ఇవ్వాళ శుక్రవారం!

seen is ours tittle is  yours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

అజయ్‌ మొహంలో ఎక్కడా భయం కనబడటం లేదు. ప్రశాంతంగా కూర్చొని సిగరెట్‌ కాలుస్తున్నాడు. చుట్టూ అతని ఫ్రెండ్స్‌. కొద్దిసేపంతా నిశ్శబ్దం. ‘‘అమ్మో అరేయ్‌! ఆ ఓబులురెడ్డి మామూలు మనిషి కాదు’’ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లోని ఒకతనన్నాడు. ‘‘ఓబుల్‌రెడ్డి అంటే.. కొంపదీసి శివారెడ్డి తమ్ముడు కాదు కదా!’’ ఇంకొకతను.‘‘శివారెడ్డా? ఆడెవడు?’’ అజయ్‌ మాటల్లో ఒక నిర్లక్ష్యం కనిపిస్తోంది.‘‘మీ నాన్నకు మొగుడు. హోమ్‌ మినిష్టర్‌. ఈ స్టేట్‌ మొత్తం ఆడి గుప్పిట్లో ఉంది. వాళ్ల నుండి తప్పించుకోవడం ఇంపాజిబుల్‌ రా..’’ ఫ్రెండ్‌ భయపెడుతూ చెప్పాడు. ‘‘సర్లే! నువ్వెలాగూ ఆ అమ్మాయిని పంపించేశావు కదా.. కొన్నాళ్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది..’’ కొనసాగించాడు ఆ ఫ్రెండ్‌. అజయ్‌ ఆలోచనల్లో పడ్డాడు. చాలాసేపటికి నోరువిప్పాడు – ‘‘ఏంటి పంపించేది? పాస్‌పోర్ట్, వీసా దొరకాలి కదా..’’ ‘‘అంటే.. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే..’’ ఫ్రెండ్‌ భయపడుతూ కూర్చున్నచోటునే నిలబడి అజయ్‌ని చూస్తూ, సగం మాటే పలికాడు.‘‘మా ఇంట్లోనే.. నా రూమ్‌ వార్డ్‌రోబ్‌లో ఉంది.’’ అన్నాడు అజయ్‌.  ఫ్రెండ్స్‌ షాక్‌తో అజయ్‌ను చూస్తూండిపోయారు.

పోలీసులు అప్పటికే అమ్మాయిని వెతికే పనిలో పడిపోయారు. హోమ్‌ మినిష్టర్‌ తమ్ముడు ఓబుల్‌రెడ్డి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసేవరకూ స్నానం కూడా చేయనని బురద అంటిన బట్టలనే కట్టుకొని ఉన్నాడు. ఓబుల్‌రెడ్డికి ఆ అమ్మాయంటే పిచ్చి ప్రేమ. అతనొక పేరుమోసిన ఫ్యాక్షనిస్ట్‌. ఆ అమ్మాయి కోసమే రెండు హత్యలు చేసినవాడు.  అలాంటి ఓబుల్‌రెడ్డిని పట్టపగలు నడిరోడ్డు మీద, అదీ కొండారెడ్డి బురుజు దగ్గర ఒక్కదెబ్బతో నేలకొరిగేలా చేశాడు అజయ్‌. అజయ్‌ వెనకాలే వెళ్లి నిల్చుంది ఆ అమ్మాయి. పేరు స్వప్న. ఓబుల్‌రెడ్డి ఆమెకు వరుస అవుతాడు. మనసు పడ్డాడు. కానీ ఆమెకు అతనంటే ఇష్టం లేదు. పారిపోవాలి. అమెరికాలో ఉన్న చుట్టాల దగ్గరకు పారిపోవాలి. ఈ ఊరు, ఓబుల్‌రెడ్డి.. అన్నీ దాటుకొని పారిపోవాలి. అజయ్‌ వెనకాలే నిల్చున్న ఆమెకు అతనొక్కడే ఇప్పుడు ధైర్యం. ఆ ఒక్కడే ఆమెను ఊరు దాటించాలి. 

అజయ్‌ ఇల్లు. వార్డ్‌రోబ్‌లో స్వప్న లేదు. అజయ్‌కి భయం పెరిగిపోయింది. పోలీసులకు విషయం తెలిసి ఆమెను తీసుకెళ్లిపోయారా? రూమంతా వెతికాడు. ఇల్లంతా వెతికాడు. పక్కన సందులో, ఇంటి వెనుక.. అంతటా వెతికాడు. స్వప్న చివరికి కనిపించింది.. అజయ్‌ రూమ్‌లోనే, చిన్న చిన్న బొమ్మల మధ్య బొమ్మలాగా. ఊపిరి పీల్చుకున్నాడు. స్వప్నకి అజయ్‌ ఇప్పుడొక నమ్మకం. ఆమెను దేశం దాటించగల ఒక్కడు అజయే! అజయ్‌ స్వప్నకు పాస్‌పోర్ట్‌ సంపాదించేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. అదేమీ చిన్న విషయం కాదు. అదీ స్వప్నను బయటకు తీసుకెళ్లలేని ఈ పరిస్థితుల్లో!  స్వప్నకి ఇల్లు గుర్తొచ్చింది. చుట్టూ అజయ్, అతని ఫ్రెండ్స్, అతని చెల్లి ఉన్నా కూడా స్వప్న ఒంటరిగా ఫీలయింది. ఏడ్వడం మొదలుపెట్టింది.  అజయ్‌ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చొని, ‘‘ఇవ్వాళ ఏం వారం?’’ అనడిగాడు. మళ్లీ వెంటనే, చిన్నగా నవ్వి, ‘‘వారాలు, తేదీలు నీకేం గుర్తుంటాయ్‌! ఇవ్వాళ శుక్రవారం. ఫ్రైడే. సో, ఇవ్వాళ నువ్వు ఏడ్వకూడదు. కావాలంటే రేపు ఏడువు. నిన్న కూడా ఏడ్చినట్టున్నావ్‌..’’ అన్నాడు. స్వప్న చిన్నగా నవ్వింది. ఆరోజు నుంచీ ఆమెను కాపాడుకోవడంతో పాటు నవ్వించడమూ అజయ్‌తో పాటు అతని ఫ్రెండ్స్‌ అందరికీ ఒక పని. 

రోజులు గడుస్తున్నాయి. స్వప్న అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమెను పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదని ఓబుల్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాడు. స్వప్న ఎక్కడుందో వాళ్లకు తెలిసిపోయింది. కానీ అప్పటికే స్వప్నను మరో సేఫ్‌ ప్లేస్‌కి మార్చాడు అజయ్‌. ఇప్పుడు ఆ సేఫ్‌ ప్లేస్‌లోనుంచి స్వప్నను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాలి. ‘‘ఓ పక్క పోలీసులు.. మరోపక్క ఓబుల్‌రెడ్డి మనుషులు.. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కు కాదు, ముందసలు ఇక్కణ్నుంచి తీసుకెళ్లడమే కష్టం..’’ అజయ్‌ ఫ్రెండ్‌ గ్యాంగ్‌లోని ఒకతను మొత్తం సిట్యుయేషన్‌ చెప్పాడు. అజయ్‌ కాసేపు ఆలోచించి ఒక ప్లాన్‌ గీశాడు. ఫ్రెండ్స్‌కి ఆ ప్లాన్‌ చెప్తూ – ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి ఇక్కణ్నుంచి బయల్దేరాలి!’’ అన్నాడు. స్వప్నకు మాత్రం తన ప్రపంచం ఇదేనని తెలుస్తోంది. ఆమెకు అజయ్‌ని, ఈ ప్రపంచాన్నీ వదిలిపోవాలని లేదు.‘‘నే వెళ్లిపోతున్నా కదా! బాధగా లేదా?’’ అడిగింది స్వప్న, అజయ్‌ అన్ని ఏర్పాట్లూ చేస్తూండడం చూసి. ‘‘బాధేముంది?సంతోషించాల్సిన విషయమేగా!’’ ‘‘నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్‌ని విడిచిపెట్టాలంటే నావల్ల కావడం లేదు.’’  ‘‘అలా అయితే నాక్కూడా బాధగానే ఉంది. నువ్వెళ్లిపోతున్నావ్‌ కదా.. ఈ ఛేజ్‌లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఇవేవీ ఉండవు. అయినా ఇప్పుడింత టెన్షన్‌లో ఈ కబుర్లు అవసరమా?’’ అంటూ స్వప్న బ్యాగ్‌ సర్దినిల్చున్నాడు అజయ్‌.  అజయ్‌ ప్లాన్‌ను ఫ్రెండ్స్‌ సరిగ్గా అమలుపరిచారు.  స్వప్నను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చాడు అజయ్‌. ఇంకాసేపట్లో ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్‌ టేకాఫ్‌ అవుతుంది. స్వప్న తన అమ్మా, నాన్నలను కూడా కలిసేలా ప్లాన్‌ చేశాడు అజయ్‌. స్వప్నకు జాగ్రత్తలన్నీ చెప్పి, బై చెప్పేసి ఇంటికి బయలుదేరుతున్నాడు అజయ్‌. బండి స్టార్ట్‌ చేస్తున్నాడు. గట్టిగా కిక్‌ కొడుతూ బండి స్టార్ట్‌ చేస్తూ అన్నాడు – ‘‘స్వప్న.. రా కూర్చో!’’.     అజయ్‌ వెనక్కి తిరిగి స్వప్నను చూశాడు. దూరం నుంచి స్వప్న అజయ్‌నే చూస్తూంది. 
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top