
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.
సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.
బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్‌కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు.