స్త్రీలోక సంచారం

Womens empowerment: Gauri Lankesh Murder Investigation In Final Stage - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

హైదరాబాద్‌లో ప్రతి నెలా కనీసం 10 గృహహింస కేసులు నమోదు అవుతుండగా వాటిల్లో ఎక్కువ భాగం.. భర్త మద్యపాన వ్యసనం కారణంగా జరుగుతున్నవేనని, 2006 నుంచి ఇప్పటి వరకు 3,000 గృహ హింస కేసులు నమోదు కాగా అనధికారిక లెక్కల ప్రకారం ఇటువంటి ఘటనలు ఇంతకు రెట్టింపుగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎన్జీవోలకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ‘భరోసా’ కేంద్రాల అధికారులు వెల్లడించారు.  స్త్రీలపై జరుగుతున్న ఈ గృహహింసకు మద్యపాన వ్యసనం తర్వాత వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం ఆశించడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

హరియాణలో బాగా వెనుకబడిన జిల్లాల్లో ఒకటై, అత్యధికంగా ముస్లింలు ఉండే మేవాత్‌లో బడి మానేస్తున్న బాలికల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాక, ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్న బషీరుద్దీన్‌ ఖాన్‌ అనే 54 ఏళ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని టీచర్స్‌ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ప్రశంసించారు. మేవాత్‌ జిల్లాలోని పాఠశాలల్లో ఏటా కనీసం 20 శాతం వరకైనా ఉంటున్న బాలికల ‘డ్రాపవుట్స్‌’ని బషీరుద్దీన్‌ తగ్గించడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. 

రియో డి జెనీరో లోని నేషనల్‌ మ్యూజియంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో 12 వేల ఏళ్ల నాటి బ్రెజిల్‌ మహిళ ‘లూజీయా’ పుర్రెను కోల్పోవడం అత్యంత విషాదకరమైన ఘటన అంటూ బ్రెజిల్‌ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. రెండు కోట్లకు పైగా విలువైన పురావస్తు విశేషాలు భద్రపరిచి ఉన్న ఈ మ్యూజియంలో అన్నిటికన్నా అమూల్యమైనదిగా పరిగణన పొందుతున్న ‘తొలి బ్రెజిల్‌ మనిషి’.. ‘లూజియా’ 1970లో బ్రెజిల్‌ పురావస్తు తవ్వకాల్లో బయటపడింది.

యు.ఎస్‌. సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహిళ తొలిసారిగా వోటు వేసిన రోజు ఇది! వయోమింగ్‌ రాష్ట్రంలోని లరామీలో ఉంటున్న లుయీజా స్వెయిన్‌ (1801–1880) అనే మహిళ తన 69 ఏళ్ల వయసులో 1870 సెప్టెంబర్‌ 6న ఎప్పటిలా ఉదయాన్నే నిద్ర లేచి, ఏప్రాన్‌ కట్టుకుని, తలకు బానెట్‌ (టోపీ), ఒంటిపై షాల్‌ ధరించి, పెరుగు కొనేందుకు చేత్తో చిన్న సత్తు బకెట్‌లాంటి పాత్రను పట్టుకుని బజారులోకి వచ్చినప్పుడు.. అప్పటికింకా పోలింగ్‌ సెంటర్‌ను అధికారికంగా తెరవనప్పటికీ, అక్కడ ఉన్న పోలింగ్‌ ఏజెంట్లు ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆమెతో ఓటు వేయించగా, ఆ మర్నాడు స్థానిక వార్తా పత్రిక ఒకటి.. ‘క్రైస్తవ విశ్వాసిగా కనిపిస్తున్న వియనశీలత గల ఓ తెల్ల జుట్టు గృహిణి’.. అమెరికన్‌ చరిత్రలోనే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళగా నేడు నిలిచారు’ అని ఆమెను కీర్తించింది. 

ప్రపంచంలోనే అత్యధిక వయసు గల దంపతులుగా మసావో మత్సుమోటో (108), ఆయన భార్య మియాకో (100) తాజాగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించారు. 1935 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంటను.. మీ 80 ఏళ్ల అన్యోన్య దాంపత్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని అడిగినప్పుడు.. ‘అది నా సహనమే’ అని సంతోషంతో ఉబికిన కళ్లతో సమాధానం చెప్పిన మియాకో వైపు ఆమె భర్త ‘అవును’ అన్నట్లుగా కృతజ్ఞతతో చూసినట్లు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు!

అమెరికన్‌ రొమాటిక్‌ కామెడీ డ్రామా టెలీ సీరియల్‌  ‘సెక్స్‌ అండ్‌ ది సిటీ’ (1998–2008) తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం న్యూయార్క్‌ గవర్నర్‌ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హాలీవుడ్‌ నటి సింథియా నిక్సన్‌ (52).. తను లెస్బియన్‌ (ఆడ–ఆడ) అని చెప్పుకోడానికి కన్నా, హోమోసెక్సువల్‌ (మగ–మగ) అని చెప్పుకోడానికే ఇష్టపడతానని అన్నారు. ఆరేళ్ల క్రితం తనను ౖ»ñ సెక్సువల్‌(ఆడ–మగ)æగా ప్రకటించుకున్న సింథియా ఇప్పుడిలా మనసు మార్చుకోడానికి ప్రత్యేక కారణాలేవీ కనిపించని మాట అటుంచితే, మొదట డ్యానీ మోజెస్‌ అనే ఉపాధ్యాయుడితో దీర్ఘకాలం కలిసి ఉండి, అతడితో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత 2012లో క్రిస్టీన్‌ మారినోని అనే అతడిని ప్రేమించి, డ్యానీ నుంచి వేరుపడ్డారు. 

అతివాద జర్నలిస్టుగా పేరుమోసిన గౌరీ లంకేశ్‌ గత ఏడాది సెప్టెంబర్‌ 5న తన ఇంట్లో ఉండగా జరిగిన దుండగుల కాల్పుల్లో ఒంట్లోకి నాలుగు బులెట్‌లు దూసుకుపోయి మరణించిన ఏడాది కాలానికి.. కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు, స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) అధికారులు కలిసి నేరస్తుడిని పట్టుకోగలిగారు. పరశురామ్‌ వాగ్మారే అనే వ్యక్తి ఆమెను అతి సమీపంలోంచి కాల్చిచంపాడని నిర్థారించిన ‘సిట్‌’.. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసింది.

ఇటీవలే నిశ్చితార్థం అయిన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్‌ నటుడు నిక్‌ జోనాస్‌.. యు.ఎస్‌.ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్‌ ఆట చూసేందు వెళ్లడం, వారి వెంట నిక్‌ సోదరుడు, ఆ సోదరుడి గర్ల్‌ ఫ్రెండ్, వారితో పాటు ప్రియాంక తల్లి మధూ చోప్రా ఉండటం ఆహ్లాదకరమైన ఓ విశేష వార్తాంశం అయింది. ప్రియాంక, నిక్‌ల పెళ్లి ఇప్పుడా అప్పుడా, ఇక్కడా అక్కడా.. అని మీడియా అంచనాలు వేస్తుండగా.. ‘ఎక్కడైనా, ఏ క్షణమైనా’ అని ప్రియాంక తల్లి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top