గందరగోళంలో భూగోళం

Earth Facing Challenges Over Story In Sakshi Funday

భూగోళం– ఇది మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశికీ ఆలవాలం. నిజానికి ఈ భూమ్మీద మనుషుల ఆవిర్భావం చాలా ఆలస్యంగా మొదలైంది. విశాల విశ్వంలో జరిగిన మహా విస్ఫోటానికి పర్యవసానంగా ఏర్పడిన సౌరకుటుంబంలో కోట్లాది ఏళ్ల కిందట భూమి కూడా పుట్టింది. మన భూగోళం వయసు 454 కోట్ల సంవత్సరాలకు పైమాటేనని శాస్త్రవేత్తల అంచనా. ఇంత సుదీర్ఘమైన వయసు గల భూమిపై ఇప్పటి ఆధునిక మానవుల మనుగడ మొదలై దాదాపు 2 లక్షల సంవత్సరాలు మాత్రమే అవుతోంది. మనుషుల ప్రాబల్యం పెరుగుతూ వస్తున్న కొద్దీ భూమిపై వాతావరణంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఎన్నెన్నో జీవరాశులు కనుమరుగైపోయాయి. యంత్రాల వినియోగం, జీవ ఇంధన వినియోగం పెరిగినప్పటి నుంచి భూ వాతావరణంలో కాలుష్యం పెరిగింది. మనుషులు సృష్టించుకున్న నానా రకాల యంత్రాలు, వాహనాల నుంచి వెలువడే కలుషిత వాయువులు మనుషులనే ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. మానవుల స్వార్థం ఫలితంగా ఇప్పుడు భూగోళం  క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా మెలకువ తెచ్చుకోకుంటే, మానవాళి మనుగడే మరింత క్లిష్టంగా మారే పరిస్థితుల్లో ఉంది.

భూగోళం ఏర్పడిన కొత్తలో అగ్నిపర్వతాల క్రియాశీలత, వాయువుల విడుదల వంటి వాటి ఫలితంగా సముద్రాలు ఏర్పడ్డాయి. సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో సూర్యుడి తీక్షణత ఇప్పటితో పోల్చుకుంటే 70 శాతమే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సముద్రాలు గడ్డకట్టిపోకుండా భూమిని ఆవరించి ఉన్న కార్బన్‌ డయాక్సైడ్, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి వాయువులే దోహదపడ్డాయి. భూగోళంపై జరిగిన అనేకానేక రసాయనిక మార్పుల ఫలితంగా దాదాపు 400 కోట్ల ఏళ్ల కిందట జీవం ఆవిర్భవించింది. క్రమంగా మరో 50 కోట్ల ఏళ్లు గడిచాక, భూమ్మీద ఇప్పుడు నివసిస్తున్న జీవులన్నింటికీ పూర్వీకులు అనదగ్గ జీవులు పరిణామం చెందాయి. కిరణజన్య సంయోగ క్రియ పరిణామం వల్ల సౌరకాంతిని నేరుగా వినియోగించుకోగల జీవులు ఏర్పడ్డాయి. ఫలితంగా అణు రూపంలో ఉన్న ఆక్సిజన్‌ (ఓ 2) భూ వాతావరణాన్ని ఆవరించుకోవడం మొదలైంది. సౌరకాంతి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల వాతావరణంలోని ఆక్సిజన్‌లో కొంత ఓజోన్‌గా (ఓ3) మారి, భూమి చుట్టూ ఒక రక్షణ వలయంలాంటి పొరగా ఏర్పడింది.

పశ్చిమ ఆస్ట్రేలియా, గ్రీన్‌లాండ్‌లలో దొరికిన శిలాజాలను పరీక్షించిన శాస్త్రవేత్తలు భూమిపై దాదాపు 400 కోట్ల ఏళ్ల కిందటే జీవం ఆవిర్భవించి ఉంటుందనే అంచనాకు వచ్చారు. జీవావిర్భావానికి ముందు, అగ్నిపర్వతాలు క్రియాశీలం కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు భూగోళం పూర్తిగా మంచుగోళంగా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద జీవం ఆవిర్భవించిన తర్వాత కాలక్రమంలో డైనోసార్ల వంటి భారీ జీవులు కూడా ఏర్పడ్డాయి. దాదాపు 24 కోట్ల ఏళ్ల కిందట భారీ డైనోసార్లు ఆవిర్భవించాయి. గ్రహశకలం తాకిడి ఫలితంగా 20 కోట్ల సంవత్సరాల కిందట నేల మీద సంచరించే డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. అదంతా మానవుల ఆవిర్భావానికి మునుపటి ముచ్చట. మానవుల ప్రాబల్యం పెరిగిన తర్వాత, ఆధునిక యుగంలో యంత్రాలు, జీవ ఇంధనాల వినియోగం పెరిగిన తర్వాత మరిన్ని జీవులు సైతం కనుమరుగయ్యాయి.

ఇవీ సవాళ్లు...
భూగోళానికి మానవుల కారణంగా ప్రధానంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇవన్నీ పరస్పర సంబంధం లేనివేమీ కావు. ఒక సమస్యతో మరొకటి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడి ఉన్నవే. ప్రస్తుతం భూగోళానికి ఎదురవుతున్న ప్రధానమైన సవాళ్లూ, సమస్యలూ ఇవే...

కాలుష్యం
భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి, సముద్రాలు, నదులు మొదలుకొని చెరువులు, బావుల వరకు నిండి ఉన్న నీరు, నేల మీద వృక్షజాతుల మనుగడకు అవసరమైన మట్టి సమస్తం కాలుష్యానికి లోనవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, యంత్రాలు, మోటారు వాహనాల నుంచి వెలువడే విష వాయువులు, ఎక్కడికక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, నీటిలోను, మట్టిలోను కలుస్తున్న భార లోహాలు... ఇవన్నీ నానాటికీ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వీటి కారణంగా భూసారం క్షీణిస్తోంది. గాలీ నీరూ స్వచ్ఛత కోల్పోయి, మనుషుల మనుగడకే ముప్పు తెచ్చేలా మారు
తున్నాయి.

భూతాపం
ఖనిజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్రపరికరాల వినియోగం వల్ల చేటు కలిగించే వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఇవన్నీ భూతాపాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా భూ ఉపరితలంతో పాటు సముద్రాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచుఖండాలు కరిగి, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పలుచోట్ల అకస్మాత్తుగా వరదలు పోటెత్తడం, అనూహ్యంగా మంచు కురవడం, కొన్నిచోట్ల మొక్కలు మొలవని పరిస్థితి ఏర్పడి ఎడారులుగా మారే ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అధిక జనాభా
భూగోళం ఏర్పడినప్పటి నుంచి దీని విస్తీర్ణం పెరగకపోయినా, మనుషుల జనాభా మాత్రం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం భూమ్మీద మనుషుల జనాభా దాదాపు 780 కోట్లకు చేరుకుంది. నీరు, ఆహారం, ఇంధనం వంటి సహజ వనరులు మానవులందరికీ సరిపోయే పరిస్థితులు ఇక ఎన్నాళ్లో ఉండవు. తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడులనిచ్చే పంటలను పండించడం కోసం రసాయనిక ఎరువులు వాడటం, వేసిన పంటలు చీడ పీడలను తట్టుకునేలా వాడే పురుగు మందులు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక జనాభా ఫలితంగా తలెత్తుతున్న ఈ సమస్యలన్నీ భూమిపై వాతావరణానికి తీవ్రమైన చేటు తెచ్చిపెడుతున్నాయి.

సహజ వనరుల క్షీణత
అధిక జనాభా ఫలితంగా భూమిపై సహజ వనరులు అంతకంతకు క్షీణించిపోతున్నాయి. ముఖ్యంగా జీవ ఇంధన వనరులు అడుగంటిపో తున్నాయి. ఖనిజ తైలం నుంచి లభించే పెట్రోలు, డీజిలు వంటి ఇంధనాల లభ్యత ఎంతో కాలం కొనసాగే పరిస్థితులు ఉండవు. ఖనిజ ఇంధనాలకు ప్రత్యమ్నాయంగా సౌరశక్తి, పవన శక్తి వంటి వాటిని ప్రత్యామ్నాయ ఇంధనాలుగా వినియోగించుకుంటే తప్ప పరిస్థితి చక్కబడదు. అయితే, సౌరశక్తిని ఇంధనంగా మలచుకునే సోలార్‌ ప్యానెల్స్, పవన శక్తిని ఇంధనంగా వాడుకునేందుకు కావలసిన విండ్‌మిల్స్‌ వంటి వాటి ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. భూమ్మీద సహజ వనరులు క్షీణించిపోతూ ఉంటే, మనుషుల మనుగడ మరింత కష్టతరంగా మారక తప్పదు.

చెత్త పారబోత
చెత్త పారబోత కూడా భూగోళానికి పెను సమస్యగా మారుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల వ్యర్థాలు, ఆహార పదార్థాల ప్యాకేజీలు వంటి చెత్త ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల వల్లనే పోగవుతోంది. ఈ చెత్తంతా సముద్రాల్లోకి, వెనుకబడిన దేశాల భూభాగంలోకి చేరుతోంది. ఈ చెత్తంతా ఒక ఎత్తయితే, అణు వ్యర్థాల పారబోత మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తోంది. అణు విద్యుత్‌ కేంద్రాలను నిర్వహించే దేశాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలను సముద్రాల్లోకి మళ్లిస్తూ ఉండటం వల్ల సముద్రాల్లో సమతుల్యత, జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అణు వ్యర్థాల కారణంగా మనుషుల్లోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

జీవ వైవిధ్యానికి హాని
సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలు, నేలలోకి ఇంకుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ఇష్టానుసారం సాగుతున్న నరికివేత వల్ల కనుమరుగవుతున్న అడవుల కారణంగా భూమ్మీద జీవ వైవిధ్యానికి ఎనలేని హాని జరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల ఫలితంగా ప్రతిరోజూ దాదాపు 150 జీవజాతులు నిశ్శబ్దంగా కనుమరుగైపో తున్నాయి. పిచ్చుకల వంటి చిన్నా చితకా జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికైనా మానవాళి మెలకువ తెచ్చుకుని సత్వరమే దిద్దుబాటు చర్యలను ప్రారంభించకుంటే, భూమ్మీద మిగిలిన జీవరాశులు కూడా వేగంగా అంతరించడమే కాకుండా, చివరకు మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు.

సముద్రాల ఆమ్లీకరణ
వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణానికి మించి విడుదలవుతున్నందున సముద్ర జలాలు అమ్లీకరణ చెందుతున్నాయి. సముద్ర జలాల ఆమ్లీకరణ ఫలితంగా సముద్రాలను ఆవాసంగా చేసుకునే జలచరాలకు ఆహారంగా ఉపయోగపడే నాచు నశిస్తోంది. నత్తగుల్లలు, పగడపు దిబ్బలు వంటివి కూడా గణనీయంగా నాశనమవుతున్నాయి. గడచిన 250 ఏళ్లలో సముద్ర జలాల ఆమ్లీకరణ బాగా పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, సముద్ర జలాల ఆమ్లీకరణ 150 శాతం మేరకు పెరగగలదని, ఈ పరిస్థితి మనుషులకు కూడా చేటు తెచ్చిపెడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆమ్లవర్షాలు
ఖనిజ ఇంధనాల వినియోగం వల్ల వెలువడే కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులు, పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని రకాల వాయువులు, అగ్ని పర్వతాలు బద్దలయ్యేటప్పుడు వెలువడే వాయువులు, అడవులలో కుళ్లిన జంతు కళేబరాల నుంచి వెలువడే సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి వాయువులు వాతావరణంలోకి చేరడం వల్ల అక్కడక్కడా ఆమ్లవర్షాలు కురుస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఆమ్లవర్షాలు కొంత పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనావాసాలు ఉన్న చోట తరచుగా ఇలాంటి ఆమ్లవర్షాలు కురిస్తే, ఇవి మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. అడవుల్లో కురిస్తే వన్యజీవులకు, సముద్రాల్లో కురిస్తే జలచరాల మనుగడకు కూడా ఆమ్లవర్షాలు చేటు తెచ్చిపెడతాయి.

అడవుల నరికివేత
జనాభా పెరుగుతున్న కొద్దీ జనావాసాలను ఏర్పాటు చేసుకోవడానికి మనుషులు అడవుల నరికివేతను ప్రారంభించారు. రకరకాల స్వార్థపు అవసరాల కోసం మనుషులు ఈనాటికీ యథేచ్ఛగా అడవుల నరికివేతకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి మన భూగోళంలోని స్థలభాగంపై దాదాపు 30 శాతం వరకు అడవులు ఉన్నాయి. అయినా, ఏటా దాదాపు పనామా దేశ విస్తీర్ణానికి సమానమైన విస్తీర్ణంలోని అడవులు నరికివేతకు గురవుతూనే ఉన్నాయి. అంటే, ఏటా దాదాపు 75 వేల చదరపు విస్తీర్ణంలోని అడవులు కనుమరుగవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల ఆవశ్యకతను గుర్తించిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుండటమే విషాదం.

