
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్-VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎంపీలకు గృహాల కొరతను తీర్చడం, వారికి ఆధునిక, పర్యావరణ అనుకూల నివాసాలను అందించడం లక్ష్యంగా టైప్-VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను నిర్మించారు.
ఎంపీల గృహాల ప్రారంభోత్సవంలో భాగంగా, ప్రధానమంత్రి ఆ గృహాల ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. ఈ భవనాల నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో సంభాషించారు. ఢిల్లీలో కొత్తగా ఎంపీల కోసం నిర్మించిన టైప్ VII నివాసాలు ఎలా ఉంటాయనే విషయానికి వస్తే.. వీటిని అటు ఎంపీల నివాసానికి, ఇటు వారి అధికారిక అవసరాలకు ఉపయుక్తమయ్యేలా ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. రాజధానిలో పరిమిత భూమి లభ్యత కారణంగా ఈ టైప్ VII తరహా గృహాలను నిర్మించారు. దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు, భూ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు ఈ విధమైన గృహాలను నిర్మించారు.
ప్రతి ఫ్లాట్ దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిలో కార్యాలయాలు, సిబ్బంది వసతి నివాస ప్రయోజనాల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ కొత్త ఫ్లాట్‌లు ప్రభుత్వ గృహాల అగ్ర కేటగిరీలోకి వచ్చే టైప్-VIII బంగ్లాల కంటే మరింత విశాలంగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ భవన ప్రాంగణంలో ఒక కమ్యూనిటీ సెంటర్ కూడా ఉంది. ఇది ఎంపీల ఇళ్లలో జరిగే వేడుకలకు కేంద్రంగా ఉపయుక్తం కానుంది.

పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ప్రభావవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మొదలైన సదుపాయాలు ఈ భవన సముదాయంలో ఉన్నాయి. ఈ బహుళ అంతస్తుల భవనాలు అల్యూమినియం షట్టరింగ్‌తో ఏకశిలా కాంక్రీటును ఉపయోగించి నిర్మించారు. అన్ని భవనాలు ఆధునిక నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. అలాగే భూకంప నిరోధకతను కలిగి ఉండేలా నిర్మించారు. ఎంపీల భద్రత కోసం బలమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.