పక్కింటి స్నేహం

Funday new story special - Sakshi

కొత్త కథలోళ్లు

అది నిద్రో తెలీదు. మెలకువో తెలీదు. రాత్రుళ్ళు నిద్ర పడుతుందో! లేదో! కూడా తెలీదు. ఎప్పుడు మెలకువ వచ్చినా.. అసలు నేను ఇప్పటి వరకూ నిద్రపోయానా! లేక మెలకువగానే ఉన్నానా! అనిపించేలా ఉంటుంది.  ఆ రోజూ అంతే. నిద్ర కోసం అలసి సొలసి వేకువజామున చల్లగాలికి మాగన్ను పడుతుంటే.. ఆ ప్రశాంతతని భగ్నం చేస్తూ ఏదో చప్పుడు. హోరుమంటూ అదే పనిగా వినవస్తున్న చప్పుడు. ఆ గందరగోళానికి బాగా దగ్గరలోనే ఉన్నట్లు ఉన్నా.. కళ్ళు తెరవలేని అశక్తత. నిద్రమత్తుని బలవంతంగా పక్కకు నెట్టి,       మెలకువ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ చప్పుడు అలాగే వినవస్తోంది. జలజలమంటూ ఒకే శబ్దంతో హోరున పడుతున్నాయి. అది అంతకంతకూ భరించలేనట్లుగా తయారయ్యింది. ఎవరో నీళ్ళ పంపు వదిలేసినట్లున్నారు.అది పక్క ఇంటి ముసలమ్మగారి పనే. పదేళ్ళ పైనుంచీ ఒక్కతే ఉంటోంది. కొడుకో చోట, తనో చోట. కొడుకూ ఒంటికాయ సొంటికొమ్మే. నలభై అయిదేళ్ళు వచ్చేసినయ్యి. ఇంకా పెళ్లి లేదు. ముసలమ్మ కొడుకుని ఒప్పించలేక ‘‘మా అబ్బాయికి అస్సలు తీరిక ఉండదు. అస్తమానం సింగపూరు, వైజాగ్, హైదరాబాదు అంటూ ఊళ్లు తిరుగుతూ ఉంటాడు. అక్కడ సొంతంగా కంపెనీలు ఉన్నాయి. అయినా మాలో లేట్‌ మారేజెస్‌ తప్పు కాదు లెండి’’ అని చెబుతుంది ముసలమ్మ, కోడలోచ్చి, అత్తగారిగా సుఖపడాల్సిన వయస్సులో కూడా. స్థిరంగా ఉండలేని కొడుకు దగ్గర ఉండలేక, సొంత ఫ్లాటులోనే ఉండిపోతుంది. 

ఆ పంపు కింద బకెట్టు అయినా వెయ్యదు. అలా నీళ్ళు వదిలేసి, ఉదయాన్నే ఇంటి చుట్టూరా ఉన్న బాల్కనీ కడుక్కుంటూ వస్తుంది. నిజానికి పనిచేసుకునే తీరు చూస్తే.. ఇంటిలో ఓ బకెట్టు కూడా ఉండి ఉండదన్న అనుమానం నాకు.ఓసారి అననే అన్నా, ‘‘ఆ పంపు కింద ఓ బకెట్టు వెయ్యొచ్చు కదా. అన్ని నీళ్ళు పోతున్నాయి’’ అని. అసలే నా గొంతులో కరుకుదనం ఎక్కువ. అది బయట పడకుండా లేని నవ్వును నటిస్తూ, ఎక్కడ గట్టిగా మాట్లాడితే పక్కనున్న వాళ్లతో స్నేహం దెబ్బతింటుందేమోనన్న అనుమానం పీడిస్తుండగా. ఆఫీసులో అయితే ఆ బాధలేదు. మాట్లాడాలనుకున్నదేదో నిర్మొహమాటంగా మాట్లాడేస్తా. అవసరం అయితే, పోట్లాడడానికైనా వెనుకాడం. ఏదైనా అప్పటికప్పుడే. మరునిమిషం మామూలే. ఏదీ మనసుకు హత్తుకోదు. హత్తుకున్నా కాలం గాయాన్ని మాన్పేస్తుంది. ట్రాన్స్‌ఫర్లలో పాత నీరు పోయి, కొత్త నీరు వస్తుంది. కొత్త మనుషులు.. కొత్త ప్రపంచం.కానీ, బయట ప్రపంచంలో, అందునా పక్కనున్న వాళ్లతో చాలా జాగ్రతగా ఉండాలి. ఇక్కడ ట్రాన్స్‌ఫర్‌లు, కొత్త పరిస్థితుల రాకా ఉండదు. ఏదైనా జరిగితే డోర్‌ మూసుకుపోయినట్లే. ఆ మాటకు తుడుస్తున్న తుడుపు ఆపి    ‘‘నేను ఇక్కడే ఉన్నాను కదా. పని చేసుకుంటూనే ఉన్నాను కదా’’ అంటూ అసహనంగా నాకోసం అన్నట్లు పంపుని కాస్త కట్టి, వదిలేసింది. అయినా నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఇక నాకేం మాట్లాడాలో తెలీలేదు. గట్టిగా మాట్లాడిన దాకా ఉంటే ‘మీరు నలుగురున్న మనుషులు.. మీకన్నా ఎక్కువ నీళ్ళు వాడేస్తానా..’ అంటేనో! దానికి నా దగ్గర సమాధానం లేదు. 

అనవసరంగా మాట్లాడి స్నేహం పోగొట్టుకోవడం ఎందుకు? పక్కింటి వాళ్లతో స్నేహం డబ్బిచ్చి కొనుక్కోలేం.అయితే.. ఇప్పుడు ఆ నీటి ధార చేసే చప్పుడు. నన్ను పడుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోంది. పూర్తిగా మెలకువ వచ్చిన తరువాత.. ఎంతోసేపు ఉండలేకపోయాను. ఇంకా ఊరుకుంటే, పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయే ప్రమాదం ఉంది.  లేచి, వంటగది కిటికీ దగ్గరకు వెళ్లి.. పక్కింటి బాల్కనీ వైపు చూశాను.      పంపు ఆసాంతం విప్పి ఉంది. నీళ్ళు ధారగా పోతున్నాయి. ఆవిడ ఇక్కడ పని మొదలుపెట్టి, ఇంట్లోకి వెళ్లి, మరో పని చూసుకుంటున్నట్లు ఉంటుంది కాబోలు.. పంపు అలాగే పడుతోంది.‘‘ఏమండీ. నీళ్ళు పోతున్నాయి కదా’’ గట్టిగా పిలిచాను ముసలమ్మగార్ని.దరిదాపుల్లో ఉన్నట్లు లేదు. చడీ చప్పుడూలేదు. ఉలుకూ పలుకూ లేదు.రెండు నిమిషాలు చూసి, ‘‘ఏమండీ! రమణమ్మ గారూ’’ మరింత గట్టిగా స్వరం పెంచాను.

నా  అరుపుకి హడావుడిగా బయటకొచ్చిన ముసలమ్మ పంపుని గట్టిగా కట్టి  ‘‘నాకు తెలుసండీ. అస్తమానంనాకేం చెప్పాల్సిన పనిలేదు. నేనేం చిన్న పిల్లనా!’’ అంది.‘‘నీళ్లు పోతున్నాయి కదా..’’ మాట ఇంకా గొంతులో ఉండగానే.. ‘‘మీరింకేం మాట్లాడ కండి. నా సంగతి నాకు తెలుసు’’ అంటూ, చీపురుతో బాల్కనీ తుడుస్తూ,  ‘‘తెల్లారింది మొదలు ఇవే మాటలు అయిపోయినాయ్‌. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా’’ అంటూ తప్పు తనది పెట్టుకుని కూడా సణుక్కోసాగింది.పొద్దుటే, ఏం మాట్లాడాలో తోచింది కాదు.ఆమెలో ఎప్పుడూ ఇలాంటి ధోరణి చూసింది లేదు. అవాక్కయ్యాను. నిద్ర లేచిన వెంటనే, గొడవకు దిగితే, ఇక రోజు ఏం ప్రశాంతంగా ఉంటుంది. మౌనంగా ఉండిపోయాను. ఇన్నాళ్లూ అభిమానంగా ‘‘ఇంట్లో పూజ చేసుకున్నాను. వచ్చి తాంబూలం తీసుకునెళ్ళండమ్మా’’ అన్న ముసలమ్మగారేనా ఈవిడ. తన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈ విధంగా మాట్లాడేస్తోంది.పిలిచిందే తడవుగా.. ఇంట్లోకి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకుని, అక్కడే ప్లేటులో ఆవిడ అమర్చిపెట్టిన పసుపూ, కుంకుమా, వాయనం అన్నీ తీసుకుని, చివరిగా ఆవిడ అందించే ప్రసాదం తీసుకుని, వస్తుంటాం.ఇక ఆ భాగ్యానికి నేను నోచుకోనేమో అనిపించింది ఆ క్షణాన. 
ఇంతటితో మా పదేళ్ళ స్నేహానికి అడ్డుకట్ట పడిందా!     

అపార్టుమెంటులో ఉన్న జబ్బే ఇది.వేసవికాలం అయినా పైపులు అలా వదిలేసి, ఇస్టానుసారంగా నీళ్ళు వాడేస్తారు. రెండు బోర్లు తవ్వించారు. ఒకటి పోయినా ఒకటి ఉంటుందని.మంచినీళ్ళకి మున్సిపల్‌ వాటర్‌ ఎలాగూ ఉంది. మంచినీళ్ళు రాకపోవడం అంటూ ఉండదు. ఎటొచ్చీ వాడకం నీటికే జాగ్రత్త.పేపర్లు, టీవీలు అదే పనిగా ఘోషించి, నీటి ఎద్దడిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా గాని, అవన్నీ ఎక్కడో కదా అన్నట్లు చూస్తారే  తప్ప.. వాస్తవాన్ని గ్రహించలేరు. ఈరోజు సుఖంగా గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకునే నైజం.ఏదో ఓ రోజున బోర్లలో ఉండే భూగర్భజలం అడుగంటుకుపోయి, ఆ వచ్చే కాసిన్ని చుక్కలూ రాకుండా పోతాయి. నీళ్ళు తోడే మోటారు అస్తమానం తోడలేక, తోడి తోడి ఐదో అంతస్తుపైన ఉన్న వాటర్‌ ట్యాంకులోకి ఎక్కించలేక.. అప్పుడప్పుడూ మొరాయిస్తుంది. అదీ వేసవిలోనే. వెంటనే బాగు చేయిద్దాం అన్నా, సమయానికి మెకానిక్‌ దొరకడు. తక్కువలో తక్కువ రెండు రోజులు పడుతుంది. అయిదు అంతస్తులు కిందికి దిగి, వీధి కుళాయిల దగ్గర పట్టుకోవాలి. ముప్పై పోర్షన్ల వాళ్ళూ ఓ రోజు బిందెలు పట్టుకుని కిందకి దిగితే, సాయంత్రానికల్లా లిఫ్ట్‌ పాడైపోతుంది. అది ఇంకా నరకం. బిందె, బిందెకూ వంద మెట్లెక్కి దిగాలి. ఎవ్వరికీ.. రాబోయే కష్టం గురించి ఆలోచన లేదు. అలాంటి పరిస్థితి రాకూడదనే మాట్లాడినందుకు పక్కింటి స్నేహానికి ఎసరొచ్చింది. ఏం చేస్తాం? ఇంతకు ఇంతే ప్రాప్తం అని సరిపెట్టేసుకున్నా. నాకు ఇల్లే కాదు ఆఫీసు అనే మరో ప్రపంచం కూడా ఉంది. కాబట్టి, విషయం అంతగా పట్టించుకోలేదు. ఈ వేసవికి ముసలమ్మగారింటికి పెంపుడు కూతురు  పిల్లలతో సహా వచ్చింది. ఆవిడకీ ఒంటరితనానికి తెర పడింది. మా చూపులు పలకరించుకోవడం పూర్తిగా మానేశాయి. 

ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అనుకుంటున్నాం, ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి అంటూ. శెలవు రోజుల్లో ఇంట్లో ఉండాల్సి వస్తే మాత్రం చాలా కష్టం అయిపోయింది. ఆకాశంలో.. అయిదవ అంతస్తు. ఎండా, వేడీ అంతా ఇంట్లోనే. ఉదయం పది గంటలయితే చాలు వడగాడ్పు మొదలు. తలుపులు ఓ వారగా వేసుకుని, గాడ్పు నుండి ఉపశమనం పొందడం. గదిలో ఫ్యానులు ఆగకుండా తిరిగేవి. అయినా ఉక్కబోత. ముఖం మీద చర్మం కాలిపోతుందన్న భావన. ఎన్ని మంచినీళ్ళు తాగినా దాహం తీరదు. ఒక్కచోట కూర్చోలేని అనిశ్చితి. ఉస్సూరస్సూరంటూ రోజు గడిచేది. అలాంటి వేసవిలో ఆరోజు..ఆఫీసుకి వెళ్ళే తొందరలో వంటగదిలో సింకు దగ్గర పని చేసుకుంటున్నాను. అక్కడ నిలబడి ఎదురు బాల్కనీలోకి చూస్తే ముసలమ్మగారు ఏం పని చెసుకుంటున్నదీ కనిపిస్తుంది. అలాగే పైపులు వదిలేసినా తెలుస్తుంది. కాబట్టే, నేనావిడని కట్టడి చేసేది.

అలా జరిగినప్పటి నుంచీ, ఆవిడ జాగ్రత్తగానే ఉంది, నీటి వాడకం విషయంలో. ఏమనుకుందో ముసలమ్మగారు.. ఎప్పటిలాగే మా వంటగది కిటికీ ఎదురుగా నిలబడి, కిటికీలోకి తొంగి చూస్తూ.. నన్ను  ఉద్దేశించి కాస్త గట్టిగా ‘‘ఎండలు మండిపోతున్నాయండీ. అస్సలు ఉండలేకపోతున్నాము. మీకెలా ఉందో గాని, నేనైతేతట్టుకోలేకపోతున్నాను’’ అంటూ నోరు విప్పి మాట్లాడింది, నెల రోజుల తరువాత. హమ్మయ్యా! ఇన్నాళ్ళకు గ్రహణం వీడింది.ముసలమ్మగారు నాతో మాట్లాడుతోంది. చాలా సంతోషమేసింది. అపార్థాల మంచుతెరలు తొలగి, పిల్లతెమ్మెర వీచినట్లు. ‘‘అవునండీ. అస్సలు భరించలేకుండా ఉన్నాం. నేనైతే ఆఫీసులో ఎక్కువసేపు కంప్యూటర్లు ఉన్న ఏసీ రూంలోనే కూర్చుంటున్నాను. నా సీటు పని కూడా అక్కడేతీసుకువెళ్ళి చేసుకుంటున్నాను. ఎప్పుడోగాని బయటకు రావడం లేదు’’ చెప్పాను అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ.

ముసలమ్మగారితో మాట్లాడానన్న ఆనందం నన్ను ఉత్సాహపరిచింది. మనిషి సంఘజీవి. ఎవ్వరితోనూ మాట్లడకుండా, మనసు పంచుకోకుండా ఎక్కువకాలం ఉండలేడు. నాకంటే మరో ప్రపంచం ఉండబట్టి పట్టించుకోలేదు గాని, వంటరి ముసలమ్మలాంటి వాళ్ళకు పొరుగింటివాళ్ళ తోడు అవసరం. నాకు మాత్రం ఆవిడంటే కోపమా ఏమిటీ? ఎప్పుడూ లేనిది ఆవిడ విసుక్కుందని ఆవిడ వైపు చూడడం మానేశాను గాని.ఏది ఏమైనా మండు వేసవి. ఎండల కారణంగా.. శిశిరం తరువాత వచ్చే వసంతంలా.. ముడుచుకున్న మా స్నేహం తిరిగి చిగురించినందుకు సంతోషపడ్డాను. ఇప్పుడు ముసలమ్మగారు ఎప్పుడు కనిపించినా చిన్నగా నవ్వుతోంది ఎప్పటిలానే. బయట ఎండలు మండుతున్నా.. పక్కింటి స్నేహం వెన్నెల్ని కురిపిస్తూనే ఉంది మనసుకి హాయిగా. 

- పీఎల్‌ఎన్‌ మంగారత్నం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top