నింబవృక్షం పాదుకా ప్రతిష్ఠావిశేషాలు | Sakshi
Sakshi News home page

నింబవృక్షం పాదుకా ప్రతిష్ఠావిశేషాలు

Published Sun, Mar 17 2019 12:41 AM

Sai patham  - Interchange 41 story - Sakshi

వట వృక్షానికి గొప్పదనం కృష్ణుడు దాన్ని ఆశ్రయించినందు వల్ల. బోధి వృక్షానికి గొప్పదనం బుద్ధుడు తపస్సుని దాన్ని ఆశ్రయించి చేసినందువల్ల. మద్ది (పాల) చెట్లకి గొప్పదనం రామచంద్రుడు ఆ జాతికి చెందిన 7 చెట్లని వధించి తన శక్తిని నిరూపించుకుని సుగ్రీవునితో సఖ్యాన్నిపొంది రావణవధకి అవకాశాన్ని ఏర్పరచుకున్నందువల్ల. శింశుపావృక్షానికి గొప్పదనం సీతమ్మ ఆ వృక్షాన్ని ఆశ్రయించి దాదాపు సంవత్సర కాలం ఉన్నందు వల్ల. నైమిశారణ్యానికున్న గొప్పదనం ఇలాంటి అనేక వృక్షాలతో కూడిన ఆ అరణ్యాన్ని ఆశ్రయించుకుని సూతమహర్షి ఉంటూ శౌనకుడూ మొదలైన మహర్షులకి అనేక పురాణేతిహాసాలని బోధించి నందువల్ల. పూవులు చిన్నవి అవుతూనూ, ఆకర్షణ ఏ మాత్రమూ లేకపోతూనూ, వాసన ఏ మాత్రమూ లేకుండానూ, కాండమంతా జిగురు కలిగిన కారణంగా ఏ ఒక్కరికీ ఆశ్రయాన్ని ఈయలేకపోతూనూ, తన ముళ్లు నేల మీద పడుతూ ఉండే కారణంగా ఎవరినీ తన దగ్గరికి రానీయకుండా చేసుకుంటూనూ, ఎలాగో వచ్చినా తన మీద నిరంతరం సంచరిస్తూ ఉండే నల్ల చీమల కారణంగా ఎవరికీ ఆశ్రయాన్నీయలేకపోతూనూ కనిపించే తుమ్మచెట్టుక్కూడా ఉన్న గొప్పదనం – ఎవరికీ ఇష్టం ఉండని భూత ప్రేత పిశాచ సంతతిని తన మీద ఉంచుకుంటూన్నందువల్ల. ఇలా ప్రతి వృక్షానికీ ఓ గొప్పదనం ఉంటూ ఉంటే అలా ఆ వృక్షాన్ని కేవలం ఆశ్రయించి ఉండటమే కాక, దాన్ని తీపిదనం కలదాన్నిగానూ, కోరికల్ని తీర్చే శక్తీ ఉన్నదిగానూ మార్చివేయడం ఎంత ఆశ్చర్యకరం! ఆనందదాయకం!!

సాయి ఆ చెట్టుకింద దక్షిణ భాగంలో కూచుండే వాడు. ఆ కారణంగా దక్షిణపు వైపు ఆకులన్నీ తీపిదనంతో ఉంటూ ఉండేవి. ప్రతి వస్తువుకీ సహజలక్షణమంటూ ఒకటుంటుంది. సముద్రానికి కెరటాలతో ఉండటం, నిప్పుకి మండేతనం ఉండటం, వర్షానికి తడిసేలా చేసే గుణం, చలికి వణుకు పుట్టించేతనం ఉండటం ఎలాగో అలా, వేపకి చేదుతనమనేది సహ+జం(తనతో పుట్టిన గుణం) దాన్ని సాయి తాను కూర్చున్న కారణంగా మార్చేసాడనే విషయం లోకానికర్థం కావాలనుకుంటూ ఉపాసనీ మహారాజ్‌ శ్లోకాన్ని ఇంతర్థం వచ్చేలా రాశాడు. కేవలం ఆ చెట్టుని మార్చేసాడనేది దాని భావం కాదు. లోకంలో ఎందరో వేపచెట్లలా ఏ విధమైన ప్రయోజనమూ లేనివాళ్లుగా జీవిస్తూ ఉంటే, ఆ అందరినీ తనని ఆశ్రయిస్తే చాలు ప్రయోజనం కలిగిన వాళ్లుగా చేశాడనేది మరో లో అర్థం. అంతేకాదు. ఎందరో ఎందరో నిరుత్సాహంతో అణగారిన ఆశలతో ప్రాణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వచ్చి సాయిని ఆశ్రయించుకున్నారు కూడా కదా! అలా మార్చేసిన లక్షణం కలవాడు సాయి –అనే అర్థం లోకానికి తెలియాలనే ఉపాసనీ మహారాజ్‌ శ్లోకాన్ని ఇలా రాశాడు. లోగడ మనం చదువుకున్న ఘట్టాల్లో అనేక విధాలుగా రక్షింపబడ్డవాళ్లూ, ఆత్మహత్యలని విరమించుకున్నవాళ్లూ, తమ ప్రవర్తనలోని దోషాలని గమనించుకున్నవాళ్లూ.. ఇలా ఎందరెందరు రాలేదు! అదుగో ఆ ఉదాహరణలన్నీ కళ్లకి కట్టినట్టుగా వివరించగల శ్లోకం ఇది! కాబట్టి పాదుకల్ని చూస్తూ చేతిలో స్పృశిస్తూ ఆ పాదుకల మీద అరచేతులతో బలంగా రుద్దేస్తూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ఇంక కొద్ది భక్తులైతే ముద్దులు పెట్టడం వంటి కొన్ని చేష్టల్ని కూడా చేస్తూ కనిపిస్తారు. అది సరికాదు. పాదుకల్ని స్పృశిస్తూ ఆ పాదుకలు తమ శిరసు మీద సాయినాథుడు ఉంచినట్లు భావిస్తూ పైన అనుకున్న శ్లోకాన్నే ధ్యానించుకుంటూ ఆ సాయినాథుని కారణంగా ఆ వేపచెట్టు ఎంత గొప్పది కాగలిగిందో ఆ చరిత్రని తెలుసుకుంటూ ఆ గొప్పదనమే తనకీ కలిగేలా చేయవలసిందని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అది మాత్రమే పాదుకాదర్శన కాలంలో చేయవలసిన పని.

ఇంతటి గొప్పదనం తమలో దాగి ఉన్న ఆ పాదుకల ప్రతిష్ఠ ఎలా అయిందో, పాదుకలకి మాత్రమే ఆ గొప్పదనం ఎందుకుంటుందో ఇక తెలుసుకుందాం!ఎన్నెన్నో దైవక్షేత్రాలున్నాయి లోకంలో. అయితే అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవంతి, ద్వారక అనే ఏడింటికే మోక్షాన్నిచ్చే క్షేత్రాలున్న పురాలుగా గుర్తింపు వచ్చింది. ధర్మస్వరూపుడనే పేరు (రామో విగ్రహవాన్‌ ధర్మః) ఆ రామచంద్రునికి మాత్రమే సొంతమయింది. ఎందరెందరో అవతారమూర్తులున్నారు భక్తి సామ్రాజ్యంలో. అయితే భగవానుడనే మాట (కృష్ణ స్తు భగవాన్‌ స్వచుమ్‌) కేవలం కృష్ణునికే వచ్చింది. అదే తీరుగా పర్వతాలెన్ని ఉన్నా హిమాలయానికీ, నదులెన్ని ఉన్నా గంగకీ.. ఇలా కొన్నింటికి మాత్రమే గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి కారణమేమిటని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన విశేషాలు గోచరిస్తాయి.లౌకికం – అలౌకికంఏ విధంగానూ లోలోతు పరీక్షలని చేయకుండా కేవలం భౌతిక దృష్టితో చూడటమనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికదర్శనం అంటారు. ఓ చెట్టుని చూస్తే అది ఎంత ఎత్తుంది? ఎంత లావైన కాండాన్ని కలిగి ఉంది? ఎన్నాళ్ల వయసుదానికి?... ఈ తీరు వివరాల సేకరణ లౌకికం. అదే మరి ఆ చెట్టు కింద ఏ యోగి కూర్చుంటూ ఉండేవాడు? పెద్ద గాలివాన వచ్చి అన్ని చెట్లు పడిపోయినా కూడా.. ఆ చెట్టే ఎందుకు పడిపోకుండా నిలవగలిగింది? చెట్టు మొదట్లో ఉన్న పాముపుట్టని ఎందరు దర్శించి పూజిస్తూ ఉండేవాళ్లు! ఆ తీరు అర్చనలు ఎన్నేళ్ల నుండి సాగుతూ వస్తున్నాయంటూ ఆలోచించడం, తెలుసుకోవడం ఏదైతే ఉందో అది అలౌకిక దర్శనం.

భారత దేశానికి అప్రాచ్యుడు (పశ్చిమ దేశాల వాడు) వచ్చాక మనందరికీ వాడు నేర్పింది కేవలం లౌకిక దర్శనాన్ని మాత్రమే. దాంతో అలౌకిక దర్శన దృష్టితో ఎవరు మాట్లాడినా దాన్నంతటనీ – ‘చాదస్తం, మూఢవిశ్వాసం, పిచ్చితనం’ – వంటి మాటలతో మనం కొట్టిపడేసే తీరు అలవాటైపోయింది మనకి. అయితే ఒక్కసారి తలని మరో వైపుకి తిప్పి దృష్టిని మరో తీరుకి మళ్లించి చూస్తే చాలు – అలౌకికదర్శనం మనకి అబ్బి తీరుతుంది. ఇదంతా ఎందుకంటే ఆ తీరు అలౌకిక దృష్టితో చూడలేని పక్షంలో ద్వారకామాయి అనేది ఒక మసీదులాగా, సాయి కేవలం ఒక మహమ్మదీయునిగా, షిర్డీ అనేది ఒక ప్రసిద్ధ ఆలయమున్న ప్రదేశంలాగా, ఆయన్ని సేవించినవారంతా కేవలం భక్తులనే జాతికి చెందిన మనుషులుగా మాత్రమే కనిపిస్తారు. అలా కాక అలౌకిక దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ పాదుకలూ – వాటి గొప్పదనమూ మనకి అర్థమవుతుంది. కానీ పక్షంలోనూ అప్రాచ్యదృష్టితోనూ చూస్తే పాదుకలు కేవలం ‘చెప్పులు’గానే కనిపిస్తాయి. కాబట్టి ఆ తీరు అలౌకిక దర్శనానికి కదులుదాం!

అక్కల్‌కోట నుండి షిర్డీకా?
అమృతాన్నైనా సరే చిల్లు ఉన్న పాత్రలో పోస్తే.. ఎలా చుక్క చుక్క చొప్పున తరిగిపోతూ కొంతసేపటికి మొత్తం శూన్యమైపోతుందో.. అలాగే తపశ్శక్తిని సాత్త్వికంగా గానీ, రాజసంగా గానీ సంపాదించినా మళ్లీ అసూయ, పగ, ద్వేషం అనే వీటిని ప్రదర్శిస్తే తపశ్శక్తి కాస్తా ఒకనాటికి క్షీణించిపోతుంది. మళ్లీ ఆ శక్తి రావాలంటే... పోయిందాన్ని పూరించాలంటే మళ్లీ తపస్సుని చేసి ఆ లోటుని పూరించాల్సిందే.ఇదంతా ఎందుకంటే, సాయిది ఏనాడూ పగ, ద్వేషం, అసూయ అనేవి ఏ కోశానా లేకుండా సాధించిన తపస్సుతో కూడిన శక్తి మాత్రమే అని చెప్పడం కోసమే.అక్కల్‌కోటలో మహారాజ్‌ గారు ఉన్నంతవరకూ ఆ తపశ్శక్తి అనేదాన్ని శూన్యం కాకుండానూ, లేదా తగ్గిపోతూ ఉండకుండానూ ఆయన తపస్సు చేసి నింపుతూ ఉండేవారు. వారి పిమ్మట ఆ శక్తిని నింపగల శక్తి, సమర్థత కలవారు దాదాపుగా లేకపోయారు. ఆ విషయాన్ని గమనించిన అక్కల్‌కోట(కర్‌) మహారాజ్‌ కృష్ణజీ అనే ఆయనకి న్రిత్యం అక్కల్‌కోటకి అతి భక్తి శ్రద్ధలతో నిర్వా్యజంగా (ఈ పని అయితే ఇక్కడికొస్తాననే తీరు బుద్ధితో కాకుండా) వచ్చి దర్శించే వ్యక్తి కలలో కనపడి – నువ్వు షిర్డీకి వెళ్లు! నేను అక్కడున్నాను’ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నంత పవిత్రతా తపశ్శక్తి స్థితీ ప్రస్తుతం షిర్డీలో కనిపిస్తున్నాయని పరోక్షంగా చెప్పడమనే దానర్థం. దాంతో కృష్ణజీ షిర్డీకే వచ్చాడు.

ఇంతకాలమూ తాను దర్శిస్తూ ఉన్న అక్కల్‌కోట శక్తి ఇక్కడ షిర్డీలో ఉన్నదీ లే నిదీ గమనిస్తూ.. ప్రతినిత్యం అంతటి శక్తి అనుభవాన్ని పొందుతూ.. ఆనందంగా జీవిస్తూ.. ఒకటి కాదు రెండు కాదు 6 నెలల పాటు షిర్డీలోనే ఉండిపోయాడు. అందుకే అక్కల్‌కోట నుండి తన రాకపోకలు షిర్డీకే సాగించదలిచాడు ఈ భక్తుడు.మొదట్లో అక్కల్‌కోట మహారాజ్‌లోనే స్థిరంగా ఉన్న ఆ తపశ్శక్తీ ఆకర్షణా క్రమంగా వారి పిమ్మట వారి చిత్రపటంలోకీ ఆ పిమ్మట అక్కడున్న మహారాజ్‌గారి పాదుకలలోకీ ప్రవేశించాయి. ఆ మీదట అక్కడి పాదుకలలోనికి ఆ శక్తిని ఆ స్థాయిలో పూరించగలవారు లేకపోయిన కారణంగా, ఆ స్థాయి శక్తి ఉన్న క్షేత్రంగా అక్కల్‌కోట మహారాజ్‌ గారే షిర్డీని నిర్ణయించిన కారణంగా మొత్తం తపశ్శక్తి అంతా షిర్డీకి చేరిపోయిందన్నమాట. ఇది అలౌకిక దృష్టితో ఆలోచించడమంటే.

