రాజావారి ఇంటి దగ్గర...

The film is featured in the Asian Film Festival - Sakshi

నవలలో నుంచి నడిచొచ్చిన సినిమా కథ ఇది. దృశ్యంలో కవిత్వం పలుకుతుంది. పాటల్లో దృశ్యం వినిపిస్తుంది. జాతీయ అవార్డ్‌లు దక్కించుకోవడంతో పాటు, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (1984), ‘మాస్కో ఫిల్మ్‌  ఫెస్టివల్‌’, ‘ఏషియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌’లో ప్రదర్శితమైన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

‘టుక్కు టుక్కు టుక్కు’ అని సౌండ్‌ చేస్తూ గోదావరిలో లాంచి పరుగెడుతుంది. లాంచీ లోపల ఉన్న వీరాస్వామి తన పక్కన ఉన్న నాంచారి కళ్లలోకి చూస్తూ అప్పటికప్పుడు కవిగా మారిపోయాడు...‘నాంచారి...ఇలా వెన్నెల్లో గోదారిని చూస్తుంటే నా గుండె ఐసుముక్కలా కరిగిపోతుందనుకో’వీరాస్వామి భావుకత్వానికి నాంచారికి మండిపోయింది. ‘‘ఎండమండి పోతుంటే వెన్నెలంటావేంటి?’’ కళ్లతోనే కడిగేసింది. అంతమాత్రనా వీరాస్వామి సైలెన్సైపోతాడా ఏమిటి? ‘‘నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల. ఈ లాంచే ఊయల’’ అంటూ  కవిత్వాన్ని కంటిన్యూ చేశాడు. ‘‘నువ్వు మాత్రం నా పక్కన కూర్చుంటే ఈ బల్ల ముళ్లకంప...ఆ రేవే వల్లకాడు’’ అని చురక వేసింది నాంచారి. సరే వీళ్ల సంగతి వదిలేద్దాం. అదిగో అటు చూడండి... అక్కడ ఎవరిదో  తల ‘ఇంతై...అంతై’ అన్నట్లు సైజ్‌ పెరిగిపోతుంది. పక్కన కూర్చున్నాయన నాలిక అనే సుత్తితో తెగ బాదుతున్నాడు.... ‘‘అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్లు వచ్చారు. ఆ తరువాత బుర్రకథల వాళ్లు వచ్చారు.

ఆ తరువాత నాటకాల వాళ్లు వచ్చారు. ఆ తరువాత సినిమావాళ్లు వచ్చారు. ఆ తరువాత...’’ ఈ వాక్‌ దాడికి  అడ్డుపడిన ఆ తలవాచినాయన... ‘‘అసలు రేవు ఎప్పుడూ వస్తుంది?’’ అడిగాడు దీనంగా. ఈయన దీనత్వాన్ని ఖాతరు చేయని ఆ మహాస్పీకరుడు  ‘‘అడ్డుపడకండలా’’ అని విసుక్కున్నాడు. అంతే...ఆ తలవాచినాయనకు మహా కోపం వచ్చింది. అది ఇలా కట్టలు తెంచుకుంది... ‘‘పగటి వేషాలు కాదు...అసలు నువ్వు ఏ వేధవ వేషాలేస్తే నాకేంటటా? దురదగొండాకులా హింసిస్తున్నావు. అయ్యో...వర్జ్యంలో బయలుదేరవద్దని మా ఆవిడ చెప్పినా వినలేదు. కొరివితో తలగోక్కున్నాను...’’ ‘‘ఏంట్రా గొడవ’’ అని ఆరా తీశాడు అక్కడికి వచ్చిన వీరాస్వామి. ‘‘చూడండి వీరాస్వామిగారూ...’’ అని ఆ బాధితుడు ఏదో చెప్పేలోపే... ‘‘నాపేరు నీకెలా తెలుసు?’’ ఆశ్చరంగా అడిగాడు వీరాస్వామి. ‘‘తెలుసండీ...తెలుసు. మీ పేరే కాదు....మీ గురువు గురుమూర్తి. ఆయన కూతురు పేరు నాంచారి. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడి పేరు రాజా. రాత్రి నుంచే ఒకటే సొద. వద్దన్న కొద్దీ అన్నీ చెబుతాడు. బుర్ర హీటెక్కిపోయింది. గోదాట్లో మునిగి తేలితేగాని నా వివరాలు నాకు తెలియవు.

అబ్బ...రేవొచ్చింది...నేను వెళ్తాను’’ అని ఒక లాంగ్‌జంప్‌ చేశాడు తలవాచినాయన. పొద్దు పొద్దున్నే లాంచీ దిగిన పగటివేషగాళ్లు రాజావారి ఇంటికి వెళ్లారు. తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. ‘‘గొంతు ఎంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు’’ చిన్నగా విసుక్కోన్నాడు ట్రూప్‌లో కొత్తగా చేరిన రాజా. ‘‘ష్‌...తప్పుమంది. మన లాంచి పెందరాళే వచ్చింది. రాజావారు స్నానం చేసే వేళ ఇది’’ అని రాజా విసుగుపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు ట్రూప్‌ లీడర్‌ గురుమూర్తి. ‘‘ఆయన స్నానం సంగతి సరే....ఇంట్లో పనివాళ్లు ఉండరా? వాళ్లు ఏంచేస్తారు?’’ అమాయకంగా అడిగాడు రాజా. ‘‘కాళ్లకు గజ్జెలు కట్టుకొని గెంతులు వేస్తారు. రాజావారు స్నానం చేయడమంటే మామూలు విషయం కాదు. కొత్తోడివి నీకేం తెలుసు!’’ అంటూ ఇంచుమించు రాజా మీద కన్నెర్ర చేశాడు ట్రూప్‌ సీనియర్లలో ఒకౖడైన వీరాస్వామి. అయినప్పటికినీ మరో డౌటు అడగానే అడిగాడు రాజా... ‘‘ఇంతటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా! వాళ్లేం చేస్తారు?’’ ‘‘రాణిగారు నిద్ర లేచే సమయంరా ఇది. దాసీలు ఆమె ఎటు వెళితే అటూ కాలు కింద పడకుండా... ముఖమల్‌ వస్త్రాలు పరుస్తారు’’ అని రాజా డౌటు తీర్చాబోయాడు గురుమూర్తి. రాజా చిటపటలాడుతుండగానే చందర్‌రాజావారు రానే వచ్చారు.

నల్లటి కోటు ధరించి పైప్‌ పీలుస్తున్న ఆయనలో రాజఠీవి ఉట్టిపడుతోంది. ‘‘అయ్యగారికి దండలేట్రా’’ రాజాను మెల్లిగా గిల్లాడు గురుమూర్తి. ఉలుకూ లేదు. పలుకూ లేదు. పైగా అటువైపు తిరిగి అసహనంగా అటు ముఖం పెట్టాడు రాజా. ఇలాంటి దృశ్యం గతంలో ఎన్నడూ చూడనిది. చందర్‌రాజావారి  దగ్గరికి వచ్చే కళాకారులు పొగడడమే తమ పని అన్నట్లుగా ఉంటారు. ‘‘ఇతడేమిటి నన్ను చూసి అలా కోపంగా ముఖం తిప్పుకున్నాడు!’’ తనలో తాను అనుకుంటూనే... ‘‘ఏం వీరాస్వామి బాగున్నావా?’’ అని అడిగారు. అంతే!వీరాస్వామి ఎక్కడికో వెళ్లిపోయాడు. ‘‘చూశావా! అంత పెద్ద రాజావారు నన్ను  పేరు పెట్టి మరీ పిలిచారు’’ అన్నట్లు గర్వం నిండిన కళ్లతో గాలిలో గంతులు వేశాడు. ‘‘ఎవరు?’’ అంటూ రాజాను కళ్లతో చూపిస్తూ అడిగాడు చందర్‌రాజావారు. ‘‘కొత్తాడండీ’’ అని కళ్లతోనే రాజాను తేలిగ్గా  తీసేస్తూ చందర్‌రాజావారికి సమాధానం ఇచ్చాడు వీరాస్వామి.

‘‘మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి రెండు కళ్లు...’’ అని ట్రూప్‌ సభ్యుడొకరు రాజా గురించి కాస్త గొప్పగా చెప్పేలోపే ఆయన కాలు తొక్కాడు వీరాస్వామి. దీంతో ‘కళ్లు’ అనబోయి ‘కాళ్లు’ అని నోరుజారాడు ఆయన. ‘‘వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండీ’’ అని చెప్పి రాజావారి దగ్గర సెలవు తీసుకున్నాడు గురుమూర్తి. ఆతరువాత... ‘‘అసలు ఆ పొగరేమిటి నీకు? రాజాగారికి దండమెట్టమంటే అంత ఇదై పోతున్నావు. ఆయన ఈ ఊరి వాళ్లకు దేవుడిలాంటి వాడు’’ అని చందర్‌రాజావారి గొప్పతనం, కీర్తి గురించి గురుమూర్తి ఘనంగా చెప్పబోతుండగానే రాజా అడ్డుపడి.... ‘‘ఊరి వాళ్లు ఎలా కొలిస్తే నాకేం. నేను దణ్ణం పెట్టను. గొప్పమనసు అని తెలిస్తే ముష్ఠివాడికి కూడా పాదాభివందనం చేస్తాను’’ అన్నాడు స్పష్టంగా... కోపంగా.
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top