
‘వణక్కమ్ (నమస్కారం) మనకు ప్రభుత్వం మంచి బస్సు ఇచ్చింది. దీనిని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించండి. చెత్త పారేయవద్దు. నా దగ్గర చింతపండు క్యాండీ ఉంది, మీకు వికారంగా ఉంటే అడగండి, ఇస్తాను, మీకు వాంతి అయ్యేలా ఉంటే చెప్పండి, బ్యాగు ఇస్తాను. ఎవ్వరూ మొహమాటపడక్కర్లేదు’ అంటూ ప్రయాణికులను మృదువుగా ఆహ్వానిస్తారు శివషణ్ముగమ్. కోయంబత్తూరు సింగనల్లూరు బస్ స్టాండ్ బస్ హార్న్ శబ్దాలతో, టైర్ల బర్‌బర్ ధ్వనులతో, దుర్వాసనతో, బాగా రద్దీగా, గందరగోళంగా ఉన్న సమయంలో శివషణ్ముగమ్ పిలుపు అమృతంలా చెవిని తాకుతుంది. ఈయన మాట్లాడిన మాటల వీడియో కిందటి వారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనకు తక్షణమే ప్రజలలో మంచి గుర్తింపు కూడా వచ్చింది. చాలా న్యూస్ చానెల్స్ ఆయనను పలకరించాయి.
ఒక చిన్న స్వాగతవచనం ఎంతోమందిని ఎందుకు ఆకర్షించింది? సాధారణంగా మన బస్ కండక్టర్లు, పని ఒత్తిడి కారణంగా కాని, ఇతర కారణాల వల్ల కాని చాలా చిరాకుగా, నిర్లక్ష్యంగా గాని ప్రవర్తిస్తుంటారు. స్నేహపూర్వకంగా పలకరించరు. కాని శివషణ్ముగమ్ మాత్రం ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాయువు పీల్చుకునేలా ప్రయాణికులకు తోడ్పడతారు.తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన కోయంబత్తూరు – మదురై బస్సులో కండక్టరుగా పనిచేస్తున్నారు శివషణ్ముగమ్. ఆ బస్టాండ్‌లో ‘మదురై బై పాస్... మదురై బై పాస్’... అంటూ బస్ ఫుట్‌బోర్డు మీద నిలబడి, ప్రయాణికులను ఆప్యాయంగా పిలుస్తుంటారు శివషణ్ముగమ్.
ఆయనకు ఈ రూట్‌లో ఇటీవలే కొత్త బస్సును కేటాయించారు. నీలిరంగు యూనిఫారమ్‌లో, చేతిలో సంచితో బస్ డోర్ దగ్గర నిలబడి, 52 సంవత్సరాల శివషణ్ముగమ్ ‘‘మీరంతా ఈ బస్సులో ప్రయాణించడానికి ఏదో ఒక కారణం ఉంది. మీ అందరికీ శుభం జరగాలి. మీ యాత్ర దిగ్విజయంగా జరగాలని మా డ్రైవర్ సదాశివం, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు సహాయపడడానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని చెబుతారు.
విమానంలోకి ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ మాట్లాడే స్వాగత వచనాలను పోలి ఉంటాయి శివషణ్ముగమ్ మాటలు. కాని ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన విమానం ఎక్కలేదు. ఇది తనకు తానుగా అలవాటు చేసుకున్న సంప్రదాయం.23 సంవత్సరాలుగా టీఎన్‌ఆర్‌టీసీలో పని చేస్తున్న శివషణ్ముగమ్ ఇటువంటి పలకరింపును ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులంతా ఈ బస్సును పరిశుభ్రంగా ఉంచుతారని ఆశిస్తున్నా ను’ అంటూ అందరినీ ఉత్తేజపరుస్తూ, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రశాంత చిత్తంతో ప్రారంభించేలా చేస్తున్నారు శివషణ్ముగమ్.
– జయంతి