ఈ వారం యూట్యూబ్‌ హిట్స్‌ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్‌

Jun 11 2018 1:19 AM | Updated on Jun 11 2018 1:19 AM

YouTube hits this week - Sakshi

రిజల్ట్‌ కా మాహోల్‌  – షార్ట్‌ ఫిల్మ్‌
నిడివి : 9 ని. 23 సె.
హిట్స్‌:1,06,92,617

గతంలో కూడా ఎగ్జామ్స్‌ ఉండేవి. అందరూ రిజల్ట్స్‌ కోసం ఎదరుచూసేవారు. వారి ఎదురుచూపు పాసా ఫెయిలా తెలుసుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఫెయిల్‌ భయం ఎవరికీ లేదు. అందరికీ పర్సెంటేజ్‌ ఎంత వస్తుందనేదే రంధి. ఎయిటీయా నైన్‌టీయా నైన్‌టీ ఫైవా... కొందరైతే వన్‌ ఫిఫ్టీ పర్సెంట్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చేసి అంత రాక అప్‌సెట్‌ అవుతున్నారు. సూపర్‌ తిండి అందుబాటులోకి వచ్చినట్టుగా సూపర్‌ చదువులు కూడా అందుబాటులోకి వచ్చాయి. జ్ఞానం, అవగాహన ఆధారంగా కాకుండా మార్కుల ఆధారంగా చదువులు సాగుతున్నాయి. సబ్జెక్ట్‌ ముక్కరాని టాపర్లు కూడా ఉంటున్నారు. ఈ నేప«థ్యంలో మధ్యతరగతి కుటుంబాల్లో రిజల్ట్స్‌ కోసం ఎదురు చూసే తండ్రులు, రిజల్ట్స్‌ భయంతో నానా బాధలు పడే కొడుకులను హాస్య, వ్యంగ్య రూపంలో చూపిన హిందీ షార్ట్‌ఫిల్మ్‌ ఇది. సరదాగా ఉంది. కోటి హిట్లు దాటేసింది. అమిత్‌ భడానా దీని రూపకర్త.

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ – ట్రైలర్‌
నిడివి :1 ని. 31 సె.
హిట్స్‌ :3,30,719
హిందీలో ‘కహానీ’ వంటి థ్రిల్లర్స్‌ వచ్చాయి. ‘మోహ్‌ మాయా మనీ’ వంటి కొత్త కథనాలు చూశాం. తెలుగులో ‘క్షణం’ వంటి ప్రేక్షకులను రంజింప చేశాయి. శ్రీదేవి ‘మామ్‌’, అనుష్క శర్మ ‘ఎన్‌హెచ్‌10’ కూడా ఈ వరుసలోవే. అదే ధోరణిలో ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ట్రైలర్‌ కూడా కనిపిస్తోంది. భర్త హత్యకు గురైతే దానిని చేసిందెవరు అని తెలుసుకోవడానికి భార్య ప్రయత్నించడం. లక్ష్మి మంచి నటిగా తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఆమె కష్టపడి పని చేస్తున్నారు. ఈ ట్రైలర్‌లో కూడా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం కనిపిస్తోంది. ప్రియదర్శి ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. విజయ్‌ ఎలకంటి దర్శకుడు.

మా నాన్న రైతు  – షార్ట్‌ ఫిల్మ్‌
నిడివి :15 ని. 08 సె.
హిట్స్‌ :1,54,551
రైతు మట్టి పిసుక్కుని బతుకుతాడు. ఆ పనిలో అతడికి ఆనందం ఉంది. ఆదాయం కూడా ఉంటే రైతు బంగారంలా బతుకుతాడు. కానీ ఆ రంగంలో నిత్యం సవాళ్లు. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు. అందుకే రైతు తన పిల్లలు బాగుపడాలని పెద్ద చదువులు చదివించాలనుకుంటాడు. వాళ్లు వ్యవసాయేతర ఉపాధిలో రాణించాలనుకుంటాడు. కానీ అందరూ అలా అనుకుంటే వేల ఏళ్లుగా ఈ దేశంలో కళకళలాడిన వ్యవసాయం తర్వాతి తరాలకు అందేదెలా? ఈ ప్రశ్నతోనే ‘మా నాన్న రైతు’ షార్ట్‌ఫిల్మ్‌ తయారయ్యింది. ‘మా వేళ్లు భూమిలోకి వెళితేనే మీ వేళ్లు నోట్లోకి వెళతాయి’ అని ఎదుటివారికి రోషంతో హితం చెప్పే రైతు ఎల్‌.బి.శ్రీరాం. కానీ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ ఊళ్లో ఉన్న పొలాన్ని అమ్మేయమని తండ్రిని బలవంతం చేస్తూ ఉంటారు. తండ్రి పొలాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అయితే– రెండేళ్లు తనతో పాటు వ్యవసాయం చేస్తేనే అని షరతు పెడతాడు. వ్యవసాయంలో దిగిన కొడుకులు అంతంత మాత్రం ఉద్యోగాల కంటే తలెత్తుకొని స్వతంత్రంగా బతికేలా చేసే వ్యవసాయమే మేలని గ్రహించి తండ్రి పరంపరగా వ్యవసాయాన్ని స్వీకరిస్తారు. రైతు మీద ఎన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ వస్తే అంత మంచిది. ఇందులో నటుడు జీవా కూడా కనిపిస్తాడు. రచన దర్శకత్వం: భరద్వాజ్‌ శర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement