ఫిల్మ్‌ఫేర్‌లో ఆస్కార్‌ గౌను

Urvashi Rautela sat on 4 chairs at Filmfare Awards 2020 - Sakshi

ఆస్కార్‌ వేడుకల్లో ఎరుపు రంగు తివాచీ రిచ్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాతి ‘రిచ్‌’దనమంతా నటీమణుల ఎర్ర గౌన్లదే. ఇటీవలి మన ఫిల్మ్‌ఫేర్‌ సినిమా అవార్డుల వేడుకల్లో కూడా ఆస్కార్‌ కళ కనిపించింది! కొంచెం వాళ్లని ఫాలో అయినట్లున్నారు మనవాళ్లు. గౌహతిలోని ఇందిరాగాంధి అథ్లెటిక్‌ స్టేడియంలో జరిగిన ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవానికి నటి ఊర్వశీ రౌటేలా ఎర్రరంగు గౌను వేసుకుని వచ్చారు. ఒక్కక్షణం అక్కడివారికి ఇది హాలీవుడ్డో, బాలీవుడ్డో అర్థం కాలేదు. ఊర్వశి వేసుకొచ్చిన గౌను వేదికకు ఆస్కార్‌ కళను తెప్పించింది.

ఆ గౌనుతో ఆడియెన్స్‌ మధ్యలో కూర్చోడానికి ఆమెకు నాలుగు సీట్లు అవసరం అయ్యాయి. ఆమెకు ఒక సీటు, ఆమె గౌను అంచులు మడతలు పడకుండా ఉండేందుకు మూడు సీట్లు! కూర్చున్నాక అంతపెద్ద గౌను ఎక్కడో ఒకచోట మడత పడకుండా ఉంటుందా? ఆ మడతల్ని సరిచేయడానికి ఒక టీము. గౌనుకు ఎంత ఖర్చయిందో తెలీదు కానీ.. గౌన్‌ కుట్టడానికి మాత్రం 730 గంటలు పట్టిందట! అంటే నెలకు పైగానే. ఈ వివరాలన్నీ అప్పుడు బయటికి రాలేదు. ఈవెంట్‌ అయ్యాక కాస్త ఆలస్యంగా బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో గౌను విశేషాలన్నిటినీ కుప్పపోశారు ఊర్వశి.

ఊర్వశి హరిద్వార్‌ అమ్మాయి. వయసు 25. ఏడేళ్లుగా సినిమాల్లో ఉన్నారు. తొలి సినిమా ‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’. ఇటీవలి సినిమా ‘పాగల్‌పంతీ’. మధ్యలో ఏడు సినిమాలు. ఈసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానంలో ప్రతిభను పక్కన పెట్టారన్న విమర్శలు చాలా వచ్చాయి. వాటి గురించి ఊర్వశి ఏమీ మాట్లాడడం లేదు. అవార్డొచ్చి, ఆ అవార్డును తీసుకోడానికి వెళ్లలేదు ఆమె. ఆహ్వానం వస్తే వెళ్లింది. కాసేపు అలా కూర్చొని వచ్చింది. వివాదాలకు దూరంగా ఉండేవాళ్లెప్పుడూ సంతోషంగా ఉంటారు.

నాలుగు కుర్చీలలో ఊర్వశీ రౌటేలా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top