
యుట్యూబ్ హిట్స్
ఇలియానాతో కలిసి పాకిస్తానీ యువ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడి...
అతిఫ్ అస్లామ్ : పెహ్లీ దఫా వీడియో సాంగ్
నిడివి : 4 ని. 42 సె. ::: హిట్స్ : 56,46,334
ఇలియానాతో కలిసి పాకిస్తానీ యువ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడి, విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘పెహ్లీ దఫా’.. ఈవారం యూట్యూబ్ ట్రెండ్స్‌లో 3వ స్థానంలో ఉంది. 2011లో ‘బోల్’ అనే పాకిస్తానీ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన అతిఫ్ ఇప్పటి వరకు అనేక ‘చార్ట్–టాపింగ్’ సాంగ్స్‌ని రికార్డ్ చేశారు. ఇక ఇలియానా! మన బాలీవుడ్ అమ్మాయి. అప్పుడప్పుడూ తెలుగమ్మాయి. ఈ ప్రైవేట్ ప్రేమగీతంలో కాస్త బొద్దుగా కనిపించారు. షకీల్ సొహెయిల్ లిరిక్స్ రాసి, షిరాజ్ ఉప్పల్ మ్యూజిక్ అందించిన ఈ వీడియోను టీ–సిరీస్ అప్‌లోడ్ చేసింది. ‘నా హృదయం తొలిసారిగా ఊసులు చెబుతోంది. నా కోరికల్లో తొలిసారిగా వేగం కనిపిస్తోంది. తొలిసారిగా నేను నా స్పృహల్ని కోల్పోయాను. నేను ప్రేమను కనిపెట్టాను. అదొక కొత్త అనుభూతి’ అని పాట ప్రారంభం అవుతుంది. ఫస్ట్ డేట్‌లో ఒక కుర్రాడు వ్యక్తం చేసే ప్రేమభావనల మధురగీతం ఇది. వీడియో టేకింగ్ కలర్‌ఫుల్‌గా ఉంది. రెడ్ గౌన్‌లో ఇలియానా అంతకన్నా కలర్‌ఫుల్‌గా ఉన్నారు. వీధులు కూడా ఇంటిని అలంకరించినట్లుగా వర్ణమయంగా ఉండడం ఈ సాంగ్‌లోని స్పెషల్ ఎట్రాక్షన్.
రంగూన్ : ట్రైలర్
నిడివి : 3 ని. 20 సె. ::: హిట్స్ : 67,58,806
అది 1944. రెండో ప్రపంచ యుద్ధ జ్వాలలు యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. భారత్ బ్రిటిష్ పాలన కింద ఉంది. స్వాతంత్య్ర సాధనకు దగ్గరగా వచ్చేసింది. సమరం శిఖరస్థాయికి చేరుకుంది. మనకు తుపాకులు కావాలి. మందుగుండు సామగ్రి కావాలి. యుద్ధట్యాంకులు కావాలి. రవాణా వాహనాలు కావాలి. వాటన్నిటికీ డబ్బు కావాలి! డబ్బును సమకూర్చుకోగలం. కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ముంబై నుంచి. ముంబైలో జూలియా షోల నుంచి వస్తుంది. జూలియా బాలీవుడ్ నటి. అంత ఉద్వేగభరిత వాతావరణంలోనూ ప్రపంచం జూలియాని చూడాలని ఆశపడుతోంది. రెండు మూడు షోలు వేస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయి. ‘నేను బర్మా వెళ్లను’ అని పేపర్ విసిరికొట్టింది మిస్ జూలియా. ‘‘ఇది యుద్ధ సమయం కిడ్డూ. జర్మనీ, హిట్లర్.. అని నచ్చ చెబుతున్నాడు సార్జంట్. ‘హిట్లర్ హిందీ సినిమాలు చూస్తాడా?’ అని అడిగింది జూలియా. సార్జంట్ నవ్వాడు. జూలియా బర్మా బయల్దేరింది. తర్వాత ఏమైంది? ప్రయాణంలో ఏమైంది, వెళ్లాక ఏమైంది. ఏమౌతుంది? ఆమె లవ్‌లో పడుతుంది! ఎవరితో? సార్జంట్‌తోనా? తన పర్సనల్ సెక్యూరిటీ ఇన్‌చార్జితోనా? రెండు రోజుల క్రితమే ట్రైలర్ విడుదలైంది. సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతోంది. జూలియా కంగనా రౌత్. మిగతా ఇద్దరు లీడ్ యాక్టర్లు సయీఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్. డైరెక్షన్ విశాల్ భరద్వాజ్. ట్రైలర్‌లో యుద్ధం కన్నా కూడా ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. బాలీవుడ్ హిట్ ఫార్ములా!
రింగ్స్ : కొత్త ట్రైలర్
నిడివి : 1 ని. 1 సె. ::: హిట్స్ : 41,14,707
‘ఫస్ట్ యు వాచ్ ఇట్. దెన్ యు డై..’ అనే పోస్టర్‌తో పబ్లిసిటీ మొదలు పెట్టిన ‘రింగ్స్’ చిత్ర నిర్మాతలు ట్రైలర్‌ల మీద ట్రైలర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ తాజా ట్రైలర్ కూడా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది! ఫిబ్రవరి 3న రిలీజ్‌కు సిద్ధం అవుతున్న ఈ హాలీవుడ్ సూపర్ నేచురల్ సైకో హారర్ చిత్రం చూసి ప్రేక్షకులు భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలున్నాయని ట్రైలర్ చూసి చెప్పేయొచ్చు. ఒక వీడియో ఉంటుంది. దానిని చూసినవారు, చూసిన ఏడు రోజుల్లోగా చనిపోతారన్న వదంతి మొదలవుతుంది. ఆ రహస్యం ఏమిటో శోధించడానికి హాల్ట్ అనే అతడు బయల్దేరతాడు. అతడిని కాపాడడానికి అతడి గర్ల్‌ఫ్రెండ్ ప్రాణత్యాగానికి ఒడిగడుతుంది. చివరికి ఏం జరుగుతుందన్నది సినిమాలో చూడొచ్చు... వీడియోను చూశాక కూడా సినిమాను చూసేందుకు మీరు తెగిస్తే.