స్త్రీలోక సంచారం

Womens empowerment:  Supreme Court quashes FIR against Malayalam actress Priya Varrier - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు అనుబంధ సంస్థ ‘ఐ.సి.ఐ.సి.ఐ. సెక్యూరిటీస్‌’ డైరెక్టర్స్‌ బోర్డులోకి ఆ బ్యాంకు ఎం.డి., సి.ఇ.వో. అయిన చందా కొచ్చర్‌ను తిరిగి తీసుకోవడం (రీ–అపాయింట్‌మెంట్‌) పై విమర్శలు వస్తున్నాయి. వీడియోకాన్‌ గ్రూపుతో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్‌ ‘ఇచ్చిపుచ్చుకున్న’ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిర్థారించేందుకు ఈ ఏడాది జూన్‌లో జస్టిస్‌ బి.ఎన్‌.కృష్ణను బ్యాంకు నియమించుకున్న నాటి నుంచీ చందా కొచ్చర్‌ సెలవులో ఉండగా, ఇప్పుడు ఆమెను మళ్లీ బోర్డులోకి తీసుకోవడం వల్ల బి.ఎన్‌.కృష్ణ విచారణను తనకు అనుకూలంగా ఆమె ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని బోర్డులోనే కొందరు సభ్యులు బహిరంగంగానే ఆమె çపునర్నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ప్రసిద్ధ పౌర విమానయాన సంస్థ ‘గోఎయిర్‌’లో పైలెట్‌గా చేరబోతున్న 31 ఏళ్ల ఇమ్రాన్‌ హబీబ్‌.. కశ్మీర్‌లో తొలి ముస్లిం మహిళా పైలెట్‌గా రికార్డు సృష్టించబోతున్నారు. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన హబీబ్,, డెహ్రాడూన్‌లో ఫారెస్ట్రీ డిగ్రీ, ఫారెస్ట్రీలోనే శ్రీనగర్‌లోని షేర్‌–ఇ–కశ్మీర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి.. తన చిన్ననాటి కల అయిన ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి, 2016లో యు.ఎస్‌. ఫ్లయిట్‌ స్కూల్లో చేరి, అక్కడ ‘260 ఫ్లయింగ్‌ అవర్స్‌’ పూర్తి చేసి, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో కమర్షియల్‌ పైలెట్‌ కోర్సు చేసి పాసై, అక్టోబర్‌లో విమానం నడపబోతున్నారు.

యువతార జెన్నిఫర్‌ లారెన్స్‌తో పాటు, కిర్‌స్టెన్‌ డన్‌స్ట్, కేప్‌ ఆప్టన్‌ వంటి అనేకమంది హాలీవుడ్‌ నటీమణుల నగ్నచిత్రాలను సేకరించి, నెట్‌లో అప్‌లోడ్‌ చేసిన సెలబ్రిటీ హాకర్‌.. జార్జి గెరఫానోకు బ్రిడ్జిపోర్ట్‌లోని ఫెడరల్‌ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. విడుదల తర్వాత కూడా గెరఫానో మీద మూడేళ్ల నిఘాకు అదేశించిన కోర్టు.. శిక్షకాలం ముగిశాక అతడు కనీసం 60 గంటలు కమ్యూనిటీ సేవ చేయాలని కూడా ఉత్తర్వు్యలు జారీ చేసింది.

ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌లో 200 మీటర్ల రేస్‌లో రజిత పతకం సాధించిన స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అదనంగా మరో కోటీ యాభై లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. అంతకు ముందు ఈ ఏషియన్‌ గేమ్స్‌లోనే 100 మీటర్ల పరుగు పందెంలో ద్యుతీ రజితం గెలిచినప్పుడు కోటీ యాభై లక్షల నగదు బహుమతిని ప్రకటించిన పట్నాయక్‌.. ద్యుతీ టోక్యో ఒలింపిక్స్‌కి సిద్ధమవడానికి అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.

మలయాళీ చిత్రం నటించిన ప్రియా ప్రకాశ్‌ వారియన్‌ అందులోని ‘ఒరు అధార్‌ లవ్‌’లోని ఒక పాటలో కన్నుగీటడంపై కేసు వేసిన వారిని తప్పు పట్టిన సుప్రీం కోర్టు.. ప్రియ పైన, ఆ చిత్ర నిర్మాతలపైన దాఖలైన కేసును కొట్టి వేసింది. ‘‘సినిమాలో ఎవరో పాట పాడితే, అందుకు ఎవరో నటిస్తే వారిపై కేసు పెట్టడం తప్ప మీకు ఇంకో పని లేదా?’’ అని ఆ ఎఫ్‌.ఐ.ఆర్‌. వెనుక ఉన్న వ్యక్తుల్ని కోర్టు మందలించింది కూడా.

కంగనా రనౌత్‌ కథానాయికగా నటిస్తున్న ‘మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రం షూటింగ్‌ నుంచి సహ నటుడు సోనూ సూద్‌.. తన తల మీద క్యాప్‌ని విసిరికొట్టి, సెట్స్‌ నుంచి అర్థంతరంగా వెళ్లిపోవడంతో.. అతడికిక ఆ సినిమాలో చోటు లేనట్టేనని తెలుస్తోంది. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూ సూద్‌.. తనను, ఇతర నటులను సెట్స్‌లో కంగనా రనౌత్‌. ఆమె మాటలతో, అహంకారంతో, తలబిరుసుతనంతో పెడుతున్న టార్చర్‌ను భరించలేకపోతున్నాని చెప్పి మరీ వెళ్లిపోవడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు తప్ప, కంగనను తప్పు పట్టే సాహసం చేయలేకపోయారని ముంబై నుంచి వార్తలు వస్తున్నాయి. 

ఇటలీలోని లేక్‌ కామో లో ఈ ఏడాది నవంబరులో తమ పెళ్లిన ప్లాన్‌ చేసుకున్న  దీపికా పడుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌.. పెళ్లి కంటే ముందే, పెళ్లి తర్వాత ముంబైలో ఇచ్చే విలాసవంతమైన రిసెప్షన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరూ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ.. అంతా దీపిక ఇష్ట ప్రకారమే జరుగుతోందని రణ్‌వీర్‌ సింగ్‌ చెబుతున్నారు. 

ప్రముఖ రచయిత్రి, మోడల్, వంట కార్యక్రమాల టీవీ షోల వ్యాఖ్యాత పద్మాలక్ష్మి 48వ పుట్టిన రోజు నేడు. 2004లో ప్రముఖ నవలా రచయిత సల్మాన్‌ రష్దీని వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్న పద్మ.. వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఆడమ్‌ డెల్‌తో, ఐ.ఎం.జి. సిఈవో టెడ్డీ ఫోర్ట్స్‌మన్‌తో కొంతకాలం సహజీవనం చేశారు. ప్రస్తుతం కూతురు కృష్ట థియా (తండ్రి డెల్‌) తో కలిసి ఎక్కువ భాగం యు.ఎస్‌.లోనే గడుపుతూ టీవీ రియాల్టీ షోల నిర్వహణలో భాగంగా ప్రపంచమంతా పర్యటిస్తున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top