అదృశ్యకరణి

Funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

ప్రాచీన కళాఖండాలు, ఆర్ట్‌ పీసెస్‌ అమ్మే మల్హోత్రా ఎదురుగా సఫారీసూట్‌లో ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. అతడు చెప్పిన ఒక ఆఫర్‌ మల్హోత్రాకు తెగ నచ్చేసింది. ఆ యువకుడు తనతో పాటు తెచ్చుకున్న ఓ లెదర్‌ బ్యాగులోంచి ఒక పల్చటి తెల్లటి వస్త్రాన్ని తీశాడు. మల్హోత్రా దాని వంక ఆశ్చర్యంగా చూశాడు. ‘‘దీన్ని అదృశ్యకరణి అంటారు’’ అని ఆ యువకుడు జిప్‌ బ్యాగులోంచి మరొక చిన్న సీసా తీసి అందులోని ద్రవాన్ని కొంత ఆ వస్త్రానికి పూసి, తనపై ఆ గుడ్డను కప్పుకున్నాడు. మరుక్షణం మల్హోత్రా ముందు ఎవ్వరూ లేరు. మల్హోత్రా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. రెండు నిమిషాల తర్వాత మల్హోత్రా ముందు కుర్చీలో ప్రత్యక్షమయ్యాడు ఆ యువకుడు.‘‘ఆశ్చర్యంగా ఉంది. దీన్నెలా సంపాదించావు?’’ అన్నాడు మల్హోత్రా. ‘‘అదంతా మీకనవసరం. మీకు కావాలా వద్దా?’’ సూటిగా అడిగాడు సూట్‌వాలా. అనుమానంగా చూశాడు మల్హోత్రా. మరోసారి ఆ వస్త్రాన్ని తనపై కప్పుకొని అదృశ్యమయ్యాడు సూట్‌వాలా. క్షణం తర్వాత గది తలుపు దగ్గర తేలాడు.‘‘చెప్పు దీన్ని ఎంతకమ్ముతావు నాకు?’’ ఆశ్చర్యానందాలతో అడిగాడు మల్హోత్రా.  ‘‘పది లక్షలు.’’ అన్నాడతను. బేరసారాలు జరుగుతున్నాయి. సూట్‌వాలా చెప్పిన రేటుకే మల్హోత్రా ఆ వస్త్రాన్ని కొనక తప్పలేదు. సూట్‌వాలా వస్త్రాన్ని, చిన్న సీసాలోని ద్రవాన్నీ మల్హోత్రాకిచ్చి చెప్పాడు – ‘‘మీరు ఈ వస్త్రంపై, ఈ సీసాలోని ద్రవం ఒక ఐదు చుక్కలు పూసి కప్పుకుంటే అదృశ్యమవుతారు. కానీ ఈ వస్త్రం ప్రభావం రెండు గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు అందరికీ మామూలుగా కనిపిస్తారు’’ అన్నాడు. 

‘‘రెండు గంటలు కావస్తుండగా, మళ్లీ ఈ వస్త్రంపై ద్రవాన్ని పూస్తే, మళ్లీ మాయమవుతారా?’’ ఆసక్తిగా అడిగాడు మల్హోత్రా. ‘‘లేదు. రెండు వాడకాల మధ్య కనీసం పన్నెండు గంటలు గ్యాప్‌ ఉండాలి. వస్త్రాన్ని చెక్‌ చేసుకోండి’’ అని తన బ్యాగ్‌ తీసుకొని గది బయటకు నడిచాడు ఆ యువకుడు. మల్హోత్రా మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. వస్త్రంపై ద్రవాన్ని పూసి కప్పుకొని అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో ఎవరూ లేరు. తన ఒంటిపై నుండి వస్త్రాన్ని తీయగానే మళ్లీ మల్హోత్రా ప్రతిరూపం అద్దంలో కనిపించింది. కాసేపు పనివాడు మున్నాను ఈ ఆటతో ఆట  పట్టించి నవ్వుకున్నాడు. ‘‘పది లక్షలు చిల్ల పెంకుల్లా ధారబోసి ఈ వస్త్రాన్ని కొన్నాను. వెంటనే దీన్ని ఉపయోగించి పెట్టుబడిని రాబట్టుకోవాలి’’ అనుకున్నాడు మల్హోత్రా. కాసేపు ఆలోచించి, ఆ వస్త్రాన్నీ, ద్రవాన్నీ ఒక జిప్‌ బ్యాగులో ఉంచుకుని తన కారులో బయలుదేరి కరోల్‌బాగ్‌లో ఒక ప్రసిద్ధి పొందిన జ్యువెలరీ షాపు సమీపంలో తన కారు పార్క్‌ చేసి, బ్యాగులోంచి వస్త్రాన్ని తీసి, దానిపై ఐదు చుక్కల ద్రవాన్ని పూసి తనపై కప్పుకొని, డోర్‌ తీసి కారు దిగాడు. తన ఉనికిని చుట్టుపక్కల వాళ్లెవరూ గమనించకపోవడం చూసి నవ్వుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటి ‘మయూర్‌షా జ్యువెలర్స్‌’ దుకాణంలోకి వెళ్లాడు. ఒక కస్టమర్‌ గ్లాస్‌ డోర్‌లోంచి లోనికి ప్రవేశిస్తుండగా అతని వెనుకనే అదృశ్య రూపంలో ఉన్న మల్హోత్రా ఆ షాపులోనికి వెళ్లిపోయాడు. చౌకీదారు ముందు వెళ్లిన కస్టమర్‌కు మాత్రమే అభివాదం చేశాడు. మల్హోత్రా ఉనికినే గుర్తించలేదు.

మల్హోత్రా షాపంతా కలియదిరుగుతూ షోకేసుల్లో పేర్చిన రకరకాల వజ్రాల హారాలు, బ్రేస్‌లెట్స్, నగల వంక ఆనందంగా చూశాడు. వాటి జోలికి వెళ్లడం ప్రమాదం. ‘కళ్ల ముందే నగలు మాయమైతే ఏ సేల్స్‌మేన్‌ కూడా ఊరుకోడు కదా!’ అనుకున్నాడు.కౌంటర్‌ ముందున్న మయూర్‌షా ముందున్న ట్రేలో రకరకాల నగలున్నాయి. షాపు మూసే సమయం కావడంతో మయూర్‌షా, ఆ నగలన్నింటినీ, క్యాష్‌ టేబుల్‌ కింది రేక్‌లో ఉంచి తాళం వేసి, తాళంచెవి సొరుగుపై ఉంచి షాపంతా కలియదిరుగుతూ పనివాళ్లకు షోకేసులు మూసి లాక్‌ చేయమని పురమాయిస్తున్నాడు.ఇదే అదనుగా మల్హోత్రా, షా టేబుల్‌ సొరుగుపై ఉన్న తాళం చెవి సహాయంతో ఆ రేక్‌ తెరిచి, ఆ నగలన్నింటినీ తన టేబుల్‌లో కూరుకున్నాడు. షా అటువేపు రావడం గమనించి, రేక్‌ మూసి తాళం వేసి, కొందరు కస్టమర్స్‌ స్వింగ్‌ డోర్స్‌ తెరచుకొని బయటకు వెళ్తూ ఉంటే, వారి వెనుకే ఆ షాపు నుంచి బయటకు నడిచాడు. తన ఉనికిని ఎవ్వరూ గమనించకపోవడం అతణ్ని ఆనంద పారవశ్యంలో ముంచింది.మల్హోత్రా కారు డోర్‌ తీసుకుని, డ్రైవింగ్‌ సీట్లో కూర్చోవడం ఆ రద్దీలో ఎవ్వరూ గమనించలేదు. ఆనందంతో ఇల్లు చేరుకొని, డోర్‌ లాక్‌ చేసుకొని బెడ్‌రూమ్‌లోకి నడిచాడు మల్హోత్రా. జేబులోంచి నగలు తీసి ఆనందంతో చూసుకొని, వాటినీ, మాయవస్త్రం ద్రవం ఉన్న జిప్‌ బ్యాగ్‌నూ ఒక అలమారాలో ఉంచాడు. తనకు బాగా తెలిసిన ఒక నగల వర్తకుడు కరంచంద్‌కి ఫోన్‌ చేసి, తన వద్ద కొన్ని మేలిమి నగలున్నాయని, వాటిని కొనడానికి మరుసటి రోజు పొద్దున ఎనిమిదింటికే సొమ్ము తీసుకొని రమ్మని పురమాయించాడు. తరువాత బట్టల బీరువాలోంచి షాంపెయిన్‌ బాటిల్‌ బయటకు తీసి ఆనందంగా కాసేపు తాగి నిద్రకు ఉపక్రమించాడు. కాసేపట్లోనే గాఢంగా నిద్రపట్టిందతనికి. 

