ఆఖరి ఆదివారం

Students make a mobile library and are getting more attention to reading for everyone - Sakshi

విశేషం

ఒలియా అనేది ఒడిశా రాష్ట్రంలో ఒక చిన్న గిరిజన గ్రామం. అక్కడ జనాభా వెయ్యి కంటె తక్కువే. ఈ గ్రామం భువనేశ్వర్‌ నుంచి 110 కి. మీ. దూరంలో ఉంది. ఇంత తక్కువమంది ఉన్న ఈ గ్రామంలో చదువుకున్న వారు 70 శాతానికి పైగానే ఉన్నారు. అయితే వారిలో పుస్తకాలు చదివే అవకాశం కొద్దిమందికి మాత్రమే ఉంది!   ఇది గమనించిన స్థానిక తరిణి నోడల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు గ్రామంలో అందరికీ పుస్తకాలు అందుబాటులోకి తేవాలనుకున్నారు. తమ టీచర్‌ అయిన ప్రజ్ఞా ప్రమీత తో ఈ విషయం చెప్పినప్పుడు వారికో పరిష్కారం దొరికింది. వారి గ్రామంలో ఒక్క లైబ్రరీ కూడా లేదు. సొంత లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని భావించారు. అది కూడా సంచార లైబ్రరీ అయితే మంచిదనుకున్నారు. ఆ ఆలోచనకు పాఠశాల హెడ్‌మాస్టర్‌ ఎంతో సంతోషించారు. తన వంతు ప్రోత్సాహం విద్యార్థులకు అందించారు. రంగురంగుల పుస్తకాలు బయటకు కనిపిస్తూ, అందరినీ ఆకర్షించేలా వెదురుతో ఒక మొబైల్‌ బుక్‌ ర్యాక్‌ తయారుచేశారు. అందులో పుస్తకాలను అందంగా, ఆకర్షణీయంగా అమర్చారు. ‘రండి చదవండి’ అనే నినాదాలతో బ్యానర్లు తయారుచేశారు.

వీటిని చూసి గ్రామస్థులు ఆకర్షితులయ్యారు. పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక పుస్తకంలో పొందు పరచడానికి అనువుగా పన్నెండు మంది విద్యార్థులతో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ఈ లైబ్రరీ ఒలియా గ్రామానికి వస్తుంది. అలా గ్రామస్థులు పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డారు. ఎప్పుడు ఆఖరి ఆదివారం వస్తుందా అని ఎదురుచూడటం ప్రారంభించారు. ఈ గ్రామంలో మొబైల్‌ లైబ్రరీ నడుస్తోందనే విషయం ఇరుగుపొరుగు గ్రామాల వరకు వ్యాపించింది. వారి గ్రామాలు కూడా లైబ్రరీని తీసుకురమ్మని ఈ విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. ఇది తెలిసి టాటా స్టీల్స్‌ వారి పాఠశాల (ఒడిశా) లలో కూడా అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూశారు. ఇంత విజయం సాధించిన ఈ ప్రాజెక్టుకి ‘పార్లే – జి’ వారు ‘ఈజీ టు రెప్లికేట్‌’ విభాగంలో 50,000 రూపాయల నగదు బహుమతి అందచేశారు. ఇప్పుడు తరిణి నోడల్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో 6 – 14 సంవత్సరాల వయసున్న విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, టీచర్లు అందరూ ఈ మొబైల్‌ లైబ్రరీలో పాలు పంచుకుంటున్నారు. ఈ లైబ్రరీ పుస్తకాలం కోసం ఒక తరగతి గదిని ప్రత్యేకంగా కేటాయించారు. నెలకోసారి లైబ్రరీ కమిటీ సమావేశమై లైబ్రరీకి సంబంధించిన అంశాలను చర్చిస్తున్నారు. 
– రోహిణి 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top