తీపి పచ్చళ్లు

Funday cover story:Pickles - Sakshi

కవర్‌ స్టోరీ

బెల్లం చుట్టూ చీమలు చేరడం పాత ముచ్చట.కారం చుట్టూ తిరగడం మామూలు ఇచ్చట.తీపి పచ్చళ్లంటే అందరికీ మమకారమే.కారంలో తీపి కలపడం రుచికి గుణకారమే.ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఇల్లాళ్ల చేతులు వేగం పుంజుకుంటాయి. జాడీలు ప్రాణం పోసుకుంటాయి. నాలుకలు కొత్త ఆవకాయ ఘాటు కోసం చెవులు కోసుకుంటాయి. మరి కారపు పచ్చళ్లలో వెరైటీగా కొంచెం తీపిని కూడా మిళాయిస్తే ఆ ఘుమఘుమే వేరు, ఆ మధురిమే కొత్త తీరు.మామిడికాయ, ఖర్జూరం, టొమాటో, జామకాయ, నిమ్మకాయ, బీట్‌రూట్, పచ్చిమిరప, అల్లం, క్యారెట్, కీరదోస, కాలీఫ్లవర్‌ లాంటి పచ్చళ్లను ఈసారి కొత్తగా ప్రయత్నించండి.  ఇల్లంతా తియ్యటి వేడుక చేసుకోండి.

నిమ్మకాయ  ఊరగాయ
కావలసినవి: నిమ్మకాయలు – 12, ఉప్పు – 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్‌

తయారీ: ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆపైన వాటిని ముక్కలుగా చేసి, గింజలను తొలగించాలి. ఇప్పుడు ఓ జాడీ తీసుకొని, అందులో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు కలపాలి. ఆ జాడీ పదిహేను రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను రోజుల తర్వాత ఆ నిమ్మ ముక్కలను ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి అర కప్పు నీళ్లు పోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడుతుండగా ఏలకుల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో నిమ్మ ముక్కలు, అల్లం పేస్ట్, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా దగ్గరకయ్యాక జాడీలోకి తీసుకోవాలి.

పచ్చిమిర్చి ఊరగాయ
కావలసినవి: పచ్చి మిర్చి (ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉన్నవి) తరుగు – 1 కప్పు, నువ్వుల నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు – 2 టీ స్పూన్లు, ఆవాలు – 1 టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, చింతపండు గుజ్జు (నానబెట్టిన తర్వాత వచ్చే గుజ్జు) – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా నువ్వులు, ఆవాలను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆపైన స్టవ్‌పై మూకుడు పెట్టి నూనె పోయాలి. అందులో పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి కలపాలి. నాలుగు నిమిషాల తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, మూకుడు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేయాలి. మిశ్రమం వేడయ్యాక, నువ్వులు–ఆవాల పొడి, బెల్లం తరుగు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసుకోవాలి. ఆపైన అందులో పచ్చి మిర్చి, అల్లం మిశ్రమం వేసి మరో రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. తర్వాత మిశ్రమం పూర్తిగా చల్లారాక జాడీలోకి తీసుకోవాలి.

ఖర్జూరం ఊరగాయ
కావలసినవి: పచ్చి ఖర్జూరాలు – 2 కప్పులు, అల్లం తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1 టేబుల్‌ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్‌ ఇంగువ – అర టీ స్పూన్, వెనిగర్‌ – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టేబుల్‌ స్పూన్, బెల్లం తరుగు – 1 టేబుల్‌ స్పూన్, కరివేపాకు రెమ్మ – 1, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా

తయారీ: ముందుగా పాన్‌లో నూనె పోయాలి. అందులో కరివేపాకు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. ఆ పైన ఖర్జూరం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, మెంతుల పొడి, కారం, ఆవాల పొడి, ఉప్పు వేయాలి. చివరగా బెల్లం తరుగు, వెనిగర్‌ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక స్టవ్‌ను ఆఫ్‌ చేసుకోవాలి.

బెల్లం ఆవకాయ
కావలసినవి: మామిడి కాయలు – 3, ఆవాలు – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం పొడి – 2 టేబుల్‌ స్పూన్లు, మెంతుల పొడి – 1 టీ స్పూన్,  ఉప్పు – రెండున్నర టేబుల్‌ స్పూన్లు, బెల్లం తరుగు – 1 కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు

తయారీ: ముందుగా మామిడి కాయలను ముక్కలుగా చేసుకోవాలి. ఓ బౌల్‌లో వాటిని తీసుకొని, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని ఓ రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. తెల్లవారాక దాంట్లోని నీటినంతా పారబోసి, ముక్కలను మూడురోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. నాలుగోరోజు, రెండు కప్పుల నీళ్లను మరిగించుకోవాలి. తర్వాత అందులో ఎండిన ముక్కలను వేసి ఓ గంటపాటు పక్కన పెట్టాలి. మరోవైపు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి (పాకం ముదురు కాకుండా చూసుకోవాలి). మామిడి ముక్కలను మరో బౌల్‌లోకి తీసుకొని, కారం, మెంతుల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఆపైన అందులో బెల్లం పాకం వేయాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. అందులో ఆవాలు, ఇంగువ వేసి, ఆ పైన మామిడి మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా ఆవకాయను జాడీలోకి తీసుకోవాలి.

టొమాటో ఊరగాయ
కావలసినవి: టొమాటో ముక్కలు – అర కప్పు, నూనె – 1 టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం పొడి – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, బెల్లం తరుగు – 3 టీ స్పూన్లు, ఆవాల పొడి – పావు టీ స్పూన్‌

తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు ఉంచాలి. ఆపైన అందులో ఇంగువ, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, బెల్లం వేసి కలపాలి. పాన్‌పై మూత పెట్టి మిశ్రమం దగ్గరకయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆపైన దాన్ని దింపేసి, జాడీలోకి తీసుకోవాలి.

కీరదోస పచ్చడి
కావలసినవి: కీరదోస – 6 (నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టీ స్పూన్, కారం – 2 టేబుల్‌ స్పూన్స్, మిరియాల పొడి – 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి – కొద్దిగా, లవంగాల పొడి – పావు టీ స్పూన్, నూనె – సరిపడా

తయారీ: ముందుగా స్టవ్‌ వెలిగించుకుని, ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కీర ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని వేయించు కోవాలి. తర్వాత అందులో చక్కెర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఆవాల పొడి వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.

అల్లం  పచ్చడి
కావలసినవి: అల్లం ముక్కలు – 1 కప్పు, పసుపు– పావు టీ స్పూన్, చింతపండు గుజ్జు – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 5 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, మెంతుల పొడి – ముప్పావు టేబుల్‌ స్పూన్, ఆవాలు – 1 టీ స్పూన్, నూనె – పావు కప్పు, ఎండు మిర్చి ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఇంగువ – చిటికెడు

తయారీ: ముందుగా అల్లం ముక్కలను కొద్దిగా వేయించి, మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్‌లో చింతపండు గుజ్జు,  కారం, పసుపు, ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో మెంతుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి కలపాలి. ఆపైన దాంట్లో అల్లం మిశ్రమాన్ని వేసి ఓ నిమిషం తర్వాత దింపేసుకోవాలి. చల్లారాక జాడీలోకి తీసుకోవాలి.

జామకాయ  పచ్చడి
కావలసినవి: జామకాయ గుజ్జు (దోర కాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి)– ఒకటిన్నర కప్పులు, నూనె – 1 టేబుల్‌ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, బెల్లం తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. అందులో బెల్లం తరుగు, ఇంగువ వేయాలి. అర నిమిషం తర్వాత మిరియాల పొడి, కారం, మెంతుల పొడి వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగేవరకు స్టవ్‌ను మీడియం మంట పైనే ఉంచాలి. ఆ పైన సిమ్‌లో పెట్టి జామకాయ గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసి, చల్లారాక జాడీలోకి తీసుకోవాలి.

వెల్లుల్లి ఊరగాయ
కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు – 1 కప్పు, నువ్వుల నూనె – పావు కప్పు, ఆవాలు – 1 టీ స్పూన్, ఇంగువ –పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – రుచికి తగ్గట్టు, పసుపు – చిటికెడు, చింతపండు గుజ్జు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – రెండున్నర టేబుల్‌ స్పూన్లు, మెంతుల పొడి – అర టీ స్పూన్‌

తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసి, అవి వేగగానే కరివేపాకు, ఇంగువ వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి. ఇప్పుడు బెల్లం తరుగు, మెంతుల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటూ దగ్గరయ్యే వరకు ఉడికించి దింపేయాలి. చల్లారాక ఒక జాడీలోకి తీసుకోవాలి.

క్యారెట్‌ ఊరగాయ
కావలసినవి: క్యారెట్‌ తురుము – 3 కప్పులు, అల్లం + వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి – 1 టీ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, బెల్లం తరుగు – పావు కప్పు, నిమ్మ కాయలు  – 2 లేదా 3(మీడియం సైజ్‌), కారం – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి –పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, నూనె – పావు కప్పు, ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్‌ తురుము, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, అల్లం + వెల్లుల్లి పేస్ట్‌ జత చేసుకుని గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బెల్లం వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అన్ని పొడులను మిక్స్‌ చేసుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని జాడీలోకి తీసుకోవాలి.

బీట్‌రూట్‌ ఊరగాయ
కావలసినవి: బీట్‌రూట్‌ – 3 (మీడియం సైజ్‌), చక్కెర – 1 టేబుల్‌ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, వెనిగర్‌ – పావు కప్పు, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా బీట్‌రూట్‌ను బాగా కడిగి, తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో బీట్‌ రూట్‌ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టవ్‌ మీద ఉంచి ఉడికించాలి. తర్వాత వెనిగర్‌తో పాటు చక్కెర వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకుని నిల్వ చేసుకోవాలి.

కాలీఫ్లవర్‌ ఊరగాయ
కావలసినవి: కాలీఫ్లవర్‌ – 1 (మీడియం సైజ్‌),  ఉల్లిపాయ గుజ్జు – 2 టేబుల్‌ స్పూన్స్, ఎండుమిర్చి – 4, ఆవాలు – 1 టీ స్పూన్, నిమ్మరసం – పావు కప్పు, వెల్లుల్లి గుజ్జు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కారం – 2 టేబుల్‌ స్పూన్స్, నూనె – పావు కప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు

తయారీ:  ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం, వెల్లుల్లి గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ వెలిగించుకుని నాన్‌స్టిక్‌ పాత్రలో నూనె వేసుకుని కాస్త వేడిగా అయిన తర్వాత కాలీఫ్లవర్‌ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను చెంచాతో తిప్పుతూ వెల్లుల్లి మిశ్రమం, కారం, చక్కెరను అందులో వేసుకుని బాగా కలుపుకుని ఉడికించాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఇంకాసేపు ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని జాడీలోకి తీసుకోవాలి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top