ఆలస్యంగా నిద్ర లేచిన మల్హోత్రా స్నానం చేసి గబగబా తయారయ్యాడు. తొమ్మిదింబావైనా ఎందుకో కరంచంద్‌ ఇంకా రాలేదు. ఫోన్‌ చేస్తే, క్యాష్‌ రెడీ చేసుకోవడం ఆలస్యమైందనీ, దారిలో ఉన్నాననీ చెప్పాడు. 
పదిగంటలకు కాలింగ్‌ బెల్‌ మోగింది. కరంచంద్‌ వచ్చి ఉంటాడని తలుపు తీసిన మల్హోత్రా ఎదురుగా యూనిఫామ్‌లోని పోలీసులనూ, మయూర్‌షాను చూసి కంగుతిన్నాడు. ‘‘మీరు నిన్న రాత్రి వీరి దుకాణంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. మర్యాదగా చెప్పండి, ఆ నగలు ఎక్కడ దాచారో’’ అంటున్నాడు ఇన్‌స్పెక్టర్‌. మల్హోత్రాకు మతిపోయినట్లైంది. ‘‘నిన్న రాత్రి వీడు చోరీ చేస్తుంటే ఎవ్వరూ గమనించలేదు. సీసీటీవీలోనూ నిన్న వీడు కనబడలేదు. ఏం మాయ చేశాడో ఏమో! మళ్లీ ఈరోజు ఉదయం తొమ్మిదింటికి షాపు తెరిచి, నగలు మిస్సవడంతో రాత్రి తాలూకు సీసీటీవీ ఫుటేజీ చూసేసరికి వీడు నగలు చోరీచేస్తూ టీవీలో కనబడ్డాడు. దగ్గరలో పార్క్‌ అయిన కార్ల వివరాలు ట్రాఫిక్‌ పోలీసుల సీసీటీవీలో రికార్డయ్యాయి. వాటిద్వారా ఇతని ఆచూకీ కనుక్కున్నాం’’ అప్పుడే అక్కడకు చేరుకున్న డీఎస్పీకి వివరిస్తున్నాడు షా. పోలీసు దెబ్బల భయంతో, మల్హోత్రా గాబరాగా రాత్రి తాను నగలు ఉంచిన అలమారా తెరిచాడు. అందులో నగలు కానీ, మాయా వస్త్రం ఉన్న జిప్‌ బ్యాగ్‌ కానీ కనబడలేదు. సఫారీ సూట్‌ యువకుడి వద్ద అటువంటిదే మరొక వస్త్రం ఉండి ఉండాలి. దాన్ని గదిలోంచి బయటకు నడవగానే కప్పుకొని తన బెడ్‌రూమ్‌లోనే దాగి ఉండి, తాను నిద్రపోయాక నగలు, జిప్‌ బ్యాగ్‌ చోరీ చేసి వెళ్లిపోయి ఉండొచ్చు. మాయావస్త్రం ప్రభావం రెండు గంటల తర్వాత తగ్గడంతో సీసీటీవీలో తానున్న దృశ్యాలు కనిపించి ఉండొచ్చు. 
మల్హోత్రా చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు. దిగాలుగా పోలీసుల వెనక నడిచాడు మల్హోత్రా.   
 రాచపూటి రమేష్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top