ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

YouTube hits this week - Sakshi

మేథీ కా లడ్డూ – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి: 8 ని. 04 సె. :::
హిట్స్‌: 1,79,519

ఇది ఒక తల్లి ఇద్దరు కూతుళ్ల మధ్య ఒక మధ్యాహ్నం పూట వంట జరుగుతుండగా నడిచే చిన్న కథ. తల్లిని చూడటానికి ఇద్దరు కూతుళ్లు వచ్చి ఉంటారు. తల్లి లడ్డూలు చేస్తూ ఉంటుంది. అవి తన కోసం చేస్తున్న లడ్డూలు అని పెద్ద కూతురు భావిస్తుంది. కాని ఆ లడ్డూలు చిన్న కూతురి కోసమనీ– కడుపుతో ఉన్న ఆ కూతురి బొజ్జలో ఉన్న బుజ్జిపాపాయి కోసమని తల్లి చెబుతుంది. పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు పుట్టని పెద్ద కూతురు నొచ్చుకుంటుంది. సాధారణంగా మధ్యతరగతి ఇళ్లలో దేవుణ్ణి నమ్ముకోవడమే ముఖ్యంగా ఉంటుంది గానీ... సైన్సును నమ్ముకోవడం జరగదు. కాని తల్లి నెమ్మదిగా మాటలు కదిలేసి కృత్రిమ పద్ధతి ద్వారా బిడ్డలను కనడం తప్పు కాదని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ కోసం ట్రై చేయమని చెప్పి ఒప్పిస్తుంది. ఇదంతా వంటగదిలో ఒక అందమైన సంభాషణ రూపంలో సాగుతుంది. ఈ సంభాషణలో తల్లి ఎప్పుడూ పిల్లల పక్షమే అనే అభిప్రాయం మరో మారు రూఢీ అవుతుంది. జరీనా వహాబ్, ఆకాంక్షా సింగ్‌ నటించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ చూడదగ్గది.

అక్టోబర్‌ – ట్రైలర్‌
నిడివి: 2 ని. 02.సె.
హిట్స్‌: 20,063, 983

‘పికూ’ సినిమాకు దర్శకత్వం వహించి ‘పింక్‌’ సినిమాకు నిర్మాతగా మారిన  సూజిత్‌ సర్కార్‌ రెండేళ్ల విరామం తర్వాత ‘అక్టోబర్‌’ సినిమాతో దర్శకుడిగా తిరిగి వస్తున్నాడు. వరుణ్‌ ధావన్‌ వంటి యాక్షన్‌ హీరో ఈ సినిమాలో హోటల్‌ బోయ్‌గా నటిస్తుండటం విశేషం. తమిళంలో ‘షాపింగ్‌ మాల్‌’ అనే సినిమా వచ్చింది. షాపింగ్‌ మాల్‌లో పని చేసే ఇద్దరు అమ్మాయి, అబ్బాయిలు ప్రేమలో పడతారు. ఈ సినిమాలో ఒక స్టార్‌ హోటల్‌లో పని చేసే వర్కింగ్‌ క్లాస్‌ అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడతారు. అయితే ఆ అమ్మాయి ప్రాణాంతకమైన సమస్యతో హాస్పిటలైజ్‌ అయితే హీరో ఆమె కోసం ఎలాంటి కేర్‌ తీసుకున్నాడన్నది ఈ ప్రేమ కథ సారాంశం కావచ్చని తెలుస్తోంది. పూర్తిగా కొత్త తరహా కథ, కథనం ప్రామిస్‌ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ కుతూహలం రేపుతోంది. సూజిత్‌ సర్కార్‌ సినిమాలకు తరచూ పని చేసే జుహు చతుర్వేది ఈ సినిమాకు కూడా రచన చేశారు.

తథాస్తు  – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి: 19 ని. 41 సె.
హిట్స్‌: 3,48,934

యాంకర్‌గా సుప్రసిద్ధురాలైన సుమ ఆర్‌.పి.పట్నాయక్‌ దర్శకత్వంలో నటించిన షార్ట్‌ఫిల్మ్‌ ఇది. సమాజంలో ఎవరూ పెద్దగా పట్టించుకోని అనాథల పట్ల... మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే కథగా దీనిని రూపొందించారు. ఇందులో లాయర్‌గా నటించిన సుమ అనాథ శరణాలయాలకు కేవలం డొనేషన్లు ఇవ్వడం వల్ల పనులు జరగవనీ మనం కూడా అప్పుడప్పుడు వాటిని పట్టించుకోవాల్సి ఉంటుందని, ఆ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాల్సి ఉంటుందని గ్రహిస్తుంది. తన పాప పుట్టినరోజును అనాథ శరణాలయంలో నిర్వహించడమే కాక ప్రతి తల్లిదండ్రులు ఇదే పద్ధతిని పాటించాలని పిలుపునిస్తుంది. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరో యాంకర్, గాయని సునీత చమక్కుమనడం బాగుంది. ఆలోచింపజేసే ఈ షార్ట్‌ఫిల్మ్‌ చూడదగ్గది.

నీదీ నాదీ ఒకే కథ – ట్రైలర్‌
నిడివి: 2.58
హిట్స్‌: 4,39,769 

తల్లిదండ్రులు నిర్థారించిన మూసలో ఇమడలేక సతమతమయ్యే పిల్లల మానసిక వ్యథను ప్రధానాంశంగా తీసుకొని వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’. చదువు రాని వాళ్లు, లేదా మంచి మార్కులు తెచ్చుకోనివాళ్లు, లేదా కొన్నిసార్లు మంచి ర్యాంకులు సాధించినవాళ్లు కూడా దేనికి పనికిరారనే విధంగా మన విద్యావ్యవస్థ, మన సామాజిక దృష్టికోణం స్థిరపడిపోయాయి. ప్రతి ఒక్కరికీ తనదైన ప్రతిభతో రాణించే హక్కు ఉంది. దేనిలో రాణిస్తారో దానిని ఎంచుకునే హక్కు కూడా ఉంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోవడం వల్లే పిల్లలు ఇళ్ల నుంచి పారిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. ఈ అంశాలు చర్చకు పెట్టే ఈ సినిమా ట్రైలర్‌ మంచి హిట్స్‌ సాధిస్తోంది. హీరో శ్రీవేణుకు ఈ సినిమా మంచి ఫలితాన్నే ఇస్తుందని ఆశిద్దాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top