అడవి పందులు, పక్షులను పారదోలే గాలిమర

Wind pigs and birds winding away - Sakshi

అడవి పందులు, ఉడతలు, పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడానికి ఓ కౌలు రైతు గాలిమరను తయారు చేశారు. అంబడిపూడి శేషగిరిరావు బీకాం చదువుకొని జనరేటర్ల డీలర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం షాద్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామం వద్ద భూమిని కౌలుకు తీసుకొని కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేశారు. తొలి ఏడాది అడవి పందులు, ఇతర జంతువులు, ఉడతలు, పక్షుల వల్ల పూర్తిగా పంటను కోల్పోయారు. పంటలను కాపాడుకోవడానికి మార్గాలు అన్వేషించారు. నిరంతరం శబ్దం చేసే గాలిమరను తయారు చేసుకొని తన పొలంలో ఏర్పాటు చేసి విజయం సాధించారు.

90% శాతం మేరకు పంటను రక్షించుకోగలిగానని ఆయన తెలిపారు. 10–15 అడుగుల ఎత్తున సరివి బాదుకు ఈ గాలిమరను అమర్చాలి. గాలికి పంకా తిరుగుతూ స్టీలు పళ్లెంపై నిరంతరం శబ్దం చేస్తూ ఉంటుంది. దీనితో పగలు ఎకరంన్నర, రాత్రిపూట రెండెకరాల విస్తీర్ణంలోని పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీని ఖరీదు రూ. 1,800. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో ఉంచడంతో దేశంలోని 12 రాష్ట్రాల నుంచి రైతులు ఇప్పటికే సుమారు వెయ్యి గాలిమరలను కొనుగోలు చేశారని తెలిపారు. ఇటీవల సంగారెడ్డి ‘ఆత్మ’ 5 గాలిమరలను కొనుగోలు చేసి రైతులకు అందించిందని శేషగిరిరావు తెలిపారు. కోస్తా జిల్లాల్లో ఆక్వా చెరువుల రైతులు కూడా దీనిపై వాడుతున్నారన్నారు.

ఈ ఉత్సాహంతో శేషగిరిరావు సౌర విద్యుత్తుతో నడిచే మరో పరికరాన్ని తయారు చేశారు. అడవి జంతువులు, పక్షుల నుంచి 6–8 ఎకరాల్లో పంటలను ఈ పరికరం కాపాడగలుగుతుంది. విచిత్ర శబ్దాలు చేసే 8 రకాల బజర్లు ఇందులో అమర్చారు. ఒక్కో బజరు ఒక్కో ఎకరంలో అమర్చుకోవచ్చు. రైతు కూర్చున్న దగ్గర నుంచే బజర్లను ఆన్‌/ఆఫ్‌ చేయడానికి వీలుంది. రెండు సోలార్‌ లైట్లను కూడా వెలిగించుకోవచ్చు. దీని ధర రూ. 9 వేలు. ఏయే వేళల్లో శబ్దాలు చేయాల్సిందీ నిర్దేశించే టైమర్‌ను కూడా జోడించుకోవచ్చని, దానికి రూ. 2,500 అదనంగా ఖర్చవుతుందని శేషగిరిరావు(99486 61386) తెలిపారు. పేటెంట్‌కు ధరఖాస్తు చేయనున్నట్లు వివరించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top