‘అమ్మా! నన్ను కూడా...’

Syama Sastri Also made a lot of Effort in His songs - Sakshi

సంగీత సాహిత్యం

ఒక మహర్షి బీజాక్షర సంయుక్తమైన శ్లోకాన్ని అందించినట్లే శ్యామశాస్త్రి గారు కూడా తన కీర్తనల్లో అంతటి ప్రయత్నం చేసారు. ‘సుమేరు మధ్య వాసినీ వరదే పరదేవతా..’ –మధ్యమా స్వరూపంలో ఉన్న వాక్కుకు అధిష్ఠానమైన దేవతకు పరదేవత–అని పేరు, ‘సుమేరు మధ్య వాసిని, పరదేవత, హిమాద్రిసుతే’’ ..అది లోపల శ్యామశాస్తిగ్రారు దర్శనం చేస్తూ బయటికి వ్యక్తీకరించిన వైఖరీ వాక్కు. కనుక  ఆ కీర్తనను మీ ఇంట్లో  తెలిసి విన్నా, తెలియకుండా విన్నా ఆ వాక్కులోంచి శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి అయి అమ్మవారి అనుగ్రహం వైఖరీ రూపంలో ఒక్కసారి శబ్ద బ్రహ్మంగా ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. అది మన జీవితాలలో ఎటువంటి సానుకూల మార్పులనయినా తీసుకురాగలదు. అదీ వాగ్గేయకారులు మనకు చేస్తున్న ఉపకారం.శంకరాచార్యులు ఎక్కడయినా ప్రార్థన చేస్తే...అది శంకరులు చేస్తున్నట్లు ఆయన పేరుతో ఉండదు.

‘అమ్మా ! నన్ను కూడా...’’ అంటారు. అంటే ఆ శ్లోకాన్ని తరువాత కాలంలో ఎవరయినా తెలిసి కానీ, తెలియక కానీ చదువుకుంటే, అది వారే ప్రార్థన చేస్తున్నట్లుగా భావించి, వారిపట్ల అమ్మవారి అనుగ్రహం ప్రసరించాలని అలా చేసారు. అందుకే  వారు జగద్గురువులు అయ్యారు.అలాగే శ్యామశాస్తిగ్రారు కూడా ‘శ్యామకష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హేమాద్రిసుతే పాహిమాం..’’ అన్న కీర్తనలోకూడా ఆయన మనకు ఇటువంటి ఉపకారమే చేస్తున్నారు.‘అమ్మా! నీవెటువంటిదానివో తెలుసా ! సుమేరు మధ్య వాసినివి. నీలవేణి కలిగిన దానివి’ అంటే నల్లని జడ కలిగిన దానివి. కబరీబంధం(జడ) ఉన్నదానివి–అంటున్నారు. అమ్మవారి కబరీ బంధం మన కంటికి కనబడదు. అమ్మవారిని ఎదురుగుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అమ్మవారి వెనక్కి వెడితే – కిరీటానికి మధ్యలో కొంచెం ఖాళీ ఉండి అందులో కబరీ బంధం ఇముడుతుంది.

దానిని దర్శనం చేస్తే మన అజ్ఞానం పోతుంది.నల్లకలువల దండలా ఉండే నల్లటి జడ, నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది ? అది తెలియాలంటే లలితా సహస్రనామంలోకి వెళ్ళాలంటారు. దేవతలను ఉపాసన చేసేటప్పడు కేశాది, పాదాది పర్యంతం(తల దగ్గర మొదలుపెట్టి పాదాల వరకు) చేయాలి. అదే పురుష స్వరూపాన్ని చేసినప్పుడు పాదాది, కేశాది పర్యంతం చేయాలి. కానీ లలితా సహస్రంలో ముందు తల చెప్పరు. ‘చతుర్బాహుసమన్విత’ అన్నారు. అలా చేతులతో ఎందుకు మొదలుపెట్టారో శ్యామశాస్తిగ్రారు ఆ రహస్యాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు(చతుర్బాహు సమన్విత)పట్టుకుంది. రాగం కోర్కెను జయించాలి.

పొద్దస్తమానం సంసార లంపటంతో కూడిన కోర్కెలు కోరుకోవడం కాదు. ‘అమ్మా ‘ నీ చరణ సేవ ఎన్నడు చేస్తానమ్మా!’ అన్న కోర్కె పుట్టాలి. అటువంటి కోర్కెలు కోరేటట్లుగా మనస్సును మార్చగలిగే స్థితిని ఇచ్చి వరాలిస్తుంది కనుక ‘వరదే’ అన్నారు. అమ్మవారి చేతిలో ఉన్న బాణాల ఆకర్షణ చేత–‘క్రోధాంకుశోజ్వల’...క్రోధాన్ని క్రోధంతో, కోరికను తిరస్కతితో గెలవబడితే– మనస్సునుండి అజ్ఞానం తొలగి కబరీబంధ దర్శనమవుతుంది. అందుకని చేతులు ముందుగా చెప్పి తరువాత తల చెబుతారు అమ్మవారికి. నీ పాద సేవ చేయాలనే కోర్కెలను మాలో కలిగించి వాటిని నువ్వే తీర్చే స్వరూపమున్న ‘వరదే’, ‘హిమగిరి సుతే’ పాహిమాం ! అంటున్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top