ఫ్రెంచ్ చలం

ఫ్రెంచ్ చలం


సత్వంఉన్న ఒక్కగానొక్క జీవితంలో, మనిషి పొందాల్సిన అతిముఖ్యమైనది ఏమిటి? ఈ ‘మనిషి’, అనేచోట మగవాడిని గనక ప్రతిష్టించుకుంటే, దీనికి జవాబివ్వడం  సులువు కావొచ్చు; అప్పటికీ, దీనికి సమాధానం ఒకేవిధంగా ఉండకపోవచ్చు, ఒక్క మొపాసా లాంటివాడికి తప్ప!

‘జీవితంలో ఉన్న ఏకైక ముఖ్యవిషయం- ప్రేమ’!ఇందాక, మనిషి స్థానంలో మగవాడిని ఉంచడానికి కారణం, అతడికి భిన్నమైన లింగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికే! స్త్రీ కౌగిలి మాత్రమే మగవాడికి ధన్యతను చేకూర్చుతుంది; అతడి జన్మను చరితార్థం చేస్తుంది. ధనం, కీర్తి - ఇవేవీకూడా, ఒక స్త్రీ ప్రేమను పొందడానికి పనికిరావు. అలా పనికిరానివేవీకూడా మొపాసాకు పొందగలిగినంత విలువైనవి కావు.

 

గై డి మొపాసా, గీ ద మొపాసా, గై ద మొపాసా, గి ది మొపాసా, గీ డ మొపాసా, గీ డీ మొపాసా... రకరకాలుగా  ఉచ్చారణ ‘వీలున్న’ పేరు ఆయనది; నిజానికి ఆ వీలుండదు, అసలు ధ్వని తెలియని పరాయిభాష అలాంటి ‘సౌలభ్యం’ కల్పిస్తుంది. సింపుల్‌గా మొపాసా అందాం!

 మొపాసా స్త్రీని ప్రేమిస్తాడు. బాహ్య రూపురేఖలను మాత్రమేగాక, ఆమె ఆత్మను కూడా దర్శిస్తాడు. ఆమెలోని మంచినీ, ఆమె దుఃఖం పట్ల సానుభూతినీ పాఠకుడికి బదిలీ చేస్తాడు.

 సమాజంలోని ప్రతి మంచీ ధ్వంసమవుతూ వస్తోంది. నీతిలేని, వివేకరహిత సమాజంలో ప్రతి మంచికీ స్థానం లేదు. దివ్యమూర్తిలాంటి స్త్రీ కూడా ఒక్కోసారి ధ్వంసమవడానికి కారణం ఇదే! స్త్రీని బహుముఖీనంగా చిత్రించాడు మొపాసా(1850-93). మానవనైజంలోని అనేక పార్శ్వాలనూ పట్టుకున్నాడు. కథాయువతికి పట్టుగౌను కుట్టాడు. ‘కొత్తది, వేరే ఎవరూ గమనించలేనిది’ చూశాడు. ఎవరూ చేరుకోలేనంతటి అందమైన వచనాన్ని సృజించాడు.

 చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి, వెన్వెంటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా 300 కథలు, 6 నవలలు రాశాడు. ‘లె మిజెరెబుల్స్’(హ్యూగో) తర్వాత ఫ్రెంచ్ సమాజాన్ని పట్టించిన గొప్ప నవలగా మొపాసా ‘ఉనె వి’ (ఒక జీవితం) పేరుతెచ్చుకుంది.‘నా బాస్ తలనొప్పిగా ఉందన్నా ఇంటికి వెళ్లడానికి అనుమతించలే’దని తల్లికి ఉత్తరం రాసిన మొపాసా... ఉద్యోగానికి స్వస్తి పలికాడు. పుస్తకాలతో వచ్చిన పేరు, పేరుతో ఒనగూడిన సంపదతో నౌక కొన్నాడు. తన తొలి నవల పేరుమీదుగా ‘బెల్ ఎమీ’ (అందమైన స్నేహితుడు)గా దానికి నామకరణం చేశాడు. అందులో అల్జీరియా, ఇటలీ, ఇంగ్లండ్, సిసిలీలాంటి దేశాల్లో పర్యటించాడు. తన అపార్టుమెంటులోని ఒక రహస్య మూలను, అందమైన స్త్రీల చెవుల్లో తన సాహసయాత్రలు వర్ణించి చెప్పటానికే వినియోగించాడు. ఫలితంగా సుఖవ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది.‘పళ్లను వదులుచేసి, వెంట్రుకలను రాల్చి, అవయవాల్ని ధ్వంసం చేసి మింగేయడానికి వచ్చే మృత్యువు’ ముంగిట శక్తిలేక కూలబడ్డాడు. ఎలుకను వేటాడే పిల్లిలాగా అది తరుముతూవుంటే ఎటూ తప్పించుకోలేక  నిస్సహాయుడయ్యాడు. ఏకాంతంలోకీ, స్వీయధ్యానంలోకీ పోవడం మొదలుపెట్టాడు. తీవ్రమైన నిరాశలో గొంతు కోసుకుని ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు.

 జీవనశైలిని కాకుండా రచనాశైలినే పరిగణిస్తే- చలానికి ప్రకృతి వయసు పొడిగించింది కాబట్టి, దాన్ని ఆయన మరింత ‘సార్థకం’ చేసుకున్నట్టుగా కనబడుతుంది; ఆ అవకాశం మొపాసాకు లేదు. 43వ పుట్టినరోజు కూడా చూడకుండానే, జీవితరంగం నుంచి నిష్ర్కమించాడు.శృంగారాన్ని అన్ని కోణాలనుంచీ తరచిచూసి, కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం మొపాసా విస్మరించాడని టాల్‌స్టాయ్ అంటాడు. దానివల్ల పునాదిలేని అందమైన భవనంలాగా ఆయన నిలబడ్డాడని విమర్శించాడు. అయితే, ‘ఆధ్యాత్మిక జననం’ జరిగేలోగా మరణించాడనీ, అయినప్పటికీ, ఆయన సృష్టించినది తక్కువేమీకాదనీ, దానికే మనం కృతజ్ఞులమై ఉండాలనీ చెబుతాడు.

 

‘నేను ప్రతిదాన్నీ కాంక్షించాను, ఎందులోనూ ఆనందం పొందలేకపోయాను,’ అని తన సమాధిఫలకాన్ని లిఖించుకున్నాడు మొపాసా. ఆయనే చెప్పుకున్నట్టుగా, ఉల్కలాగా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించాడు; పిడుగులాగా వెళ్లిపోయాడు. ‘అత్యంత సంతోషంగానూ, భయానక దుఃఖంలోనూ’ గడిపివెళ్లిపోయాడు.

 - ఆర్.ఆర్.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top