుగ్గలంటే చాలా ఇష్టం. గిల్లుతానని త్వరగా నా దగ్గరకు రాదు. నేను కథ రాస్తుంటే అడిగింది.. ‘‘ఆంటీ ఏం చేస్తున్నారు?’’ అని. ‘‘కథ రాస్తున్నాను’’ అన్నా. 

‘‘ఓహ్‌! నేను హెల్ప్‌ చేయనా ఆంటీ?’’ అంది. నవ్వొచ్చింది. స్టెల్లాకు ఐదేళ్లు. ఇరవై తొమ్మిదేళ్ల నాకే ఏం రాయాలో తెలీట్లేదు. ‘‘సర్లే! మీరు ఆడుకోండి’’ అన్నా. కాసేపు ఆడుకొని స్టెల్లా వెళ్లిపోయింది. చిన్నూకి తొమ్మిది నెలలు ఉన్నప్పట్నుంచే స్టెల్లా ఫ్రెండ్‌. చిన్నూ వయసే. మా సొసైటీలో ఉన్న ప్లే ఏరియాలో పరిచయం. స్టెల్లా అమ్మా, నాన్నా ఇద్దరూ జాబ్‌ చేస్తారు. మా ఇల్లు దగ్గరే కావడంతో రోజూ సాయంత్రం వచ్చి చిన్నూతో ఆడుకుంటుంది. అప్పుడప్పుడు చిన్నూ కూడా వాళ్లింటికి వెళ్తుంటాడు. కథ రాయడం పక్కనబెట్టి, డిన్నర్‌ రెడీ చేసే పనిలో పడిపోయాను. తర్వాత రోజు మధ్యాహ్నం మళ్లీ బుక్‌ పట్టుకున్నా. ముందుకు కదల్లేదు. వేరే వాళ్లు రాసినవి చదివినపుడు కథ రాయడం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ.. మనమే పెన్‌ పట్టుకున్నాక కానీ తెలీదు.. అంత ఈజీ కాదని. ఏం రాయాలో అర్థం కాలేదు. స్నానానికి వెళ్లిపోయా అన్నీ పక్కనపెట్టేసి. వచ్చేసరికి లివింగ్‌ రూమ్‌లో మాటలు వినిపిస్తున్నాయి. ‘వంశీ ఏమైనా త్వరగా వచ్చాడా?’ అనుకున్నా, సెకండ్‌ కీ తనదగ్గరే ఉంటుంది కాబట్టి. డ్రెస్‌ చేసుకుని లివింగ్‌ రూమ్‌కి వచ్చి చూస్తే స్టెల్లా, చిన్నూ ఆడుకుంటున్నారు. కొద్దిసేపేమీ అర్థం కాలేదు పాప లోపలకి ఎలా వచ్చిందో!! గేట్‌ రిమోట్‌ బెడ్‌ రూమ్‌లో ఉంది. చిన్నూ ఓపెన్‌ చేయలేడు. ‘‘స్టెల్లా! గేట్‌ ఎలా ఓపెన్‌ అయింది?’’ అన్నా.‘‘నేను టెన్‌ మినిట్స్‌ వెయిట్‌ చేసాను ఆంటీ. గేట్‌ ఎవరూ ఓపెన్‌ చేయలేదు. అందుకే దూకేసి వచ్చా’’ అంది. ‘‘నో స్టెల్లా! ఎప్పుడూ అలా చేయకు. కింద పడితే దెబ్బలు తగులుతాయి. నేను ఓపెన్‌ చేసేవరకు వెయిట్‌ చేయాలి’’ అన్నా.
‘‘ఓకే ఆంటీ!’’ అంది. 

‘‘ప్రామిస్‌ చెయ్యి! ఇంకెప్పుడూ గేట్‌ దూకనని’’ అన్నా. ‘‘ప్రామిస్‌ ఆంటీ!’’ అంది తల మీద చెయ్యి పెట్టుకుని. తనేం చేసినా చాలా క్యూట్‌గా ఉంటుంది. దగ్గరకెళ్లి బుగ్గలు గిల్లబోయాను. తప్పించుకుంది. ఇద్దరికీ స్నాక్స్‌ తెచ్చిచ్చాను. ‘‘నాకు వద్దు ఆంటీ! నైట్‌ ఫుడ్‌ తినడం లేదని మమ్మీ తిడుతుంది’’ అంది స్టెల్లా. సోఫాలో పడి ఉన్న బుక్‌ని చూసి ‘‘స్టోరీ ఫినిష్‌ అయిందా?’’ అనడిగింది.‘‘నో స్టెల్లా!’’ ‘‘నేను హెల్ప్‌ చేస్తానులే ఆంటీ!’’ అంది.‘‘ఓకే అలాగే చేద్దువులే’’ అన్నాను నవ్వుతూ. ఆరవ్వగానే వెళ్ళిపోయింది.తర్వాత రోజు చిన్నూ స్కూల్‌ నుండి రాగానే ‘‘మమ్మీ! నా క్లాస్‌లో జాన్సన్‌ ఉన్నాడు కదా.. స్టెల్లా కజిన్‌.. తను చెప్తున్నాడు.. స్టెల్లా వాళ్ళు ముదీలో ఉన్నారని. మన ఇంటికి వచ్చి ఆడుకుంది అంటే నమ్మడం లేదు వాడు..’’ అని చెప్తూ పోతున్నాడు. స్టెల్లా అంతకుముందు వారం ఊరెళ్తా అని చెప్పింది. నాకే సరిగ్గా గుర్తులేదు.‘‘స్టెల్లా, నువ్వూ ఒకే బస్‌లో వస్తారు కదా? కనిపించలేదా?’’ అనడిగా.‘‘లేదు మమ్మీ!’’ అన్నాడు.    ‘‘సరేలే!’’ అని చెప్పి చిన్నూకి స్నాక్స్‌ ప్రిపేర్‌ చేసిచ్చా. తినేసి పడుకున్నాడు.ఇక ఈరోజు ఎలాగైనా కథ రాయాల్సిందేనని బుక్‌ అందుకున్నా. పెన్‌ అస్సలు కదలడం లేదు. అంతలో గేట్‌ దగ్గర సౌండ్‌.. ‘ఇంకెవరు? స్టెల్లానే అయి ఉంటుంది’ అనుకొని మెయిన్‌ డోర్‌ ఓపెన్‌ చేసి చూశా. తనే! ‘టైమ్‌  నాలుగయ్యేసరికి వచ్చేస్తుంది ఆడుకోడానికి.. స్కూల్‌ దొంగ’ అనుకుంటూ గేట్‌ ఓపెన్‌ చేశా. లోపలకి వచ్చింది. ‘‘చిన్ను ఎక్కడ ఆంటీ?’’ అంది. ‘‘నిద్ర పోయాడు. నువ్వు స్కూల్‌కి వెళ్లావా స్టెల్లా!?’’ అనడిగా.‘‘వెళ్ళాను అంటీ.. మమ్మీ డాడీ డ్రాప్‌ చేస్తున్నారు’’ అంది. ‘‘మరి ఆఫ్టర్నూన్‌ ఎలా వస్తున్నావ్‌?’’ ‘‘మమ్మీ వాళ్లే తీసుకొస్తున్నారు’’ అంది. ‘ఓహ్‌! అందుకేనా బస్‌లో కనిపించడం లేదు చిన్నూకి!’ అనుకున్నా.

‘‘ఏదో ఊరెళ్తానన్నావ్‌? వెళ్లారా?’’‘‘వెళ్లాం ఆంటీ! కానీ బోరింగ్‌ అక్కడ!!’’స్టెల్లాతో నేను మాట్లాడుతూంటే చిన్నూ నిద్రలేచాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఆటలో పడిపోయారు. స్టెల్లా ఆరింటివరకూ ఆడుకుని వెళ్ళిపోయింది. ఏడు గంటలకు వంశీ వచ్చాడు ఆఫీస్‌ నుండి. ఏదో కంగారుగా ఉన్నాడు. ‘‘రమ్యా నీకో విషయం తెలుసా! ఫైవ్‌ డేస్‌ బాక్‌ హైవే మీద ఒక ఆక్సిడెంట్‌ జరిగిందంట.. స్పాట్‌లోనే ఫ్యామిలీ అంతా చనిపోయారంట.. ఇదిగో న్యూస్‌ పేపర్‌ ఆఫీస్‌లో ఉంటే చూసి తెచ్చాను.. ఎవరో చూడు షాక్‌ అవుతావు’’ అని పేపర్‌ ఇచ్చాడు. ఆ పేపర్‌ చూడగానే ఒక్కసారే నాకు గుండె పనిచేయడం ఆగినట్లనిపించింది. వళ్లంతా చెమటలు పట్టేశాయి. ఆ పేపర్‌లో ఉన్నది స్టెల్లా అండ్‌ ఫ్యామిలీ. వెంటనే మొబైల్‌లో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఓపెన్‌ చేసి ‘ముది’ అనే చైనీస్‌ వర్డ్‌కి ఇంగ్లిష్‌ మీనింగ్‌ చూశా. ఇంగ్లీష్‌లో ‘గ్రేవ్‌యార్డ్‌’ అని వచ్చింది. అంటే స్టెల్లా కజిన్‌ చెప్పింది నిజమే! చిన్నుని బెడ్‌రూమ్‌లో ఆడుకోమని పంపించేశా. ‘‘కానీ స్టెల్లా రోజూ ఆడుకోడానికి వస్తోంది!’’అన్నా.వంశీ నా వైపు వింతగా చూసి పెద్దగా నవ్వాడు. ‘‘ఏంటి ఈ మధ్య నువ్‌ రాస్తున్న హారర్‌ కథలని నాకే వినిపిస్తున్నావా?’’ ‘‘ఓకే! నేను చెప్పేది నమ్మకుంటే రేపు ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. నాలుగింటికి  ఆ పాప వస్తుంది’’ చెప్పాను.‘‘లేదు. నాకు రేపు చాలా ఇంపార్టెంట్‌ మీటింగ్‌ ఉంది’’ అన్నాడు. తనకు చెప్పినా నమ్మడానికి రెడీగా లేడు అని అర్థం అయింది. ఆ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు.ఒక ఇరవై సార్లైనా ఆ న్యూస్‌ చదివి ఉంటా. చిన్ను స్కూల్‌ నుంచి రాగానే స్నాక్స్‌ తినిపించి పడుకోబెట్టేశా. టైమ్‌ నాలుగయింది. గేట్‌ దగ్గర ‘‘ఆంటీ! ఓపెన్‌ ద గేట్‌’’ అంటూ నిలబడ్డ స్టెల్లా కనిపించింది. చిన్ను పడుకున్న రూమ్‌ డోర్‌ లాక్‌ చేసి గేట్‌ వైపే చూస్తూ కూర్చున్నా. పది నిమిషాలు చూసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని నేను మళ్లీ వంశీతో డిస్కస్‌ చేయదలుచుకోలేదు. తను ఎలాగూ నమ్మడు. 

స్టెల్లా అంటే భయం కూడా పోయింది ఇప్పుడు. గేట్‌ దూకి తను లోపలికి రాలేదు. శని, ఆదివారాలు తప్పించి వరసగా పదిరోజులు నాలుగింటికి గేట్‌ దగ్గర ఎదురుచూసింది. నాకు గేట్‌ ఓపెన్‌ చేసే ఉద్దేశం లేదు. తనకు గేట్‌ క్రాస్‌ చేసి వచ్చే ఉద్దేశం అంతకంటే లేదు. ప్రామిస్‌ చేసింది కదా! మొదటిసారి దెయ్యాలు అంటే భయం బదులుగా గౌరవం వచ్చింది. దెయ్యానికి ఉన్న డిసిప్లిన్‌ మనుషులకు ఉండుంటే ఎన్నో ఇళ్ల డోర్లు బలవంతంగా తెరుచుకునేవి కాదు. ఎందరి ప్రాణాలో డబ్బు కోసం, నగల కోసం గాలిలో కలిసుండేవి కాదు. మేము అక్కడే ఉంటే తను మమ్మల్ని వదిలి వెళ్లలేదని అర్థం అయింది. పది రోజుల్లోనే వంశీని విసిగించి ఇల్లు మారిపోయాం. ఇదంతా జరిగిన కొన్ని రోజులకు ఐటీ ఎగ్జిబిషన్‌లో మేము ఖాళీ చేసిన ఇంటి ఓనర్‌ కనిపించాడు. ‘‘మీరు వెళ్లిపోయాక ఇల్లు రెంట్‌కి ఇవ్వకుండా మేమే ఉంటున్నాం మేడం! నా వైఫ్‌ రోజూ కంప్లైంట్‌ చేస్తోంది. సాయంత్రం నాలుగవ్వగానే గేట్‌ దగ్గర ఏవో సౌండ్స్‌ వినిపిస్తున్నాయని, ఏదో దెయ్యం అయి ఉంటుందని భయపడుతోంది. తన పిచ్చి కాకుంటే అది దెయ్యమే అయితే గేట్‌ ఓపెన్‌ చేసే వరకు వెయిట్‌ చేస్తుందా? ఎప్పుడో లోపలకి వచ్చేది కదా?’’ అని నవ్వాడు.అక్కడే ఇంక ఉండలేక ఇంటికి వచ్చేశా. చిన్ను లాస్ట్‌ ఇయర్‌ బర్త్‌డే ఆల్బమ్‌ ఓపెన్‌ చేసిన నాకు, తెలీకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయి.. చిన్ను పక్కనే నవ్వులు చిందిస్తూ నుంచుని ఉన్న స్టెల్లాని చూసి.వెంటనేæగట్టిగా డిసైడ్‌ అయ్యా.. ఇక మీద వంశీ ఆఫీస్‌ నుండి లేట్‌గా వచ్చినా గొడవ పడడం, అలగడం మానేయలని. మనుషుల్ని చూసి కాకున్నా, దెయ్యాలని చూసి అయినా కొన్ని నేర్చుకోవాలి కదా!!? ఒక ఫ్రెండ్‌ కోసం దెయ్యం అయి కూడా తను అంతగా వెయిట్‌ చేస్తుంటే, మనిషిగా ఉన్న నేను హజ్బెండ్‌ కోసం ఆ మాత్రం వెయిట్‌ చేయలేనా? మనుషులను చూసి నేర్చుకోవడం ఎప్పుడో మానేశా. చూసి నేర్చువాల్సినంత గొప్పవాళ్లు కనపyì  చాలా ఏళ్లే అవుతోంది. అసలు దెయ్యాలు, ఆత్మలు లాంటివి ఉంటాయంటేనే నమ్మని నాకు ఫస్ట్‌ టైమ్‌ వాటిని గౌరవించాలని, వాటిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చని అర్థమయింది.దేవుడి గదికి ఎప్పుడో ఒక్కసారి వెళ్లే నేను.. ఈరోజు ఆ దేవుడి ముందు కూర్చుని ఒక్కటే అడిగాను.. ‘ఆ పాప ఆత్మకు శాంతి కలిగించు’ అని. దెయ్యాలని చూసాక మరి దేవుడు కూడా ఉన్నాడని నమ్మాలికదా!?స్టెల్లా నాకు ఇచ్చిన మాట కూడా తప్పలేదు.    ‘‘కథ రాయడానికి హెల్ప్‌ చేస్తా!’’ అని అప్పుడు అంటే అర్థం కాలేదు.. తనే కథని. 
- రమ్యరెడ్డి (మలేషియా)  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top