నాన్నను మా అమ్మ ‘... మనిషి’ అని  కులం పేరుతో తిట్టేది!

This story is about the murders of intermarriage marriages - Sakshi

ఓ జర్నలిస్టు ఆత్మ కథనం

అయితే ఈ కథనం.. కులాంతర వివాహాల గురించి కాదు. పరువు హత్యలు  జరిగినప్పుడు కులపట్టింపులపై జర్నలిస్టులు సంధించే ప్రశ్నల గురించి!  ‘ఈ ధోరణి సరికాదు’ అని ఒక వెబ్‌సైట్‌కు రాస్తూ, తన తల్లిదండ్రుల  జీవితాల్ని సమాజం ముందు పరిచారు ఆ అజ్ఞాత మహిళా జర్నలిస్టు.

‘‘మా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. మా అమ్మ సంప్రదాయ నేత పనివారి కుటుంబంలో పుట్టింది. మా తాతయ్య దర్జీగా పనిచేసేవాడు. పేదరికం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, మా అమ్మని 1970 ప్రాంతంలో చదువుల కోసం మద్రాసు విశ్వవిద్యాలయానికి పంపాడు. అమ్మ బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి తన ఆరుగురు తోబుట్టువులకు అండగా ఉంటుందని భావించాడు తాతయ్య.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే బాగానే ఉంటుంది. అక్కడ చదువుకునే రోజుల్లోనే అమ్మకి మా నాన్నతో పరిచయం ఏర్పడింది. నాన్న దళిత కుటుంబానికి చెందినవాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకుందామనుకున్నారు. అగ్ర వర్ణంలో పుట్టిన అమ్మాయి, దళిత అబ్బాయిని వివాహం చేసుకోవడమేంటని అమ్మ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. మరోవైపు నాన్న దళితుడనే కారణంగా లిటరేచర్‌లో పి.హెచ్‌.డి. చేసే అవకాశం రాలేదు. ఒకవేళ నాన్న భయపడి  తన గ్రామానికి Ðð ళ్లిపోతే, అక్కడ సైకిల్‌ రిపేర్‌ చేసుకుంటూ జీవనం సాగించవలసి వచ్చేది. ఇద్దరూ ధైర్యం చేశారు. బెంగళూరులో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేయడం ప్రారంభించారు.

నాన్నపై ఒత్తిడి తెచ్చారు
వివాహం జరిగిన కొన్ని నెలల తరవాత, ఇరు కుటుంబాల వారు అమ్మనాన్నలను చూడటానికి  వచ్చారు. నాన్న దళితుడు కావడంతో, తాతయ్య వాళ్లు నాన్నకి గౌరవం ఇవ్వకపోగా, అమ్మని చదివించడానికి అయిన ఖర్చు ఇవ్వమని ఒత్తిడి చేశారు. అమ్మకు ఒక బిడ్డ పుట్టి, రెండవసారి గర్భవతిగా ఉన్న సమయంలో, అమ్మ తోబుట్టువులు వచ్చి, డబ్బు కోసం ఒత్తిడి చేశారు. రెండుకుటుంబాలను పోషించడం కష్టం కావడంతో, ప్రసవించిన ఏడో రోజు నుంచి అమ్మ మమ్మల్ని ఇంట్లోనే ఉంచి ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. నేను పడుకున్న మంచం మీద నల్లులు కూడా ఉన్నాయి. నా పరిస్థితి చూసి అమ్మమ్మ వాళ్లు నన్ను వాళ్లతో తీసుకువెళ్లారు. నేను పుట్టిన రెండు సంవత్సరాలకి, అమ్మనాన్నలు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. దాంతో మళ్లీ అమ్మ దగ్గరకు వచ్చేశాను. మా ఆర్థిక పరిస్థితితో బాటు, అమ్మ వాళ్లకి మా బాధ్యతలు కూడా పెరిగాయి. అమ్మ వాళ్ల పుట్టింటివారిని, నాన్న వాళ్ల పుట్టింటివారినీ ఇద్దరినీ చూసుకునే బాధ్యత మరింత పెరిగింది. మా నాన్న తాను ఎందుకు డబ్బులు పంపలేకపోయాననే విషయం గురించి చెప్పబోతుంటే, ‘నువ్వు దళితుడివి. నీ మాటలు వినవలసిన అవసరం మాకు లేదు’ అని కఠినంగా మాట్లాడేవారు తాతయ్య. మా అమ్మ తన సోదరులకు, భర్తకు మధ్య నలిగిపోయేది. వారిని వెనకేసుకొస్తే నాన్నకి కోపం వచ్చేది. అమ్మానాన్నకు గొడవలు ఎక్కువైపోయాయి.

అమ్మ విడిపోయింది
అమ్మ తాను విడిగా ఉండటానికి నిశ్చయించుకుంది. అప్పటికి నా వయసు పది సంవత్సరాలు. నేను, మా అన్నయ్య ఇద్దరం నాన్నతోనే కలిసి ఉన్నాం. రానురాను బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. మా సెలవులన్నీ ఇంటికే పరిమితమైపోయాయి. ఏ పండుగను బంధువులతో జరుపుకునే అవకాశం లేకపోయింది. కేవలం చావుల సమయంలో మాత్రమే బంధువులు వస్తున్నారు. ప్రపంచం చాలా ఇరుకుగా కనిపించింది. మా అమ్మ తన ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడుపుతోంది. మా నాన్న ఎక్కడికైనా వెళ్లినప్పుడు అమ్మ ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్లేది. కొన్ని సంవత్సరాల తరవాత అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి బంధువులు ప్రయత్నించలేదు. ఇద్దరినీ కలపడానికి ఎవరూ లేకపోవడంతో వారి బంధం కూలిపోయింది. మా అమ్మనాన్నల మధ్యన వచ్చిన గొడవల కారణంగా, మా అమ్మ మా నాన్నను ‘... మనిషి’ అని కులం పేరుతో తిడుతుండేది. మా నాన్న బాధతో, ‘నేను బతికున్నంత కాలం ఈ మాటలు వింటూ ఉండవలసిందే’ అనేవారు. తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. నా మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోయాను. కులం నన్ను కూడా వెంటాడుతూనే ఉంది. నా కులం గురించి చెప్పగానే, అవతలి వారు విధించే నిబంధనలు వినడానికి నేను సిద్ధంగా లేను. దళితులను కులాంతర వివాహం చేసుకుంటే, బంధువుల నుంచి తెగదెంపులు ఎదుర్కోక తప్పడం లేదు. మనలో మతసహనం లోపిస్తోందనడానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నెన్నో. ఏటా జరిగే ఉత్సవాలకు కూడా దళితులను గుడి వెలుపల నుంచి మాత్రమే పూజలు చేసుకోవడానికి  అనుమతిస్తున్నారు. గ్రామాలలో ఈ విషయంలో ఇంతవరకు మార్పు రాలేదు. ఇంకా ప్రమాదం ఏమిటంటే.. హింస జరిగినప్పుడు మాత్రమే మతసహనం గురించి ప్రస్తావిస్తున్నారు. మిగతా సమయాల్లో కులరహిత సమాజం వైపుగా చైతన్యం తెచ్చే ప్రయత్నాలను మనమెందుకు చెయ్యం? అనిపిస్తుంది’’ అని ఆ జర్నలిస్టు ఆలోచన రేపారు.  

‘పరువు కోసం’ అని రాయకండి
గతేడాది నవంబర్‌ పదహారు తమిళనాడు ప్రజలకి కాళరాత్రిని మిగిల్చింది. ‘గజ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఆ తుపానులో కొట్టుకొచ్చిన రెండు మానవ దేహాల ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. ఒక యువ జంటను చంపేసి, కావేరీ నదిలోకి విసిరేశారు. వారివే ఆ మృతదేహాలు. ఆ అమ్మాయి వెనుకబడిన కుటుంబంలో పుట్టింది. అబ్బాయి దళితకులానికి చెందినవాడు. వారిలో ఈ దళితుడు అణగారిన వర్గానికి చెందినవాడి కింద లెక్క. సంప్రదాయాన్ని మైలపరచినందుకుగాను అమ్మాయి కుటుంబీకులు ఆ జంటను దారుణంగా హత్య చేశారు. దక్షిణ భారతదేశంలో ఇటీవల పరువు కోసం జరిగిన వరుస హత్యలలో ఇది మూడో హత్య. ఇటువంటి హత్యలు జరిగినప్పుడు, జర్నలిస్టులు ఆ ప్రాంతానికి చేరుకుని, ఆయా కుటుంబాల వారిని ప్రశ్నించి, కేసు పూర్వాపరాలు తెలుసుకుంటారు. ప్రతి కేసులోనూ ‘పరువు కోసం యువజంట దారుణ హత్య’ అనే రాస్తారు. నిత్యజీవితంలో కులం గురించి మరచిపోలేమా అనేది పక్కన పెడితే, వీటిపై ప్రత్యేక వార్తా కథనాలు ఇచ్చేటప్పుడు జర్నలిస్టులు ‘పరువు కోసం’ అంటూ తీర్పులు ఇచ్చేయకుండా.. సామాజిక ధోరణులను మలిచేలా సమస్య మూలాల్ని విశ్లేషించాలని ‘స్క్రాల్‌.ఇన్‌’లో వ్యాసం రాసిన ఆ పాత్రికేయురాలు కోరుతున్నారు.  
– జయంతి (‘స్క్రాల్‌.ఇన్‌’ ఆధారంగా) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top