లోతైన ఆలోచన

This is a story that a teacher told his disciples - Sakshi

చెట్టు నీడ 

ఓ గురువు తన శిష్యులకు చెప్పిన కథ ఇది.ఓ పడవలో ఓ దంపతులు ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి పడవ మునిగిపోయే ప్రమాదానికి లోనైంది. ఆ స్థితిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటానికి పక్కన ఓ చిన్న పడవ ఉంది.అయితే భార్యను వెనక్కు నెట్టి భర్త మాత్రం ఆ చిన్ని పడవెక్కి తప్పించుకుపోయాడు. అలా తప్పించుకుపోతున్న భర్తను చూసి భార్య పెద్దగా అరుస్తుంది.భార్య ఏమని చెప్పి ఉంటుందని గురువుగారు అడిగారు.

శిష్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క జవాబు చెప్పారు. కొందరు చెప్పిన జవాబు దాదాపుగా ఒకేలా ఉన్నాయి.అయితే ఒక్కడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు.గురువుగారు అతని వంక చూసి ‘‘నువ్వేమీ చెప్పలేదేంటీ’’ అని అడిగారు.‘‘‘మన బిడ్డను జాగర్తగా చూసుకోండి’ అని చెప్పి ఉండొచ్చు గురువుగారూ...’’ అన్నాడా శిష్యుడు.‘‘అవును నువ్వెలా చెప్పగలిగావు, నీకీ కథ ముందే తెలుసా’’ అని అడిగారు గురువు.‘‘లేదు గురువుగారు, మా అమ్మ కూడా చనిపోవడానికి కొన్ని నిముషాల ముందు ఇలాగే చెప్పింది మా నాన్నతో...’’ అన్నాడు శిష్యుడు.

ఆ మాటతో క్లాసంతా మౌనం ఆవరించింది.కాసేపటి తర్వాత గురువు మౌనాన్ని వీడి కథను కొనసాగించారు...ఆ భర్త తన కూతురుని కంటికి రెప్పలా చూసుకున్నాడు.కొంత కాలానికి తండ్రి మరణించాడు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు కుమార్తె తన తండ్రి రాసిన డైరీని చూసింది. అప్పుడే తెలిసింది ఆమెకు. తన తల్లికి నయం చేయలేని జబ్బు ఉన్నట్టు. ఆమె ఎలాగూ ఎక్కువ కాలం బతకదని.పడవ మునిగిపోతున్న దుర్ఘటనను తన తండ్రి ఇలా రాసుకున్నారు.

నీతోపాటు నేనూ సముద్ర గర్భంలోకి కలిసి పోవలసింది. మన ఇద్దరి మరణమూ ఒకేసారి జరగాల్సింది. కానీ నేనేం చెయ్యను... మన బిడ్డను చూసుకోవడానికి నేను మాత్రమే ఒడ్డుకు చేరుకోవలసి వచ్చింది.కథను ఇంతటితో ఆపేసి గురువుగారు చెప్పారు...జీవితంలో మంచీ చెడూ అన్నీ జరుగుతాయి. అన్నింటికీ కారణం ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో అది అర్థం కాకుండా పోవచ్చు. కనుక మనం లోతుగా ఆలోచించకుండా ఓ నిర్ణయానికి రాకూడదు.
– యామిజాల జగదీశ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top