అధికారానికో దండం! | BJP, Aam Aadmi Party not ready to form government in Delhi | Sakshi
Sakshi News home page

అధికారానికో దండం!

Dec 11 2013 3:59 PM | Updated on Mar 29 2019 9:18 PM

సాధారణంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. కానీ దేశ రాజధాని హస్తినలో ఇందుకు విరుద్దంగా పరిస్థితిగా ఉంది.

సాధారణంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. కానీ దేశ రాజధాని హస్తినలో ఇందుకు విరుద్దంగా పరిస్థితి ఉంది. 'పవర్' కోసం పాకులాడకుండా పార్టీలు మిన్నకుండిపోయాయి. అసలు తమకు అధికారమే ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. పవర్ మాకొద్దంటూ భీష్మించుకుని కూర్చున్నాయి. ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాం కానీ పాలన పగ్గాలు మాత్రం తీసుకోబోమని పారిపోతున్నాయి. అరకొర మెజారిటీతో హస్తిన అధికారం తమకొద్దని తీసిపాడేస్తున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఉఠ్కంత కొనసాగుతోంది. ఎన్నికలు పూర్తైన ఒక్క పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. జాతీయ పార్టీ బీజేపీ, కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాలన పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటోంది. ఒకరితో ఒకరు జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేసేందుకు కూడా పార్టీలు ఒప్పుకోవడం లేదు. అధికారం కోసం రాజకీయ పార్టీలు పాకులాడడం వర్తమాన రాజకీయ రంగంలో సాధారణ విషయం. సహజ లక్షణానికి విరుద్దంగా అధికారం వద్దని పొలిటికల్ పార్టీలు మడి కట్టుకుని కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ శాసనసభలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం మొగ్గుచూపడం లేదు. రెండో అతిపెద్ద పార్టీగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే మాట చెబుతోంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బీజేపీ 31, ఆప్ 28 సీట్లు గెల్చుకుని ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. ఇక్కడే పేచీ వచ్చి పడింది. అధికారం కోసం ఏ పార్టీ ముందు చేతులు చాచబోమని రెండు పార్టీలు స్పష్టం చేయడంతో కొత్త సర్కారు ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది.

ఢిల్లీ ప్రజలు బీజేపీ, ఆప్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని.. కాబట్టి ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరినా ఒప్పుకోవడం లేదు. మిగతా పార్టీల మద్దతు తీసుకోవడానికీ అంగీకరించడం లేదు. అధికారం కోసం ఫిరాయింపులను  ప్రోత్సహించబోమని బీజేపీ, అవినీతి పార్టీలతో జట్టు కట్టబోమని ఆప్ పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఢిల్లీ భవితవ్యం ఆధార పడి ఉంటుంది. హస్తిన ఓటర్లు మాత్రం మళ్లీ ఎన్నికలు వస్తాయేమోనని భయపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ, ఆప్ల విధానాలను ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement