స్త్రీలోక సంచారం | Women empowerment:Saudi Woman Not Allowed To Marry Man For Playing Musical Instrument | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Oct 4 2018 12:12 AM | Updated on Oct 4 2018 10:17 AM

Women empowerment:Saudi Woman Not Allowed To Marry Man For Playing Musical Instrument - Sakshi

పదహారేళ్ల బాలుడు తన 13 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకున్నాడు. దానినెవరో వీడియో తీశారు.

సౌదీ అరేబియాలో స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అరేబియా రాజ్యపు నిబంధనలివి. ఈ నిబంధనలను అతిక్రమించి ఒక సంగీతకారుడిని ప్రేమించి, అతడితో పెళ్లికోసం కోర్టుకు వెళ్లిన ఒక మహిళ చివరికి ఆ న్యాయ పోరాటంలో ఓడిపోయింది. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో వాద్యాలపై సంగీతం పలికించే వారిని మతపరంగా తక్కువగా చూస్తారు. అలాంటి ‘తక్కువ’ యువకుడిని ఈ యువతి ప్రేమించడం రాజ్య నిబంధనలకు విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది. సౌదీ రాజధాని రియాద్‌కి ఉత్తరాన ఉన్న ఖస్సిమ్‌ శుద్ధ సంప్రదాయ ప్రాంతం. రెండేళ్ల క్రితం.. అక్కడి ఒక బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న 38 ఏళ్ల యువతిని ప్రేమించిన ‘లూట్‌’ (గిటార్‌ను పోలి ఉంటుంది) వాద్యకారుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ యువతి కూడా అందుకు ఒప్పుకుంది కానీ, ఆమె తల్లిదండ్రులు సమ్మతించలేదు. ‘‘మతాచారం ప్రకారం అతడు నీకు తగినవాడు కాదు’’ అని పెళ్లికి తిరస్కరించారు. ఆమె కోర్టుకు వెళ్లింది. అతడిని పెళ్లిచేసుకోడానికి న్యాయపరమైన అనుమతిని ఇమ్మని కోరింది. దీనిపై రెండేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు... ఆమె తల్లిదండ్రుల నిర్ణయాన్నే సమర్థించింది. ‘‘ఆ సంగీతం వాయించేవాడు నీతో పెళ్లికి అనర్హుడు’’ అని తీర్పు చెప్పింది. ఇక ఆమె ప్రియుడు.. తన ‘లూట్‌’పై విషాద గీతాలను ఆలపించుకుంటూ తిరగడం తప్ప వేరే మార్గం లేక దిగాలు పడిపోయాడు. ఆ యువతి మాత్రం సౌదీ ఫెమినిస్టు సౌఆద్‌ అల్‌షమ్మరీ మద్దతు కోసం చూస్తోంది.

టర్కీలో పదహారేళ్ల బాలుడు తన 13 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకున్నాడు. దానినెవరో వీడియో తీశారు. ఆ వీడియోను ఎవరో నెట్‌లో పోస్ట్‌ చేశారు. దాన్ని స్కూల్‌ టీచర్లు చూశారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అభం శుభం తెలియని పిల్లని ముద్దుపెట్టుకుంటాడా అని స్కూలు యాజమాన్యం స్కూలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ బాలుడిపై కేసు నమోదు చేశారు. పదిహేనేళ్ల లోపు బాలికల్ని ముద్దు పెట్టుకోవడం టర్కీలో నేరం కనుక ఆ స్కూలు ఉన్న అంతల్య ప్రావిన్సులోని కోర్టు.. ఆ వీడియోను తెప్పించి.. నేరం జరిగినట్లు రూఢీ చేసుకుని ఆ పిల్లవాడికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు.. ఆ వీడియో తీసిన బాలుడినీ, దానిని షేర్‌ చేసిన బాలుడినీ, ఇంకా ఆ క్రైమ్‌లో భాగస్వామ్యం కలిగిన 13–16 ఏళ్ల మధ్య బాలురు ఐదురురిపైన కూడా స్కూలు పోలీసులు కేసు వేశారు కానీ.. వారందరినీ కోర్టు నిర్దోషులుగా వదిలిపెట్టింది. ముద్దు పెట్టుకున్న బాలుడి తరఫున వాదిస్తున్న జుహాల్‌ మెర్వ్‌ ఆజ్ఫిదాన్‌ అనే మహిళా న్యాయవాది ఇప్పుడు పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. టర్కీలో ఇటీవలే స్కూల్‌ పోలీస్‌ వ్యవస్థ ప్రారంభం అయింది. పాఠశాలల్లో పిల్లల మధ్య జరుగుతున్న లైంగిక చొరవలు, చొరబాట్లను అదుపు చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

► స్టార్టప్‌ కంపెనీల్లో మూడింట ఒక వంతుకు పైగా మహిళా ఉద్యోగులే ఉంటున్నారని యు.ఎస్‌. రైడ్‌–షేర్‌ కంపెనీ ‘లిఫ్ట్‌’ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అమెరికా స్టార్టప్‌ కంపెనీల్లో 40 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండగా, ఇండియా స్టార్టప్‌ కంపెనీలలో సగటున 25 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని లిఫ్ట్‌ తెలిపింది. లిఫ్ట్‌ నివేదిక ప్రకారం ఇండియాలో మొత్తం 5000 నుంచి 5200 వరకు స్టార్టప్స్‌ ఉండగా.. వాటి వ్యవస్థాపకులుగా 2015లో 9 శాతం మంది, 2016లో 10 శాతం మంది, 2017లో 11 శాతం మంది చొప్పున మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇండియాలో అనతికాలంలోనే ఆదరణ పొందిన ఐదు స్టార్టప్‌ కంపెనీల్లో మహిళల శాతం ఈ విధంగా ఉంది. 

జొమాటో (ఫుడ్‌ డెలివరీ కంపెనీ)
 
విలువ 200 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 2,500 మందికి పైగా
మహిళా ఉద్యోగులు : 48 శాతం

పేటీఎం (ఈకామర్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌)
విలువ : 1000 కోట్ల డాలర్లు
ఉద్యోగులు : 13,000 మందికి పైగా
మహిళా ఉద్యోగులు : 35 శాతం.

ఓలా (టాక్సీ, ఫుడ్‌ డెలివరీ)
విలువ : 400 కోట్ల డాలర్లు
ఉద్యోగులు : 5,000 మందికి పైగా 
మహిళా ఉద్యోగులు 18 శాతం

ఇన్‌మోబీ (మొబైల్‌ మార్కెటింగ్‌)
విలువ : 100 కోట్ల డాలర్లు 
ఉద్యోగులు : 1,500 మందికి పైగా
మహిళా ఉద్యోగులు : 29 శాతం

రజోర్‌పే (ఆన్‌లైన్‌ పేమెంట్స్‌)
విలువ : 10 కోట్ల డాలర్లు
ఉద్యోగులు : 200 మందికి పైగా
మహిళా ఉద్యోగులు : 25 శాతం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement