అప్పుడు నీళ్లు తాగితే బరువు తగ్గడం ఖాయం

Want To Loose Weight Drink 2 Cups Of Water Before Every Meal Says Study - Sakshi

వర్జీనియా : బరువు తగ్గడం అంత వీజీ కాదు. లావుగా ఉన్నవాళ్లకు తెలుసు ఆ బాధేంటో. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోలేక, వ్యాయాయం చేసే ఓపిక లేక బరువు ఎలా తగ్గాలా అని ఆలోచిస్తూనే కాలం గడిపేస్తుంటారు. మరికొంతమందైతే య్యూటూబ్‌ వైద్యాన్ని నమ్మి శరీరంపై రకరకాల ప్రయోగాలు చేసి విసిగిపోయుంటారు. ఇంకొందరు వేలు, లక్షల ఖరీదైన శస్త్రచికిత్సలు, స్టెరాయిడ్ల బాట పడుతుంటారు. అయితే మన దాహాన్ని తీర్చే నీటితోటే బరువు తగ్గొచ్చని మాత్ర అర్థం చేసుకోలేరు. అవును! తాజా సర్వేలో ఈ విషయమే వెల్లడైంది. స్ట్రిక్ట్‌ డైట్‌, వ్యాయామాలతో పాటు సరైన మోతాదులో, సమయంలో నీళ్లు తీసుకోవటం కూడా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని తేలింది. మనందరికి తెలుసు నీళ్లు మన శరీరానికి ఎంత అవసరమైన ఇంధనమో. నీరు తీసుకోవటం ద్వారా శరీరం పనితీరు చురుగ్గా ఉండట​మే కాకుండా.. శరీరంలోని మలినాలు బయటకు పంపించడంలో నీరు కీలకపాత్ర పోషిస్తుంది.

అంతేకాదు బరువు తగ్గడంలోనూ నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని బ్లాక్‌బర్గ్‌కు చెందిన కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ లైఫ్‌​ సైన్సెస్‌ యాట్‌ వర్జీనియా టెక్‌లోని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ న్యూట్రిషన్‌,ఫుడ్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజెస్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఆహారం తీసుకోబోయే ముందు రెండు కప్పుల నీరు తాగిన వారు 12 వారాల్లో 2 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. ఈ పరిశోధన కోసం 48 మందిపై ప్రయోగం జరిపారు. వీరంతా 55నుంచి 75 సంవత్సరాలు కలిగిన వారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఓ గ్రూపును మూడు పూటల ఆహారం తీసుకునే ముందు రెండు కప్పుల నీరు తాగేలా చేశారు. మరో గ్రూపుకు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. 12వారాల తర్వాత భోజనాలకు ముందు నీరు తీసుకున్న వారు అదనంగా 2కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. 

తినే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?
మనం ఆహారం తీసుకోవటానికి ముందు 2 కప్పుల నీరు తీసుకున్నట్లయితే తక్కువ ఆహారాన్ని భుజిస్తాము. తద్వారా తక్కువ కాలరీలు మన శరీరానికి అందుతాయి. తక్కువ కాలరీల ద్వారా కొత్తగా కొవ్వు పేరుకుపోవటానికి అవకాశం ఉండదు కాబట్టి బరువు తగ్గటం సాధ్యమవుతుంది. మరింత తొందరగా బరువు తగ్గాలనుకునేవారు చెక్కెర, కాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవటం మానేయాలి. అయితే అధికంగా నీరు తీసుకోవటం కూడా కొన్ని సందర్భాల్లో చెడుగా పరిణమిస్తుందని గుర్తుంచుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top