పాదుకలు
ఈ స్థితిలో కృష్ణజీ ఆలోచించాడు ఈ షిర్డీ ఇంతటి పవిత్రత కలిగినది కాబట్టీ, ఆ విషయాన్ని అక్కల్‌కోట మహారాజ్‌ గారే నిర్ణయించి చెప్పారు కాబట్టీ, ఆ శక్తిని చిరకాలం స్థాపించి ఉంచడం కోసం– పాదుకలని అక్కడ అక్కల్‌కోటలో స్థాపించిన తీరుగా ప్రతిష్ఠించాలని. ఇదే విషయాన్ని తనతో పాటు సమానస్థాయి కల భక్తి విశ్వాసాలున్న మిత్రులతో సంప్రదించాడు. వాళ్లూ అంగీకరించారు మొదటి మాటతోనే– మొదటి మాటలోనే. ‘ఏకైకస్యాపి నిర్ణయాభ్యుపగమో దోషాయ భవతి’ అని సంస్కృతంలో ఓ మాట. ‘ఎంతగా తానాలోంచినా, ఎంతగా దాన్ని పరిశీలించి తప్పుకాదని అనుకున్నా కూడా, ఏ విషయాన్నీ ఒక్కనిగా ఉంటూ ఓ నిర్ణయాన్ని చేస్తే తప్పక అందులో దోషం ఉండి తీరుతుందని దాని భావం. ఆ కారణంగా కృష్ణజీతో పాటు మిగిలిన అందరూ కలిసి మంత్రోపాసన నిరంతరం చేస్తూ ఉండేవారూ – లౌకిక దృష్టి ఏ మాత్రమూ లేనివారూ అయిన ఉపాసనీ మహారాజ్‌ (పేరులోనే ఉంది ఆయన మంత్రోపాసనలో ఎంత ప్రసిద్ధిని పొందినవాడో) గారికి ఈ పాదుకా ప్రతిష్ఠ ప్రతి పాదనని తెలియజేస్తూ తమ బుద్ధికి తోచిన విధంగా పాదుకల నమూనాని వారి ముందుంచారు. అంతే! ఆ ఉపాసనీ మహారాజ్‌ గారు ఆ పాదుకల్లో ఉండబోయే తపశ్శక్తినీ, పాదుకలనీ, రాబోయే ఖ్యాతినీ మానసికంగా తమ బుద్ధితో గ్రహించి– వీటిని ప్రతిష్ఠించడం ఎంతో గొప్పవిషయం, అంతే కాక తగిన విధంగా గౌరవించడమే అని భావించి వెంటనే ఆ పాదుకల్లో శంఖం, చక్రం, గద, పద్మం అనే నాల్గింటినీ కూడా చేర్చారు.

శంఖమనేది ధ్వనిని పుట్టించేది కాబట్టి ధ్వనిని పుట్టించగల శక్తి ఆకాశానిది కాబట్టీ (శబ్ధగుణక మాకాశమ్‌) ఆకాశశక్తి ఈ పాదుకలలో ఉంచదలిచారన్నమాట. దాంతో ఆకాశంలో ఉండే సర్వగ్రహాలూ ఈ శంఖం గుర్తులో ఉన్నాయని పరోక్షంగా తెలియజేయడమన్నమాట. ఆ కారణంగానే పాదుకలని భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తే చాలు గ్రహబాధలు తొలుగుతాయి, తొలుగుతున్నాయి.ఇక చక్రమనేది కాల చక్రానికి (నడుస్తున్న కాలగతి జీవితం) సంకేతం. అందుకే ఈ చక్రం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే చాలు జీవితగమనంలో వచ్చే ఒడిదుడుకులు సర్దుకుంటాయి – సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి – లభిస్తున్నాయి.ఇక గద అనేది శత్రుసంహారానికి సంకేతం. ఈ చిహ్నం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే మనని శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉండే ఆ శత్రువులు దూరంగా వెళ్లిపోతారు.నిరంతరం మానసికక్షోభ తొలిగిపోతుంది. తొలిగిపోతుంది కూడా.ఆ మీదట పద్మమనేది ప్రశాంతతకీ బుద్ధి వికాసానికీ సంకేతం. గ్రహబాధలు శంఖం ద్వారా, శత్రుబాధలు గద ద్వారా తొలిగిపోయాక ఇక వ్యక్తికి ఉండేదీ కలిగేదీ మనశ్శాంతే కదా! ఆ మనశ్శాంతికి సంకేతం పద్మం. అలాగే ఇన్ని అనుభవాలు కలిగాక వ్యక్తి ఏవిధంగా జీవించాలో చెప్పగల బుద్ధి వికాసమనేది కూడా పద్మం ద్వారానే కలుగుతుందని చెప్పడం దీని లోభావం(అంతరార్థం).ఇంతటి అర్థవంతమైనవి పాదుకలనే దృష్టితో ఆలోచనతో ఉపాసనీ మహారాజ్‌ వారు పాదుకలకి ఈ చిహ్నాలని జతచేశారు. ఇంతటి తపశ్శక్తీ ఇన్ని తీరుల ఇబ్బందుల నివారణలూ కలిగేలా పాదుకలని ఏర్పాటు చేసినా కూడా ఆ ఉపాసనీ మహారాజ్‌ గారికి సంతృప్తి కలగలేదు. ఏదో ఓ లోటు అనిపించనే అనిపించింది. దాంతో సాయికి ఏ అమోఘమైన తపశ్శక్తి అనేది లభించడానికి వేపచెట్టు సాక్షిగా ఉందో, ఆ వేపచెట్టు ఏ ద్వారకామాయికి దక్షిణ ప్రదేశంలో ఉందో, అంతేకాక సాయి నిరంతరం (12 ఏండ్ల పాటు) తపస్సులో గడిపిన గురుస్థానం సమీపంలో ఉందో ఆ విశేషం లోకానికి భక్తజనానికి) తెలియాలనీ తెలియజేయాలనీ భావించిన ఉపాసనీ మహారాజ్‌ ఆ వేపచెట్టు శక్తినీ, దానికి సాయి కలిగించిన అసాధ్యశక్తినీ (తియ్యదనం కోరికలు తీర్చేతనం..) బహిరంగపరుస్తూ ఓ శ్లోకాన్ని చెక్కించి ఆ ఫలకాన్ని కూడా ఆ పాదుకలవద్దే ఉంచాలని నిర్ణయించారు. నిజానికి ఆ పాదుకలూ వాటిలో ఈ చిహ్నాలు, ఆ శ్లోకమూ గనుక ఉండని పక్షంలో ఇన్ని విశేషాలు లోకానికి తెలిసుండేవా? మహాత్ములది ఎప్పుడూ లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి– దాంతో పాటు ఆ అనుగ్రహం లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి – దాంతో పాటు ఆ అనుగ్రహం ఎలా లభిస్తుందో ఆ ఉపాయాన్ని అందరికీ వివరించి చెప్పాలనే దృష్టీను.

ఆ కారణంగా పాదుకలని ఇంతటి లోభావం కల దృష్టితో మనం దర్శించాలన్నమాట. చాలా మంది భక్తులు పాదుకల మీద అరచేతుల్ని పెట్టి అరగదీస్తూ, తలని వాటికి మోదుకుంటూ, ఇంకకొందరైతే చుంబిస్తూ... ఏమేమో చేసేస్తుంటారు. పాదుకా దర్శనం అనుగ్రహాన్ని పొందడమనేది పై తీరు భావనతో కళ్లతో దర్శిస్తే చాలు లభిస్తుంది నిజానికి.వ్యాధితో బాధపడుతున్న రోగికి పైకి కనిపించే రోగం మాత్రమే కాక ఇంకా ఏమైనా కూడా లోపల దాగున్నాయేమోనని గ్రహించి ఆ అన్ని రోగాలూ తొలగిపోయేలానూ, వచ్చి ప్రధానంగా కనిపిస్తున్న ప్రధాన రోగానికి సంబంధించిన మూలకణాల నిర్మూలనానికి ఎలా వైద్యుడు ఆయా ఔషధాలని కలిపి ఓ ఔషధాన్ని సిద్ధం చేస్తాడో అలా ఉపాసనీ మహారాజ్‌ గారు ఈ పాదుకలని అంతటి శ్రద్ధతోనూ చేసి ఉంచడమే కాక, ఏ ఔషధాన్ని ఎంత చలి లేదా వేడి ప్రదేశంలో ఉంచాలో ఆయనకాయనే మనకి చెప్పినట్టుగా ఈ పాదుకలు ఆ వేప చెట్టు కిందనే ఉండాలని ఓ నిర్ణయాన్ని కూడా చేశారు. దాంతో భక్తులందరికీ పాదుకాప్రతిష్ఠ అనేది ఓ ఆనందదాయకమైన ఉత్సవంగా అనిపించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement