పార్లమెంటులో ఫస్టు క్లాసు లీడర్స్‌

Youngest MP In India Is This Tribal Woman From Odisha - Sakshi

కొన్ని అద్భుతాలు అంతే. హడావుడి లేకుండా, హంగామా చేయకుండాచరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి. తాజాగా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలసమరాంగణంలో రెండు అద్భుతాలు జరిగాయి. గిరిజన తెగకు చెందిన ఇద్దరుయువతులు సరికొత్త చరిత్ర లిఖించారు. దేశం యావత్తు తమవైపుచూసేలా చేశారు. ఒకరు చంద్రాణి ముర్ము.  ఇంకొకరు గొడ్డేటి మాధవి.

కియోంజహర్‌లోని తికర్‌గుమురా గ్రామానికి చెందిన చంద్రాణి ముర్ము.. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌ లేదా ఒడిశాలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దొరక్కపోతే ప్రైవేటు కంపెనీలో మెకానికల్‌ ఇంజనీర్‌ ఉద్యోగం సంపాదించాలనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆమె జీవితం మలుపు తిరిగింది. జాబ్‌ వస్తే చాలనుకున్న ఆమె పాతికేళ్ల ప్రాయంలోనే ఏకంగా లోక్‌సభ ఎంపీగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘‘ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో నామినేషన్‌ వేయాల్సివచ్చింది. రాజకీయాల్లోకి వస్తానని, ఎంపీ అవుతానని కలలో కూడా అనుకోలేదు’’ అని చంద్రాణి ఉద్వేగంగా చెప్పారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కియోంజహర్‌ నియోజకవర్గం(ఎస్టీ) నుంచి బిజూ జనతాదళ్‌ (బీజేడీ) తరపున పోటీ చేసిన చంద్రాణి బీజేపీ నాయకుడు అనంత నాయక్‌ను 66,203 ఓట్ల ఆధిక్యంతో ఓడించి ఔరా అనిపించారు. 25 ఏళ్ల 11 నెలల 8 రోజుల ప్రాయంలో (ఎన్నికలు ఫలితాలు వెలువడిన మే 23 నాటికి) ఎంపీగా ఎన్నికై సరికొత్త రికార్డు లిఖించారు. జూన్‌ 16న 26వ పడిలోకి అడుగు పెట్టడానికి ముందే లోక్‌సభ ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా మనవడు దుష్యంత్‌ చౌహన్‌ పేరిట ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 26 ఏళ్ల 13 రోజుల వయస్సులో హిస్సార్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై అతిపిన్న వయస్కుడిగా దుష్యంత్‌ ఘనత సాధించారు. తాజా విజయంతో ఈ రికార్డును చంద్రాణి అధిగమించారు.

సీఎం ఎంపిక చేసిన అమ్మాయి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావించిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌ ఉండి, ప్రజా జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నవారి గురించి వెతుకుతుండగా చంద్రాణి ఆయన దృష్టిలో పడ్డారు. మరో ఆలోచన లేకుండా ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికి ఆమె ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కేవలం రెండేళ్లు మాత్రమే అయింది. 1993, జూన్‌ 16న జన్మించిన చంద్రాణి.. కియోంజహర్‌లోని ఎన్‌ఎస్‌ పోలీస్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్య, భువనేశ్వర్‌లోని నాయుడు క్లాసెస్‌ విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. శిక్షా ’ఓ’ అనుసాధన్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా సాధించారు.

చంద్రాణి తండ్రి సంజీవ్‌ ముర్ము ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి ఊర్వశి సోరేన్‌ గృహిణి.ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే చంద్రాణికి వ్యతిరేకంగా ప్రత్యర్థుల విష ప్రచారం మొదలైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అపఖ్యాతి పాల్జేసేందుకు కుట్రలు చేయడంతో ఒక దశలో ఆమె చాలా బాధపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా విజయం సాధించడంతో చివరకు న్యాయం గెలిచిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.గొడ్డేటి మాధవి.. తెలుగు గడ్డపై తిరుగులేని విజయం సాధించి సమకాలిన రాజకీయ చరిత్రలో కొత్త పేజీని లిఖించారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా గిరి పుత్రిక మాధవి ఖ్యాతి దక్కించుకున్నారు.

నేర్చుకుని నిరూపించుకుంటా...
‘‘ఇక రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. వయసుతో సంబంధం లేకుండా పార్లమెంట్‌ నా గళం బలంగా విన్పిపించడానికి ప్రయత్నిస్తాను. సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకుని లోక్‌సభ సభ్యురాలిగా నన్ను నేను నిరూపించుకుంటాను. నామినేషన్‌ వేయడానికి కొద్ది రోజుల ముందే నన్ను ఎంపిక చేయడంతో నియోజకవర్గం మొత్తం తిరగలేకపోయాను. నిజం చెప్పాలంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన లేదు. ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించి నా నియోజకవర్గం గురించి తెలుసుకోవడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం.’’  
– చంద్రాణి, ఒడిశా ఎంపీ

మురిసిన తెలుగు గడ్డ
గొడ్డేటి మాధవి..
తెలుగు గడ్డపై తిరుగులేని విజయం సాధించి సమకాలిన రాజకీయ చరిత్రలో కొత్త పేజీని లిఖించారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా గిరి పుత్రిక మాధవి ఖ్యాతి దక్కించుకున్నారు. అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగి రాజకీయ ఉద్ధండుడైన వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ను 2.25 లక్షల భారీ మెజార్టీతో మట్టికరిపించారు. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా 26 ఏళ్ల ప్రాయంలోనే ఎంపీగా ఎన్నికై తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం మాధవి స్వగ్రామం. తల్లి చెల్లయమ్మ ఎస్జీటీగా పనిచేస్తూ కొయ్యూరు మండలంలోనే నివాసం ఉంటున్నారు. మాధవి తండ్రి గొడ్డేటి దేముడు కమ్యూనిస్టు నాయకుడు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తులు కూడబెట్టుకోని నిజాయితీపరుడు. 1992, జూన్‌ 18న మాధవి జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరులు. బీఎస్సీ బీపీడీ అయ్యాక ఆమె గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పీడీగా పనిచేశారు. 2018 అక్టోబర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేశారు.

మలుపు తిప్పిన ఘటన
మాధవి తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైతే పాడేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎంత ప్రాధేయపడినా ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు ఆ చిన్నారికి వైద్యం అందించలేదు. ఐటీడీఏకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పదవిలో ఉంటే తప్ప సమస్యలు పరిష్కారం కావని అర్థం కావడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. మాధవి పోరాట పటిమను గుర్తించిన వైఎస్‌ జగన్‌ ఆమెకు అరకు లోక్‌సభ టికెట్‌ ఇచ్చి  ప్రోత్సహించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విజయం సాధించారు.

- పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top