
రోహిణి కార్తె అనగానే అందరికి భయమే. తెలుగు పంచాంగం ప్రకారం రోహిణి కార్తె ఎప్పుడు మొదలవుతుందా అని టెన్షన్ పడుతుంటారు. ఈ టైంలో ఉండే ఎండలు మాములుగా ఉండావు. ఠారెత్తించేలా భగభగమంటాడు సూర్యుడి. వేసవిలో ఉండే భగభగ వేడి గాల్పులు ఒక ఎత్తు..ఒక్క ఈ రోహిణి కార్తెలో ఉండే ఎండలు ఒక లెవెల్. అయితే ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 ఆదివారం నుంచి జూన్ 8, 2025న ముగుస్తోంది. అంటే దాదాపు 15 రోజుల వరకు ఉంటుందని పంచాంగం చెబుతోంది. ఈ ఏడాది వేసవికాలం తన సంప్రదాయ లక్షణాలకు తిలోదాకాలు ఇచ్చేసినట్లుగా ఉంది. సాధారణంగా మే నెలలో ప్రారంభమయ్యే రోహిణి కార్తె కాలంలో భూమి బంగాళా బండలా వేడెక్కి, రోళ్లు పగిలిపోవడం సహజం. అంతేగాదు ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుని, కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఈ సందర్భంగా రోహిణి కార్తె అంటే ఏమిటి.. ఈ కాలంలో సూర్య భగవానుడు ఎందుకని తన ప్రతాపాన్ని చూపుతాడనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రాలు, గ్రహాలను బట్టి పంచాంగాన్ని రూపొందిస్తారు. జాతకాలను తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో సూర్యోదయం కాలానికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆరోజు ఆ నక్షత్రం పేరు పెట్టారు. అదే విధంగా పౌర్ణమి వేళ చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరును నిర్ణయించారు. ఇదిలా ఉండగా తెలుగు వారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు.
ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అంతేకాదు ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రూపొందించారు. అందులో ఒకటే రోహిణి కార్తె.
ఎందుకలా అంటారంటే..?
రోహిణి కార్తె అనగా మే నెలలో సూర్య భగవానుడు మన నడి నెత్తి మీదకు వస్తాడంట. అంటే మాడు మధ్య భాగానికి వస్తాడు. అంతే కాకుండా చాలా ఉగ్రరూపంగా, చండ్ర ప్రచండడుగా మారిపోయి, నిప్పులు కక్కుతూతాడంట.
అవి భూమిని తాకగానే, భూమి మీద ఉన్న తేమ హరించుకపోతుంది. మొత్తం వేడిగా మారిపోతుంది. అంతే కాకుండా రాళ్లలో కూడా ఉండే కాస్త తేమ కూడా ఇంకి పోయి రోళ్లకు పగుళ్లు ఏర్పడతాయని అంటున్నారు పెద్దలు. అందువలన ఈ కాలం రాగానే రోళ్లు పగులుతాయి అంటారంట.
కానీ, రోహిణి కార్తెను మాత్రం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. వేసవిలో వచ్చే రోహిణి కార్తెలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. వేసవిలో వచ్చే చివరి కార్తె ఇదే. రోహిణి కార్తె వెళ్లిన తర్వాత నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వర్షాలు.. చల్లదనం.. ఆపై మనందరికీ తెలిసిందే.
పురాణాలు ఏం చెబుతున్నాయంటే..
రోహిణి కార్తె సమయంలో దానధర్మాలు చేయడం అత్యంత ఫలదాయకం అని.. పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో మూడు రకాల చెట్లను నాటడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటి గురించి పురాణాల్లో కూడా మునులు, రుషి పుంగవులు ప్రస్తావించారు. హిందూ మతంలో రావి చెట్టును పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రావి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు. కనుక రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి కార్తెలో రావి చెట్టును నాటిన వ్యక్తి తన పూర్వీకుల ఆశీర్వాదం పొందుతాడు.
రోహిణి కార్తె సమయంలో రావి చెట్టును నాటడం వలన సూర్యుని వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని శాంతింపజేయడంలో రావి చెట్టు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ చెట్టును నాటడం ద్వారా జాతకంలో సూర్యుని ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు. అందుకే రోహిణి కార్తె సమయంలో కనీసం ఒక రావి చెట్టును అయినా నాటడం వల్ల దేవతలు సంతోషిస్తారని, అనుగ్రహం కురిపిస్తారని విశ్వాసం.
సనాతన ధర్మంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శనిశ్వరుడి ఇష్టమైన చెట్టుగా చెబుతాయి పురాణాలు. ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషం తొలగి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. పైగా కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.
నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి. తెల్లని రంగు కలిగినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది.
ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి వంటి సామాజిక కార్యక్రమాలు చేయడం వలన గ్రహదోషాలుపోయి సుఖసంతోషాలతో ఉంటారనేది పురణా వచనం.
(చదవండి: అంబేద్కర్ యాత్ర... త్రినేత్రుడి దర్శనం)