మీ ఇంటికి మీరే ఆర్థికమంత్రి! | you are the financial minister for your home | Sakshi
Sakshi News home page

మీ ఇంటికి మీరే ఆర్థికమంత్రి!

Sep 23 2014 11:20 PM | Updated on Sep 2 2017 1:51 PM

మీ ఇంటికి మీరే ఆర్థికమంత్రి!

మీ ఇంటికి మీరే ఆర్థికమంత్రి!

ప్రతి ఇల్లాలూ ప్రతి నెలా తమ ఆదాయ వ్యయాలను అంచనా వేసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆమెను ఇంటికి ఆర్థికమంత్రిలానే భావించాలి మరి.

ఆదాయం
 
ప్రతి ఇల్లాలూ ప్రతి నెలా తమ ఆదాయ వ్యయాలను అంచనా వేసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆమెను ఇంటికి ఆర్థికమంత్రిలానే భావించాలి మరి. ఎవరైనా సరే, ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండకపోతే, అప్పుల పాలు కాక తప్పదు. ఒకవేళ రెండూ బొటాబొటీగా సరిపోయేట్లు ఉన్నా, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు తిప్పలు పడక తప్పదు. అలా కాకుండా ఉండాలంటే ఖర్చుల విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే.
 
మందుల ఖర్చులు: ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ ఈ ఖర్చు తప్పదు. ఆస్పత్రి, మందుల ఖర్చులకోసం ముందుగానే జాగ్రత్త పడకపోతే, తర్వాత ఇబ్బంది పడక తప్పదు. అందుకే ఖర్చు అనిపించినా, ముందుగానే ఆరోగ్యబీమా పాలసీ తీసుకోవడం మంచిది. ఇందుకోసం వెబ్‌సైట్లలో అన్వేషిస్తే, మన బడ్జెట్‌కు, అవసరాలకు సరిపడా పాలసీ దొరక్కపోదు.
 
ఆహార వినోదాలు: చాలామంది పురుష పుంగవులకూ, పిల్లలకూ ఇంటి తిండి కన్నా హోటళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ తినడం అలవాటు. వీకెండ్లలో కుటుంబ సమేతంగా అలా హోటల్‌కెళ్లినప్పుడల్లా ఇలా మన బడ్జెట్‌కు గండి పడుతుంది. ఇలా నాలుగు వారాలు నాలుగు గండ్లు పడితే, ఆదాయంలో పెద్ద అగాథం ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే బయటికెళ్లి తిండి తినడం బాగా తగ్గించాలి. దీన్ని నెలకు ఒకసారికి పరిమితం చేయడం మంచిది. వైవిధ్యభరితమైన వంటకాలను తయారు చేయడం అలవాటు చేసుకుంటే వంట చెయ్యడమూ బోర్ అనిపించదు. పిల్లలకూ, శ్రీవారికీ బయటి తిండ్ల మీదికి దృష్టి మళ్లకుండా ఉంటుంది. కడుపు ఖాళీగా ఉంటే పిల్లలకు కనిపించినవన్నీ తినాలనిపిస్తుంది. అందుకే హోటళ్లకు వెళ్లేముందు ఇంట్లోనే కొద్దిగా తినేసి వెళ్లడం ఉత్తమం.
 
విండోషాపింగ్ వెరీ గుడ్... కొందరు పనిగట్టుకుని షాపింగ్‌కు వె ళ్తే, ఇంకొందరు టైమ్‌పాస్ కోసం షాపింగ్ చేస్తుంటారు. ఈ రెండూ ప్రమాదకరమైన అలవాట్లే. షాపింగ్‌ను ఎప్పుడూ ఒకే షాప్‌కి పరిమితం చెయ్యకూడదు. రెండు మూడు షాపులకు వెళ్లి, ధరలు ఎక్కడ తక్కువో, ఎక్కడ నాణ్యమైన వస్తువులు దొరుకుతాయో విచారించడం మంచిది. అందుకోసం విండోషాపింగ్ ఉత్తమం.
 
క్రెడిట్ కార్డులు క్యారీ చెయ్యద్దు: సాధారణంగా డబ్బుతో కొంటే మనకు ఎక్కువ ఖర్చు చేస్తున్నామనిపిస్తుంది. అదే క్రెడిట్ కార్డుతో అయితే చిన్న సంతకంతో వేలకొద్దీ బిల్లు అలవోకగా చెల్లించేందుకు సిద్ధపడతాం. అందుకే సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డును దగ్గర పెట్టుకోకూడదు. ఒకవేళ తీసుకెళ్లినా, వెంటనే బయటకు తీసేలా పెట్టుకోకూడదు. ఏ బ్యాగ్‌లోనో పెట్టుకుంటే అది తీసేందుకు కొంచెం ఆలోచిస్తాం. ఈ సూత్రం స్త్రీ, పురుషులిద్దరికీ వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement