స్త్రీలోక సంచారం

Womens empowerment:no women minister from ts govt - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

సమాజంలో బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడి పదవిలోకి వచ్చిన కె.సి.ఆర్‌., ముఖ్యమంత్రి అయ్యాక తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటివ్వకుండా తిరిగి తనే వివక్షను పాటిస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్‌) స్పందించిన హైదరాబాద్‌ హైకోర్టు.. మంత్రివర్గంలో తప్పనిసరిగా మహిళలకు స్థానం కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కనుక మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ని కొట్టివేసింది. అధికార టి.ఆర్‌.ఎస్‌. పార్టీ  మహిళా ఎమ్మెల్యేలలో దాదాపుగా అంతా ఎస్సీలు, ఎస్టీలు కావడం వల్లనే కె.సి.ఆర్‌. వారిని తన మంత్రివర్గంలోకి రానివ్వలేదని వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన దారా శ్రీశైలం అనే న్యాయవాది వేసిన ‘పిల్‌’పై కోర్టు ఈ విధంగా స్పందించింది. 

అమెరికా ప్రతినిధుల సభకు (దిగువ సభకు) నవంబరులో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో 180 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతుండగా, గత జూన్‌లో ‘సెనెట్‌’కు (ఎగువ సభకు) జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 42 మంది మహిళలు (24 మంది డెమోక్రాట్‌లు, 18 మంది రిపబ్లికన్‌లు) బరిలో నిలిచారని ‘సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ఉమెన్‌ పాలిటిక్స్‌ (సి.ఎ.డబ్లు్య.పి) వెల్లడించింది. రెండేళ్ల కాలపరిమితితో 435 మంది సభ్యులుండే అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లోని దిగువస¿¶ కు, ఆరేళ్ల కాలపరిమితితో 100 మంది సభ్యులుండే ఎగువసభకు ప్రతి ‘సరి సంవత్సరం’లో ఖాళీల భర్తీకి ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతుంటాయి. 

పన్నెండేళ్లుగా సహజీవనం చేసి, 2014లో పెళ్లి చేసుకుని, 2016లో విడిపోయిన హాలీవుడ్‌ అందాల జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్‌ పిట్‌.. కోర్టు కేసుల పరిష్కారం కోసం ఇప్పుడు అయిష్టంగా ఒకరిముఖం ఒకరు చూసుకోవలసి వస్తోంది! దత్తత తీసుకున్న పిల్లలు, సొంత పిల్లలు కలిపి మొత్తం ఆరుమందిలో కొందరి పోషణ, సంరక్షణ కోసం ఒప్పందం ప్రకారం బ్రాడ్‌ పిట్‌ తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వడం లేదని ఏంజెలీనా కోర్టుకు వెళ్లగా, విడిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఏంజెలీనాకు తను అనేక మిలియన్‌ డాలర్లను చెల్లించినట్లు బ్రాడ్‌ పిట్‌ చెబుతున్నారు.

లైంగిక అకృత్యాల రాక్షసుడు హార్వీ వైన్‌స్టీన్‌ను తను పూర్తిగా సమర్థించనప్పటికీ, ‘మీటూ’ ఉద్యమానికి మాత్రం మద్దతు ఇవ్వలేకపోతున్నానని ప్రముఖ హాలీవుడ్‌ నటి ‘లేలో’ (లిండ్సే లోహన్‌) సంచలనాత్మక ప్రకటన చేశారు. ‘నేనూ బాధితురాలినే’ అని బయటికి రావడం మహిళల బలాన్ని కాక, బలహీనతను మాత్రమే బయటపెడుతోందని ఆమె అన్నారు.

బి.జె.పి మగవాళ్ల పార్టీ మాత్రమేనని, మహిళల్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనీ రాహుల్‌ ఆరోపించడం బి.జె.పి.లోని మహిళల్ని అవమానించడమేనని అంటూ.. రక్షణమంత్రి మహిళ కాదా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహిళ కాదా, లోక్‌సభ స్పీకర్‌ మహిళ కాదా అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ.. రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ‘మహిళా అధికార్‌ సమ్మేళన్‌’లో రాహుల్‌ చేసిన పై ఆరోపణలను తిప్పికొట్టే సందర్భంలో.. ‘తెలియకుండా మాట్లాడ్డం మానాలని’ కూడా రాహుల్‌కు ఆమె హితవు చెప్పారు. 

37 ఏళ్ల వయసులో హత్యకు గురైన పార్లమెంటు సభ్యురాలు, న్యాయవాది, ‘బందిపోటు రాణి’ అయిన ఫూలన్‌ దేవి బర్త్‌ డే ఇవాళ. 

స్టార్‌ చెఫ్‌ పద్మాలక్ష్మి తన ఎనిమిదేళ్ల కూతురు కృష్ణ, ఆ పాప తండ్రి ఆడమ్‌ డెల్‌తో కలిసి ప్రస్తుతం ఇటలీలో విహరిస్తున్నారు. అమెరికన్‌ రియాలిటీ షో ‘టాప్‌ చెఫ్‌’ ఫినాలీ ఎపిసోడ్‌ చిత్రీకరణ నుంచి స్వల్ప విరామం తీసుకోవడంతో దొరికిన వ్యవధిలో పద్మాలక్ష్మి చక్కగా టూర్‌లు కొడుతూ, ఇష్టమైన ఆహారం తింటూ, కూతురితో, పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న ఆడమ్‌ డెల్‌తో కుటుంబ అనుబంధాల్లోని మాధుర్యాన్ని గ్రోలుతున్నట్లు రెండు వారాల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది.

నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్నార్సీ)లో పేరు లేని నలభై లక్షల మంది ‘అస్సామీ’లను తరలించే ప్రయత్నాలు మొదలైతే కనుక మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కరువు అయ్యే ప్రమాదం ఉండొచ్చని అంతర్జాతీయ సామాజిక, పాలనా విధానాల పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతిమ జాబితాను సిద్ధం చేసి, రిజిస్టరులో పేరు లేని పౌరుల తరలింపునకు తొందరపడితే అస్సాంలో కల్లోల పరిస్థితులు తలెత్తవచ్చునని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top