
వీళ్లకి ఎలా చెప్పాలి?
చదువు ఇచ్చిన ఆత్మవిశ్వాసమో, ఏమోగానీ... అవసరమైనప్పుడు ధైర్యంగా మాట్లాడగలను నేను. అది నాకు కాలేజీ రోజుల్లో డ్యాషింగ్ లేడీ అన్న బిరుదు తెచ్చిపెడితే... పెళ్లయ్యాక మాత్రం పొగరుబోతు, పెంకిపిల్ల అన్న పేర్లు తగిలించింది.
వేదిక
చదువు ఇచ్చిన ఆత్మవిశ్వాసమో, ఏమోగానీ... అవసరమైనప్పుడు ధైర్యంగా మాట్లాడగలను నేను. అది నాకు కాలేజీ రోజుల్లో డ్యాషింగ్ లేడీ అన్న బిరుదు తెచ్చిపెడితే... పెళ్లయ్యాక మాత్రం పొగరుబోతు, పెంకిపిల్ల అన్న పేర్లు తగిలించింది.
నేను ఎంబీయే చేశాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే మంచి సంబంధం కుదిరింది. ఏళ్లపాటు కూర్చుని తిన్నా తరగని ఆస్తి, అబ్బాయికి మంచి వ్యాపారం ఉండటంతో మావాళ్లు ఆ సంబంధాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఉద్యోగం చేయాలని ఉందని చెబితే... అన్నీ వచ్చి ఒళ్లో వాలుతుంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందమ్మా అంటూ నా మాట తీసిపారేశారు. అయినా ధైర్యం చేసి పెళ్లికి ముందే నా మనసులోని ఆశను మావారితో చెప్పేశాను. ‘దాందేముంది... చూద్దాంలే’ అన్నారు. ఎగిరి గంతేసి పెళ్లి చేసేసుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది... ‘చూద్దాంలే’ అన్న మాటని ‘చేద్దువుగానిలే’ అన్నట్టుగా నేను ఫీలైపోయానని.
అత్తమామలకు ఆయన ఒక్కరే కొడుకు. పొద్దున్న లేచి మామగారు, ఆయన వ్యాపార పనుల మీద వెళ్లిపోతారు. అత్తయ్య పార్టీలు, ఫంక్షన్లంటూ వెళ్తుంటారు. నన్నూ రమ్మంటారు కానీ అన్నిసార్లూ వెళ్లబుద్ధి కాదు. దాంతో ఇంట్లో ఒక్కదాన్నే ఉండిపోవాలి. ఏదైనా చేద్దామన్నా పనివాళ్లు ఉన్నారు. కల్పించుకుని చేసినా ఎంతసేపని టైమ్‌పాస్ అవుతుంది! చదువుకున్నాను కదా ఉద్యోగం చేస్తానంటే... అంత అవసరం లేదని తేల్చేశారు. పోనీ ఆయన వ్యాపారంలోనైనా నా చదువును, తెలివిని వాడుకుంటారేమోనని ఆశపడితే... అది కూడా లేదు. అసలు ఆడవాళ్లు ఉద్యోగం, వ్యాపారం లాంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనీ, ఆలోచించకూడదనీ వారి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది.
ఎట్లాగో ఓ సంవత్సరం పాటు భరించాను కానీ ఇక నావల్ల కాలేదు. నేను ఉద్యోగం చేసి తీరతానని కరాఖండిగా చెప్పేశాను. దాంతో అమ్మానాన్నలకు ఫోన్ చేసి... మీ అమ్మాయికి పొగరు, పెంకితనం పెరిగిపోయాయి, మా మాట వినడం లేదంటూ కంప్లయింట్ చేశారు. వాళ్లేమో... ‘నీకేమైనా పిచ్చి పట్టిందా, బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకు’ అంటూ క్లాసులు పీకుతున్నారు. నాకు అర్థం కానిదేమిటంటే... అందరికీ ఒకే విషయం ఎలా సంతోషాన్నిస్తుంది? ఇంట్లో ఉంటే చాలు అనుకున్నప్పుడు నాలాంటి చదువుకున్న అమ్మాయిని, స్వతంత్ర భావాలున్న అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి? ఇంట్లో ఉండాలనుకునే అమ్మాయిని చేసుకోవచ్చు కదా? ఇదే అంటే ఆయనతో పెద్ద గొడవ. వాదించలేక మళ్లీ నేనే మౌనంగా అయిపోతాను. నా మాటను గెలిపించుకోలేక నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తాను. అయినా వాటిని ఎవరూ తుడవరు. ఎందుకంటే.. అర్థం లేని విషయానికి ఏడుస్తున్నానని వాళ్ల భావన. మనిషికి డబ్బు, సౌకర్యాలు, ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, తృప్తినిచ్చే విషయాలు, సంతోషాన్ని కలిగించే అంశాలు చాలా ఉంటాయన్న విషయాన్ని వీళ్లకెలా చెప్పాలి?!
- సంగీత, హైదరాబాద్