ఓజోన్‌ పొర క్షీణత
భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఓజోన్‌ పొర భూమిపై ఉన్న సమస్త జీవరాశికి అదృశ్య కవచంలా పని చేస్తుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తుంది. వాహనాలు, పరిశ్రమల కారణంగా వెలువడే హానికరమైన వాయువులు ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు ఓజోన్‌పొరకు తీరని హాని కలిగిస్తున్నాయి. గడచిన యాభయ్యేళ్లుగా వెలువడుతూ వస్తున్న కలుషిత వాయువుల కారణంగా ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్‌ పొరకు ఏకంగా చిల్లు పడింది. అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొరకు చిల్లు ఏర్పడినట్లు అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1982లో వెల్లడించింది. అయితే, ఈ చిల్లు కాస్త చిన్నగా తయారైందని ఇటీవల వెల్లడించడం కొంత ఆశాజనకమైన పరిణామం.

కరోనా వైరస్‌ విజృంభణతో మానవాళి హాహాకారాలు చేస్తున్నా, భూగోళానికి మాత్రం కొంత మేలు జరిగిందనే చెప్పవచ్చు. ‘కరోనా’ మహమ్మారిగా మారడంతో చాలా కొద్దిచోట్ల మినహాయించి దాదాపు ప్రపంచమంతటా లాక్‌డౌన్‌ అమలవుతోంది. వాహనాల వినియోగం గణనీయంగా తగ్గింది. నిత్యం జనాల ఉరుకులు, పరుగులతో సందడిగా కనిపించే మహా నగరాలన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలకు సంబంధించినవి మినహాయిస్తే, మిగిలిన పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా వాతావరణంలోకి కలుషిత వాయువుల విడుదల గణనీయంగా తగ్గింది. కరోనా వైరస్‌ గత ఏడాది చివర్లో చైనాలో మొదలైన సంగతి తెలిసిందే. మూడు నెలలు గడవక ముందే ఇది ఖండాంతరాలకు పాకింది.

ఫలితంగా వరుసగా వివిధ దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ బాట పట్టాయి. వివిధ దేశాల్లో అమలవుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వంటి వాయువుల పరిమాణంలో 40 శాతం వరకు తగ్గుదల నమోదవుతున్నట్లు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ దెబ్బకు వివిధ జాతీయ, అంతర్జాతీయ రహదారుల్లో మోటారు వాహనాల రద్దీ 83 శాతం తగ్గింది. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కర్బన ఉద్గారాలు, కలుషిత వాయువుల పరిమాణం గణనీయంగా తగ్గిందని ‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌’ అధ్యక్షుడు రాబ్‌ జాక్సన్‌ చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పలుచోట్ల గడ్డి కోసివేత, అడవుల నరికివేత వంటి పనులు కూడా నిలిచిపోవడం వల్ల వన్యప్రాణులు మరింత స్వేచ్ఛగా మనుగడ సాగించగలుగుతున్నాయని చెబుతున్నారు. అయితే, పర్యావరణానికి ప్రస్తుతం జరిగిన మేలు తాత్కాలికమేనని, ‘కరోనా’ మహమ్మారి సద్దుమణిగి, తిరిగి యథాస్థితికి వచ్చిన తర్వాత పరిస్థితులు షరా మామూలుగానే మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. – పన్యాల జగన్నాథదాసు

మానవుల స్వార్థం ఫలితంగా ఇప్పుడు భూగోళం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 
భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి, సముద్రాలు, నదులు మొదలుకొని చెరువులు, బావుల వరకు నిండి ఉన్న నీరు, నేల మీద వృక్షజాతుల మనుగడకు అవసరమైన మట్టి సమస్తం కాలుష్యానికి లోనవుతున్నాయి.
యంత్రాల వినియోగం, జీవ ఇంధన వినియోగం పెరిగినప్పటి నుంచి భూ వాతావరణంలో కాలుష్యం పెరిగింది. మనుషులు సృష్టించుకున్న నానా రకాల యంత్రాలు, వాహనాల నుంచి వెలువడే కలుషిత వాయువులు మనుషులనే ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి.
► ఖనిజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్రపరికరాల వినియోగం వల్ల చేటు కలిగించే వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఇవన్నీ భూతాపాన్ని 
పెంచుతున్నాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top