చట్టం దృష్టిలో ఇవి కూడా నేరాలే...

Some More Crimes Under The Law In Funday - Sakshi

►ఇంట్లో అమ్మాయికి, అబ్బాయికి మధ్య తిండి నుంచి చదువు వరకు, పని నుంచి పెంపకం వరకు వివక్ష చూపించడం, అబ్బాయిని అందలం ఎక్కిస్తూ అమ్మాయిని తక్కువ చేయడం నేరం. అలాగే నెలసరి పేరుతో అమ్మాయిలను ఇంట్లోకి రానివ్వకుండా, వారిని దూరంగా ఉంచడం వంటివి కూడా నేరాలే.
►తాత, తండ్రి, అతని తోబుట్టువులు, సోదరులు, మేనమామ, మామగారు వంటి పురుష కుటుంబ సభ్యులు కుటుంబంలోని అమ్మాయిలను పరుషంగా తిట్టడం, వారి వ్యక్తగత స్వేచ్ఛను హరించేలా తీవ్ర నిఘా పెట్టడం, శీలరక్షణ పేరిట వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించడం, మాట్లాడటం, తాకరాని చోట తాకడం, అసహజంగా ప్రవర్తించడం వంటివన్నీ గృహహింస చట్టం ప్రకారం నేరాల కిందకే వస్తాయి.
►భర్త చనిపోయిన స్త్రీని నేటికీ అశుభసూచకంగా చూస్తున్న దురాచారం ఉంది. ఆమెను అలంకారానికి దూరం చేయడం దగ్గర్నుంచి శుభకార్యాలకు హాజారు కానివ్వకపోవడం, ఎదురుపడితే అరిష్టంగా భావించడం, ఒంటిపూట మాత్రమే తినాలంటే నియమం పెట్టడం, చివరగా ఆమెను ఇంట్లో జీతంలేని పనిమనిషిగా ఖాయం చేయడం వంటివీ నేరాలే. 
►నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంచకపోవడం కూడా నేరమే. 
►భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఇటుకల బట్టీలు, బీడీ కంపెనీలు, పొలాలు వంటి చోట్ల మహిళా కార్మికులు, మహిళా శ్రామికులను శారీరకంగా, మానసికంగా వేధించడం (కులం, రంగు, రూపు గురించి తూలనాడటం, చేయిచేసుకోవడం, కోరిక తీర్చమని ఇబ్బంది పెట్టడం మొదలైనవి) నేరమే! 
►పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆడవాళ్లకు టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేయకపోవడం,, ఏర్పాటు చేసినా, వాటిలో సరైన వసతులను అంటే తలుపులు లేకపోవడం, బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం, టాయ్‌లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకెట్లు లేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం చివరకు పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌కి కాపలాదారు లేకపోవడం కూడా నేరమే. 
►అంతేకాదు పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌తో పాటు ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లోని గోడల మీద స్త్రీలకు సంబంధించి అసభ్యకరమైన రాతలు రాయడం, అశ్లీలమైన బొమ్మలు వేయడం వంటివి కూడా నేరాలే. 
►షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్స్‌రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో , సినిమాహాల్స్‌ వంటి పబ్లిక్‌ ప్రదేశాల్లోని లేడీస్‌ టాయ్‌లెట్స్‌ల్లో రహస్య కెమెరాలు ఉంచడం నేరం. దీన్ని సైబర్‌ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు.
►బస్సులు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మహిళలను తాకడం, అసభ్యకరంగా మాట్లాడ్డం, పిచ్చి సైగలు చేయడం, పురుషులు తమ ప్రైవేట్‌పార్ట్స్‌ చూపించడం వంటి చర్యలు కూడా నేరాలే.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top