తుంగభద్ర.. భయపెడుతున్న గేట్‌ నం. 19.. ఏ క్షణాన ఏమవునో? | Major Repair Effort at Tungabhadra Dam involved crest gate No. 19 | Sakshi
Sakshi News home page

తుంగభద్ర.. భయపెడుతున్న గేట్‌ నం. 19.. ఏ క్షణాన ఏమవునో?

Aug 16 2025 10:03 AM | Updated on Aug 16 2025 10:03 AM

Major Repair Effort at Tungabhadra Dam involved crest gate No. 19

బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల ఉమ్మడి నీటి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాంనకు మరో ముప్పు ముంచుకొచ్చింది. తుంగభద్ర ఆనకట్టలోని 19 నంబరు గేటుకు ఇటీవల మరమ్మతులు నిర్వహించారు. అయితే ఈ గేట్ గత ఏడాది ఆగస్టు 10 న కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుండి తాత్కాలిక స్టాప్-లాగ్ గేట్‌ను ఏర్పాటు చేసి, పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిది లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గడగ్ సమీపంలోని అడవి సోమాపుర వద్ద గల ఈ 19వ నంబరు గేటు స్థానంలో 49 టన్నుల కొత్త స్టీల్ గేట్‌ను తయారు చేసి, 2025 జూన్ 2025 చివరిలో ఆ ప్రదేశానికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుత వర్షాకాలంలో నీటి మట్టాలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ గేట్‌ను ఇన్‌స్టలేషన్  చేసే ప్రక్రియ ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా పడింది. ఇంతలో మరో ఆరు క్రెస్ట్ గేట్లు వాటి నిర్మాణ బలాన్ని 90 శాతం వరకు కోల్పోయాయి. ఈ 33 గేట్లలో 18 గేట్లను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అధికారులు వచ్చే ఏడాది జూన్ నాటికి అన్ని గేట్ల నిర్మాణ, మరమ్మతు పనులను  పూర్తి చేయాలని నిర్ణయించారు.

వరదనీటి కారణంగా డ్యాంకి అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్‌ గేట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ గేట్లు నాలుగు అడుగులు మేర తెరిచి ఉంచారు. డ్యాంకు వరద పెరుగుతున్నందున ఎక్కువ నీటిని వదిలేందుకు ఈ క్రస్ట్‌ గేట్లు మరింత ఎత్తు పెంచేందుకు వీలు కావడం లేదు. మరోవైపు ఈ గేట్లు వరద ఉధృతికి కిందిభాగంలో వంగిపోయాయి. దీనిపై డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చిందని కర్ణాటక మంత్రి శివరాజ్‌ తంగడిగి తెలిపారు.

ప్రభుత్వం కొత్త గేట్ల తయారీకి రూ. 60 కోట్లతో టెండర్‌ పిలిచింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని 80 టీఎంసీలకి మించి డ్యాంలో నీటిని నిల్వ ఉంచకూడదని అధికారులు నిర్ఘయించారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 135 టీఎంసీల నీరు కిందకు వదిలారు. అలాగే 24 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 23,295 క్యూసెక్కు లు వస్తోంది. ఔట్‌ ఫ్లో 23,193 క్యూసెక్కులుగా ఉంది. ఈ గేట్లు దెబ్బతినడంతో పరివాహక ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement