స్త్రీలోక సంచారం

Woman's Wandering - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ మేఘనా షాన్‌బాగ్‌ దేశంలోనే ఆరవ మహిళా ఫైటర్‌ పైలట్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. నియామకం తర్వాత చిక్‌మగళూర్‌కు చెందిన ఈ 24 ఏళ్ల డేర్‌ డెవిల్‌ దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌ అవుతారు
బీజింగ్‌లో రాత్రి పది గంటల తర్వాత క్యాబ్‌ డ్రైవర్లు మహిళా ప్రయాణికులను దారి మధ్యలో ఎక్కించుకోడానికి లేదని చైనా ప్రభుత్వం నిబంధన విధించింది. ఇప్పటికే సరిపడినంత మంది మహిళా క్యాబ్‌ డ్రైవర్లు ఉన్నందున ఈ నిబంధన కారణంగా మహిళలు ఇబ్బంది పడకపోవచ్చుని భావిస్తున్నారు
58 ఏళ్ల నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ పదవీ విరమణ చేశారు. ఆమె తన కెరీర్‌ మొత్తంలో 665 రోజులు అంతరిక్షంలో గడిపి.. స్త్రీ, పురుష వ్యోమగాములందరికంటే  ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉన్న ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందారు
భార్యను చంపి, ఇన్సూరెన్స్‌ డబ్బుతో అప్పులన్నీ తీర్చేసి, తన ప్రియురాలితో కొత్త జీవితం ప్రారంభించాలని కుట్ర పన్ని భార్య పారాచ్యూట్‌లోని గ్యాస్‌వాల్వును రెండుసార్లు పాడు చేసిన ఓ బ్రిటిష్‌ మాజీ సైనికుడికి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భర్త కుయుక్తి గురించి తెలియని విక్టోరియా సిలియర్స్‌ 2015లో భూమికి నాలుగు వేల అడుగుల ఎత్తులోంచి ప్యారాచూట్‌ పనిచేయక పొలాల్లో పడిపోయి అదృష్టవశాత్తూ బతికి బట్టకట్టి, భర్తే తన చావుకు పథకం వేశాడని తెలిసి నిర్ఘాంతపోయి, తీవ్ర మనస్తాపంతో ఆయనపై కేసు పెట్టారు
♦  అనాథాశ్రమాలు బాలలకు స్వర్గధామాలేమీ కాదని, ప్రపంచవ్యాప్తంగా బాలలు అనేకచోట్ల ఆశ్రమహింసకు గురవుతున్నారని హ్యారీపోటర్‌ రచయిత్రి జె.కె.రోలింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అనాథ పిల్లలకు ప్రేమానురాగాలను పంచే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించవలసి ఉందని ఆమె అన్నారు
మహిళలు ఒక్కరుగా కాక, కుటుంబ సభ్యులతో కలిసి వెళితే స్టేడియంలలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభ్యంతరమేమీ లేదని ఇరాన్‌ సడలింపు ఇవ్వబోతున్నదని ఆ దేశం మహిళలు ఆశిస్తున్న తరుణంలో అలాంటిదేమీ లేదని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది! అయితే మాల్స్‌లో, కాఫీ హౌస్‌లలో ఏర్పాటు చేసే పెద్ద పెద్ద టీవీలలో అందరితో పాటు మహిళలూ ఫుట్‌బాల్‌ ఆటల్ని వీక్షించేందుకు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా అనుమతించ వచ్చని ఆశిస్తున్నారు
శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఎన్నికల్లో తొలి ఆమెరికన్‌–ఆఫ్రికన్‌ మహిళా మేయర్‌గా 43 ఏళ్ల లండన్‌ బ్రీడ్‌ ఎన్నికయ్యారు. సామాజిక కార్యకర్త అయిన బ్రీడ్‌.. నగరంలో గృహ వసతి కొరతను తగ్గిస్తానని అంటున్నారు
గత ఎనిమిదేళ్లుగా నాంపల్లి కోర్టులో 1500 వరకట్న కేసులు పెండింగులో ఉన్నాయి! విచారణ పూర్తయిన వాటిల్లో కూడా కేవలం పది శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడిందన్న తాజా వార్త న్యాయపోరాటం చేస్తున్న బాధితులకు నిస్పృహ కలిగించే విషయమే

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top