
ముంజలు తినడానికే కాదు... ఒకింత పారదర్శకంగా, చేతుల్లోంచి జారిపోతూ చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ముంజలను ఇంగ్లిష్‌లో ‘ఐస్ ఆపిల్’ అంటారు. ముంజలు తినడం వల్ల ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల జాబితాకు అంతే లేదు. వాటిలో కొన్ని.
ముంజల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల తినగానే కడుపు నిండిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకున్నవారికి ముంజలు ఒక రుచికరమైన మంచి మార్గం. ముంజలు వికారాన్ని సమర్థంగా నివారిస్తాయి. ముంజలు మలబద్దకాన్ని నివారించి, సుఖవిరేచనమయ్యేలా చూస్తాయి. ఇలా ఇవి అందరిలోనూ మలబద్దకాన్ని నివారించి, దానివల్ల వచ్చే ఎన్నో అనర్థాలు రాకుండా చూస్తాయి. అయితే గర్భవతుల్లో మలబద్దకం చాలా సాధారణం కాబట్టి ముంజలు తినడం వల్ల వారికి మంచి ప్రయోజనం ఉంది. వడదెబ్బ నుంచి రక్షించే రుచికరమైన మంచి మార్గం ముంజలే. వాటిల్లో స్వాభావికంగా ఎక్కువగా ఉండే నీటిపాళ్లు, పుష్కలంగా ఉండే ఖనిజలవణాలు.. వ్యక్తులను ఎండదెబ్బ వల్ల కలిగే డీ–హైడ్రేషన్‌నుంచి రక్షిస్తాయి.
చికెన్‌పాక్స్‌తో బాధపడేవారికి ముంజలు స్వాభావికమైన ఔషధం అని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను ముంజలు నివారిస్తాయి. ముంజలు ఒంట్లో పేరుకొనిపోయిన విషాలను సమర్థంగా తొలగిస్తాయి. ఫలితంగా ఇవి కాలేయంపై పడే ఒత్తిడిని తొలగించి, కాలేయానికి మంచి ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. ఇలా విషాలను తొలగించడానికి ముంజల్లోని పొటాషియమ్ బాగా ఉపయోగపడుతుంది. ముంజల్లో పొటాషియమ్ పాళ్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి రక్తపోటును కూడా సమర్థంగా నివారిస్తాయి. ముంజల్లో చలవచేసే గుణం ఉన్నందువల్ల వేసవిలో వచ్చే గడ్డలను నివారిస్తాయి. ఒకవేళ గడ్డలు వచ్చినా అవి ముంజలు తినేవారిలో త్వరగా తగ్గిపోతాయి. అంతేకాదు.. ముంజలతో చలవ చేసే ఆ గుణమే చెమటకాయలనూ తగ్గిస్తుంది. ముంజల్లోని యాంటా ఆక్సిడెంట్స్ వల్ల అవి రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. ముంజల్లో పుష్కలంగా ఉండే ఫైటోకెమికల్స్ వల్ల వయసు పైబడటంతో కనిపించే లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే క్లాట్స్‌ను ముంజలు నివారిస్తాయి. దాంతో గుండెజబ్బులు తగ్గిపోతాయి. గుండెపోటు ముప్పు దూరమవుతుంది.